‘చౌక’గా కొట్టేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-06-20T05:47:31+05:30 IST

జిల్లాలో అన్ని రేషన కార్డులు కలిపి 8.10 లక్షల దాకా ఉన్నాయి. 1,730 చౌకదుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా

‘చౌక’గా కొట్టేస్తున్నారు..!
వల్లూరులో తరలిస్తున్న అక్రమ చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు (ఫైల్‌ఫొటో)

పేదల బియ్యం.. పక్కదారి

అడ్డదారుల్లో బొక్కేస్తున్నపెద్దలు

డీలర్లు, కార్డుదారుల నుంచి సేకరణ

రీసైక్లింగ్‌ చేసి రాష్ట్ర బార్డర్‌ను దాటిస్తున్న వైనం


జిల్లాలో చౌక బియ్యం మాఫియా పేట్రేగుతోంది. పేదలకందాల్సిన బియ్యాన్ని కొందరి సహకారంతో అడ్డదారుల్లో మింగేస్తున్నారు. మరికొన్ని చోట్ల నేరుగా కార్డుదారుల వద్ద నుంచే బియ్యం కొనుగోలు చేసి, రాష్ట్ర బార్డర్‌ను దాటించేస్తున్నారు. ఇటీవల పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి అక్రమంగా తరలుతున్న చౌక బియ్యాన్ని పలు ప్రాంతాల్లో పట్టుకోవడంతో ఏ స్థాయిలో పొరుగురాషా్ట్రలకు తరలిస్తున్నారో తెలుస్తోంది. కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్డుదారులకు ఒకేసారి రెండు నెలల కోటాల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. ఇది కూడా అక్రమార్కులకు కలిసొచ్చినట్లు చెబుతున్నారు.


కడప, జూన 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని రేషన కార్డులు కలిపి 8.10 లక్షల దాకా ఉన్నాయి. 1,730 చౌకదుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు అందిస్తుంటారు. కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిని పనుల్లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపఽథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్డుదారునికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం అందిస్తున్నాయి. రెండు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇస్తున్నారు. ఈ బియ్యమే మాఫియాకు బాగా కలిసొచ్చింది. బద్వేలు, కమలాపురం, మైదుకూరు, లక్కిరెడ్డిపల్లె, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల ప్రాంతాల నుంచి అక్రమంగా బియ్యాన్ని సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల కార్డుదారుల నుంచి కిలో రూ.8-10 వంతున కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా సేకరించిన బియ్యాన్ని చెన్నూరు, ఖాజీపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో నిల్వచేసి రైస్‌మిల్లులకు చేరుస్తున్నారు. ఇక్కడ రీసైక్లింగ్‌ చేసి పాలిష్‌ పట్టి నాణ్యమైన బియ్యంలో కలిపేసి విక్రయిస్తున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, కడపలోని కొన్ని రైస్‌మిల్లుల్లో చౌకబియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి మామూలు బియ్యం పేరిట ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నట్లు సమాచారం. గ్రామాలు, పట్టణాల్లో సేకరించిన చౌకబియ్యాన్ని యూరియా సంచుల్లోకి మార్చి స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి పొరుగు రాష్ర్టాలకు తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు.


అధికారులు పట్టుకుంటున్నా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం చౌకబియ్యాన్ని అమ్మకూడదు. అయితే ఈ నిబంధనలను కొందరు కార్డుదారులు, మాఫియా పట్టించుకోవడంలేదు. స్థానికంగా కొందరు రెవెన్యూ ఉద్యోగుల సహకారం లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో బియ్యం అక్రమ రవాణా జరగదనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఈ ఏడాది అక్రమంగా తరలుతున్న 45,304 కిలోల బియ్యాన్ని పోలీసులు 14 చోట్ల స్వాధీనం చేసుకున్నారు. 36 మందిపై కేసులు నమోదు చేశారు. ఇది కాక పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టుకున్న కేసులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అఽధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నా చౌకబియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.


ఇటీవల పట్టుబడిన బియ్యం..

- జూన 9వ తేదీన 16 బస్తాల అక్రమ బియ్యాన్ని లక్కిరెడ్డిపల్లె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- 10న జమ్మలమడుగులోని ఓ రైస్‌మిల్లుకు తరలిస్తున్న 64 బస్తాల బియ్యాన్ని పెద్దపసుపుల మోటు వద్ద ఎస్‌ఐ లక్ష్మినారాయణ స్వాధీనం చేసుకున్నారు.

- 11న వల్లూరు మండలంలో సేకరించిన బియ్యాన్ని సత్య గ్రీన సిటీ  ప్రాంతంలో నిల్వ చేసి వాటిని 35 యూరియా బస్తాల్లో నింపి ఆటోలో చెన్నూరు తరలిస్తుండగా ఎస్‌ఐ రాజగోపాల్‌ స్వాధీనం చేసుకున్నారు.

- పెండ్లిమర్రి మండలంలో రెండుచోట్ల ఆటోలో అక్రమంగా తరలుతున్న 33 బస్తాల బియ్యాన్ని ఎస్‌ఐ కొండారెడ్డి స్వాధీనం చేసుకున్నారు.

- కడప నుంచి పులివెందులకు వెళుతున్న 14 బస్తాలను ఒక చోట, వేంపల్లె నుంచి నందిమండలంకు ఆటోలో వస్తున్న 14 బస్తాల బియ్యాన్ని మరో చోట స్వాధీనం చేసుకున్నారు.

- కమలాపురం నుంచి ఖాజీపేట వైపు వెళుతున్న ఆటోలో తరలిస్తున్న 52 బస్తాల బియ్యాన్ని తహసీల్దారు విజయకుమార్‌ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

- 14న బద్వేలులోని పోరుమామిళ్ల రోడ్డులో నరసింహ థియేటరు వెనుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు టన్నుల బియ్యాన్ని ఎస్‌ఐ వెంకటరమణ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చేరిన బియ్యాన్ని ప్రొద్దుటూరు, జమ్మలమడుగుకు తరలించి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. అదేరోజు జమ్మలమడుగు సమీపంలో పెద్దపసుపుల వద్ద 60 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.


చౌకబియ్యం అమ్మినా, కొన్నా నేరమే

- డీఎ్‌సవో సౌభాగ్యవతి 

చౌక బియ్యాన్ని అమ్మడం, కొనడం నేరం. ఈ విషయంపై ఇప్పటికే జనాల్లో అవగాహన కల్పించాం. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుని నిందితులపై 6ఎ కేసులు నమోదు చేశాం. వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు పోలీసులకు అప్పగిస్తున్నాం. ఎక్కడైనా చౌక బియ్యం అక్రమంగా తరలిస్తున్నా, అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిస్తే సమాచారం అందించాలి.

Updated Date - 2021-06-20T05:47:31+05:30 IST