హెచ్‌ఐవీ కబళిస్తోంది

ABN , First Publish Date - 2020-12-01T05:01:36+05:30 IST

క్షణికావేశంలో కొందరు, ఏ తప్పు చేయకపోయినా సూదులు, రక్త మార్పిడి, ఇతర కారణాలతో మరి కొందరూ తెలిసో తెలియకో హెచ్‌ఐవీ మహమ్మారి బారిన పడుతున్నారు.

హెచ్‌ఐవీ కబళిస్తోంది

చాపకింద నీరులా పెరుగతున్న హెచ్‌ఐవీ

ఇరు జిల్లాల్లో  ప్రతి నెల సుమారు 30  మందికి  గుర్తింపు

భద్రాద్రిలో ఇప్పటి వరకు హైరిస్క్‌ కేసులు 8,493

ఖమ్మంలో హెచ్‌ఐవీ బాధితులు 5,713 మంది

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం

ఖమ్మం సంక్షేమవిభాగం/ కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 30: క్షణికావేశంలో కొందరు, ఏ తప్పు చేయకపోయినా సూదులు, రక్త మార్పిడి, ఇతర కారణాలతో మరి కొందరూ తెలిసో తెలియకో హెచ్‌ఐవీ మహమ్మారి బారిన పడుతున్నారు. మందు లేని ఈ మహమ్మారి ప్రపంచంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను వేధిస్తోంది. ఒక వైపు ఎయిడ్స్‌పై ఎంతో అవగాహన కల్పిస్తునా ప్రభుత్వం ఉచితంగా మందులతో పాటుగా ఆసరా పింఛన్లు ఇస్తున్నా మహమ్మారి మాత్రం తన ఉగ్రరూపాన్ని పెంచుతోంది. మరో వైపు తమకు హెచ్‌ఐవీ ఉందని తెలిస్తే సమాజంలో తమ గుర్తింపే ప్రశ్నార్ధకంగా మారుతుందని బాధితులు ముందుకు రాలేకపోతున్నారు. దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా  హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ తర్వాతి స్థానంలో ఉంది. అయితే  నమోదు చేయించుకోని వారి సంఖ్య మరో 30శాతం వరకు ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.  

భద్రాద్రి కొత్తగూడెంలో నెలకు 10 నుంచి 20 కేసులు

 జిల్లాలో ప్రతీనెల 10 నుంచి 20 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.  యువకులే అధికంగా దీని బారిన పడుతున్నారు. జిల్లాలోని ఎల్‌ఆర్‌టీ కేంద్రాల్లో ప్రతీనెల 2,171 మంది మందులు వాడుతున్నారు. వారిలో 1,044 మంది ఏఆర్‌టీ పింఛన్లను నెలకు రూ. 2,016 పొందుతున్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో 8,493మంది హైరిస్కు వారుండగా, ఫిమేల్‌ సెక్స్‌వర్కర్సు 6,431, స్వలింగ సంపర్కలు 2,062 నమోదయ్యారు. వారిని మార్చందుకు జిల్లాలో గాడ్‌ థెరిసా మహిళా మండలి, సెక్యూర్‌ సంస్థలు కృషి చేస్తున్నాయి. జిల్లాలో  నాలుగు ఐసీటీసీ కేంద్రాలున్నాయి.  కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రి, పాల్వంచ, మణుగూరు అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎయిడ్స్‌  ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 31,364 మందికి హెచ్‌ఐవీ  నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించగా, 134 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. వారిలో 13,102 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ నిర్ధారణ కోసం రక్త పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్‌ నమోదైంది. ఐదు సంవత్సరాల ఎయిడ్స్‌ కేసుల నమోదును పరిశీలస్తే 2016-17లో 14,137 మందికి పరీక్షలు చేస్తే ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2017-18లో 32,823మందికి పరీక్షలు చేస్తే 28, 2018-19లో 33,425 మందికి పరీక్షచేస్తే 23 మందికి, 2019-20లో 32,900 మందికి పరీక్షలు నిర్వహిస్తే 29, 2020-21 అక్టోబరు వరకు 13,102 మందిని పరీక్షచేస్తే 10మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

మూడు పరీక్షల తర్వాతే నిర్ధారణ

ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద హెచ్‌ఐవీకి సింగిల్‌ కిట్‌ పరీక్షలు చేసి  పాజిటీవ్‌ ఉందని తెలుస్తున్నారు. కాని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డు నిబంధనల మేరకు రక్త పరీక్ష తర్వాత పాజిటివ్‌ అని తెలితే మరో రెండు విడతల్లో పలు విధానాల ద్వారా పరీక్షలు చేసిన తర్వాతనే  నిర్ధారించాలని ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, మధిరలో ఐసీటీసీ కేంద్రాలు ద్వారా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు మందులు సరఫరా జరుగుతున్నాయి. జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల ద్వారా ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణ జరుపుతున్నారు. వీటితో పాటుగా రెండు సుఖ వ్యాధి కేంద్రాలు, విహాన్‌ కేర్‌ అండ్‌ సపోర్టు కేంద్రాలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ఎయిడ్స్‌ రోగుల కోసం ఐదు రక్త నిధి కేంద్రాలు ఏర్పాటు చేశారు.   

ఖమ్మం జిల్లాలో ఇలా..

ఖమ్మం జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తులు 5,713 మంది ఉన్నారు. ఏఆర్‌టీ కేంద్రం నుంచి మందులు వాడేవారు 5,713, ప్రతి నెల ఆసరా పింఛన్‌ పొందుతున్న వారు 2,495, ప్రతీనెల నూతన కేసులు 30, మహిళా సెక్స్‌ వర్కర్లు 1,411, స్వలింగ సంపర్కులు 482, 2006నుంచి ఇప్పటి వరకు ఎయిడ్స్‌తో మరణించన వారు 3,041, జిల్లాలో ఐసీటీసీ కేంద్రాలు 3, ఎప్‌ఐసీటీసీ కేంద్రాలు 36 ఉన్నాయి. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు నమోదైన బాధితులు 206 మంది ఉండగా, గర్భిణులు 19మంది ఉన్నారు.

మందుల పంపిణీలో ఇబ్బందులు

 వ్యాధిగ్రస్థులు ఒక నెలకు మందులు వాడాలంటే ప్రైవేటులో రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు జరుగుతోంది. కాని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డు అధ్వర్యంలో ఉచితంగా ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో మందులు అందజేస్తున్నారు. అయితే మందులు సరైన సమయానికి తెప్పించటంలో జిల్లా అధికారులు వైఫల్యం చెందుతున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. ఈనెల 15వ తేది నుంచి 20తేది వరకు వారం రోజులు పాటు మందులు లేక పోవటంతో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఆందోళనకు గురైనారు.. మాతా శిశు సంరక్షణలో బాగంగా జిల్లాలో గర్బిణీలకు సైతం రికార్డు స్థాయిలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. గర్బిణీ సమయంలో హెచ్‌ఐవీ నమోదు జరిగితే  ముందస్తు ఆరోగ్యజాగ్రత్తలు వైద్యం ద్వారా పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాధి తీవ్రతకు గురికాకుండా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఖమ్మం జిల్లాలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 12,986 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 19మందికి పాజిటీవ్‌ గుర్తించారు. వారికి సరైన వైద్యసేవలు అందిస్తు పుట్టబోయే బిడ్డకు వ్యాధి సోకకుండా వైద్యసేవలు అందిస్తున్నారు. 

అవగాహన పెరిగింది.. కేసుల సంఖ్య తగ్గింది..

డాక్టర్‌ ప్రవీణ, జిల్లా ఎయిడ్స్‌ నివారణ అధికారి

జిల్లాలో గతంలో ప్రతి నెల 30నుంచి 40కొత్త కేసులు నమోదు జరిగాయి. ప్రజల్లో హెచ్‌ఐవీపై అవగాహన పెరిగింది. ఇప్పుడు నెలకు 20కేసులు వరకు నమోదు జరుగుతున్నాయి. వీరిలో ఒక్కరు ఇద్దరు గర్బిణీలు ఉంటున్నారు. జిల్లాలో హై రిస్క్‌ ప్రవర్తన కలిగిన వారు 1893మంది ఉన్నారు. వీరికి జాగృతి స్వచ్చంద సంస్థ ద్వారా గాహన కల్పించటం జరుగుతుంది. నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు రూపొందించాం.



Updated Date - 2020-12-01T05:01:36+05:30 IST