పులిరాజా పంజా

Nov 30 2021 @ 23:52PM

ఎయిడ్స్‌లో రాష్ట్రంలో 8వ స్థానంలో జిల్లా

అధికారికంగా 8వేలు, అనాధికారికంగా 20వేల మంది బాధితులు 

తగిన జాగ్రత్తలు, అవగాహన లేకపోతే అనర్థాలే 

 నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినం

నెల్లూరు (వైద్యం) నవంబరు 30 : హెచ్‌ఐవీ (ఎయిడ్స్‌)కు పర్యాయ పదంగా పిలిచే పులిరాజా జిల్లాలో పంజా విసురుతున్నాడు. తగిన అవగాహన లేకపోవడంతో జిల్లాలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రభుత్వం వ్యాధి నియంత్రణ కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలు ఉపయోగం లేకుండా పోతున్నాయి. చాలా వరకు నియంత్రణలో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతు న్నారు. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌(నాకో) సంస్థ నివేదిక ప్రకారం జిల్లా జనాభాలో 2.1 శాతం మందికి హెచ్‌ఐవి ఉంది. 2002లో 17.8శాతం ఉన్న  బాధితులు ప్రస్తుతం 0.6 శాతానికి చేరినట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పలువురు అభిప్రా యపడుతున్నారు. డిసెంబరు ఒకటిన ఎయిడ్స్‌ దినం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తోంది ప్రత్యేక కథనం.

జిల్లాలో 20 వేల మంది బాధితులు 

సమాజంలో విచ్చలవిడి శృంగారం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న సెక్స్‌ వర్కర్ల కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ యాంటీరెట్రోవైరల్‌ థెరఫి(ఎఆర్‌టీ) కేంద్రాల్లో పలు పీహెచ్‌సీలలో 8501 వ్యాధిగ్రస్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా మరో 11500 మంది బయట ఉన్నట్టు సమాచారం.  ప్రైవేటు ఆసుపత్రుల్లో  కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం హెచ్‌ఐవి నియంత్రణ కోసం ఏటా జిల్లాలో లక్షలరూపాయలు వెచ్చిస్తోంది. ఏడు స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రచారం  చేస్తూ   వ్యాధి నియత్రణకు వైద్యశాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆ లక్ష్యం నెరవేరడంలేదు. క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం సాగడంలేదు. ఏటా కోట్లు వెచ్చిస్తున్నా ఆయా స్వచ్ఛంద సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వ్యాధిపై అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వ స్థాయిలో పూర్తిగా నెరవేరడంలేదు. 

ప్రభుత్వపరంగా వైద్యసేవలు 

జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ (లెప్రసీ) విభాగం ఆధ్వర్యలో  జిల్లాలో ఏడు హెచ్‌ఐవి కౌన్సెలింగ్‌, పరీక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి. సుఖవ్యాధులు ఉన్న వారిలో 10 శాతం మందికి హెచ్‌ఐవి సోకే అవకాశం ఉన్నందున వాటి నివారణకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి,  కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలో సుఖ వ్యాఽధుల చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాధితులకు ఉచితంగా మందులు అందించేందుకు నెల్లూరు పెద్దాసుపత్రిలో యాంటి రిట్రోవైరస్‌ థెరపీ (ఏఆర్‌టీ) సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా కావలి, గూడూరులో సెంటర్లు పని చేస్తున్నాయి.  కాల్‌ సెంటర్‌ 1097కు ఫోన్‌ చేసి వైద్య సేవలు పొందాలని అధికారులు చెబుతున్నారు

నియంత్రణకు కృషి: డాక్టర్‌ రమాదేవి ( జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి )

జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణకు కృషి చేస్తున్నాం. 75 పీహెచ్‌సీలలో హెచ్‌ఐవి పరీక్షలు విధిగా చేయాలని ఆదేశించాం. గర్భిణులకు తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయిస్తున్నాం. యువతలో చైతన్యం తెచ్చే దిశగా వివిధ కళాశాలల్లో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌లు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. కళాజాతాలు, కరపత్రాలు రూపంలో వ్యాధి నివారణపై విస్తృత ప్రచారం చేస్తున్నాం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.