అక్రమ నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-01-18T15:41:42+05:30 IST

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలపై అధికారులు చర్యలు ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌

అక్రమ నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌

కూల్చివేతలు ప్రారంభించిన హెచ్‌ఎండీఏ 

టాస్క్‌ఫోర్స్‌, మున్సిపల్‌, పోలీసుల సహకారంతో..


హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)  పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలపై అధికారులు చర్యలు ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఆధ్వర్యంలో నాలుగు టీమ్‌లు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సోమవారం రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించారు. ముందుగా 600 చదరపు గజాలకు మించి ఉన్న పది అక్రమ నిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు చర్యలు తీసుకున్నాయి. హెచ్‌ఎండీఏ డైరెక్టర్లు, ప్లానింగ్‌ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు, స్థానిక మున్సిపల్‌ కమిషనర్లు, పోలీసులు కూల్చివేతల్లో పాల్గొన్నారు.


మల్లంపేటలో మూడు భవనాలు కూల్చివేత

దుండిగల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): దుండిగల్‌ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సోమవారం శ్రీకారం చుట్టారు. దుండిగల్‌ మున్సిపాలిటీలో పంచాయతీ అనుమతులతో కూడిన 51 నిర్మాణాలను, శ్రీనివాస్‌ లక్ష్మీ కన్స్‌స్ట్రక్షన్స్‌లోని 260 విల్లాలను అక్రమ నిర్మాణాలుగా  అధికారులు గుర్తించారు. మొదటిరోజు మూడు అక్రమ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తోపాటు రెండు కంప్రెషన్‌ మిషన్‌లను ఏర్పాటు చేసి కూల్చివేతలు చేపట్టారు. వీటిలో రెండు నిర్మాణాలు కేవలం పిల్లర్స్‌ స్థాయిలో ఉండగా వాటిని తొలగించారు. మరో నిర్మాణంలో రెండంతస్తుల్లోని స్లాబులకు కంప్రెషర్‌ ద్వారా కూల్చివేత చేపట్టారు. గ్రామంలో మరో 30కి పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించామని, వాటిన్నింటిపై చర్యలు తీసుకునే విఽధంగా కూల్చివేతలు కొనసాగుతాయని మున్సిపల్‌ కమిషనర్‌ భోగీశ్వర్లు తెలిపారు. 


మిగిలినవి ఎప్పుడో?

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన అధికారులు

కుత్బుల్లాపూర్‌ మండల పరిధిలోని గాజులరామారం సర్వేనెంబర్‌ 79లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన 30 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో కొందరు పాగా వేసి అక్రమ నిర్మాణాలను సాగిస్తున్న విషయాన్ని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. స్పందించిన రెవెన్యూ, టీఎ్‌సఐఐసీ అధికారులు సోమవారం భారీ ఎత్తున పోలీసు బలగాలతో తరలి వెళ్లి వాటిని కూల్చివేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, మరికొందరు ప్రభుత్వ స్థలాల్లో దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో సోమవారం కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మిగిలిన వందలాది నిర్మాణాలను ఎప్పడు తొలగిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతటితో చేతులు దులుపుకుంటారా, లేక మిగిలిన నిర్మాణాలను కూల్చివేస్తారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-01-18T15:41:42+05:30 IST