కరుగుతున్న మహా ఖజానా

ABN , First Publish Date - 2021-12-01T17:05:04+05:30 IST

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఖజానా కరిగిపోతోంది. విప్లవాత్మక నిర్ణయాలతో గణనీయమైన ఆర్థిక పరిపుష్టి సాధించిన సంస్థను ప్రభుత్వ పెద్దలే నిర్వీర్యం చేస్తున్నారు

కరుగుతున్న మహా ఖజానా

ఇతర ఖాతాలకు మళ్లింపు 

జీహెచ్‌ఎంసీకి రూ.1050 కోట్లు

ప్రభుత్వ ఖాతాకు రూ.2వేల కోట్లు

కొన్నాళ్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు కరువు


హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఖజానా కరిగిపోతోంది. విప్లవాత్మక నిర్ణయాలతో గణనీయమైన ఆర్థిక పరిపుష్టి సాధించిన సంస్థను ప్రభుత్వ పెద్దలే నిర్వీర్యం చేస్తున్నారు. వేల కోట్ల నిధులను ఇతర సంస్థలకు బదిలీ చేస్తున్నారు. ఇటీవల రూ.1050కోట్లను జీహెచ్‌ఎంసీకి మళ్లించినట్లు తెలిసింది. కోకాపేట భూముల అమ్మకం ద్వారా వచ్చిన రూ.2000.37కోట్ల ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇప్పుడు ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశ ప్లాట్ల వేలం ద్వారా వచ్చే ఆదాయం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఇలాగే కొనసాగితే.. సంస్థకు మునుపటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో మెరుగైన పట్టణ ప్రణాళికాభివృద్ధి చేపట్టడం హెచ్‌ఎండీఏ విధి. ప్రాజెక్టుల నిర్మాణానికి సంస్థకు ప్రభుత్వం నిధులను కేటాయించాల్సి ఉంది. కానీ ఐదేళ్లుగా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. హెచ్‌ఎండీఏనే స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. లేఅవుట్‌, భవన నిర్మాణ అనుమతుల ద్వారా ఏటా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్లాట్లు, భూముల అమ్మకం ద్వారా ఐదేళ్లలో అధిక ఆదాయం ఆర్జించింది. 2018 ఏప్రిల్‌లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థ అధీనంలోని 109 ప్లాట్లను విక్రయించగా, రూ.338 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత ఉప్పల్‌ భగాయత్‌లో మొదటి దశ ఫేజ్‌-2 లేఅవుట్‌లోని 67 ప్లాట్ల ను ఈ-వేలం వేయగా రూ.677.84 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో దశలో 102 ప్లాట్ల విక్రయం ద్వారా రూ.364.69కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా మూడేళ్లలో ప్లాట్ల విక్రయాల ద్వారా రూ.1380.50కోట్ల మేర హెచ్‌ఎండీఏకు ఆదాయం వచ్చింది. మూడు నెలల క్రితం కోకాపేటలో 49 ఎకరాలను విక్రయించగా రూ.2000.37 కోట్లు వచ్చాయి. దీంతోపాటు ఎల్‌ఆర్‌ఎ్‌సలో భాగంగా సుమారు లక్ష ప్లాట్లను క్రమబద్దీకరణ ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం సంస్థ ఖజానాకు చేరిం ది. ఇలా విభిన్న మార్గాల ద్వారా ఆదాయం పొందుతూ హెచ్‌ఎండీఏ స్వయం సమృద్ధి చెందుతోంది. 


జీహెచ్‌ఎంసీకి మళ్లింపు

పలు మార్గాల్లో వచ్చిన ఆదాయంతో హెచ్‌ఎండీఏ పరిపుష్టి సాధించింది. పట్టణ మౌలిక సదుపాయాల కోసం పెద్దఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించగా, ఇటీవల బాలానగర్‌ ప్లైఓవర్‌ను కూడా నిర్మించారు. అయితే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా ప్లైఓవర్లు, అండర్‌పా్‌సలు, స్కైవేల నిర్మాణం చేపడుతున్నారు. ప్రాజెక్టుల వ్యయానికి జీహెచ్‌ఎంసీ వద్ద నిధులు లేకపోవడంతో ఇటీవల సుమారు రూ.1050కోట్లు హెచ్‌ఎండీఏ నుంచి మళ్లించినట్లు తెలిసింది. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి.. హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా కూడా ఉండడంతో నిధుల మళ్లింపు చాకచక్యంగా జరిగినట్లు సమాచారం. అయితే రుణంగానే హెచ్‌ఎండీఏ చెల్లించిందని, తిరిగి వడ్డీతో జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుందని ఓ అధికారి తెలిపారు. 


కోకాపేట ఆదాయం ప్రభుత్వ ఖాతాకు

కోకాపేటలో హెచ్‌ఎండీఏకు రూ.2000.37కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నిధులు హెచ్‌ఎండీఏ ఖాతాలోనే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ ఖాతాలోకి మళ్లినట్లు తెలిసింది. 2009లో కూడా హెచ్‌ఎండీఏ నుంచి రూ.450 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారు. 


పలు పనులు పూర్తి

ఔటర్‌ యాన్యూటీ చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.336కోట్ల వరకు రావాల్సి ఉంది. శివారులోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు హెచ్‌ఎండీఏనే అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల విజ్ఞప్తుల మేరకు రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి పనులను చేపడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఆర్ట్స్‌ కాలేజీ మరమ్మతు కూడా హెచ్‌ఎండీఏ చేపట్టింది. ఖర్చులు పెరగడం, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సంస్థ ఖజానా కరుగుతూ వస్తోంది.

Updated Date - 2021-12-01T17:05:04+05:30 IST