అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అధికారుల అత్యుత్సాహం..!

ABN , First Publish Date - 2022-01-20T16:48:41+05:30 IST

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అధికారుల అత్యుత్సాహం..!

ఆదేశాలకు విరుద్ధంగా చర్యలు

600 గజాల కన్నా తక్కువ ఉన్న వాటిపైనే ప్రతాపం

బడంగ్‌పేట్‌లో అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్నది ఒక్కటే


సరూర్‌నగర్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ముందుగా 600 చదరపు గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చివేయాలనే ఆదేశాలు ఉండగా.. బడంగ్‌పేట్‌లో హెచ్‌ఎండీఏ అధికారుల బృందం గుర్తించిన 15 అక్రమ నిర్మాణాల్లో ఒక్కటి మాత్రమే 600 గజాల కన్నా ఎక్కువ ఉన్నట్టు కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సిబ్బంది పేర్కొన్నారు. మిగతా 14 నిర్మాణాలు 200 నుంచి 400 గజాల లోపే ఉండగా.. వాటిలోనూ పలు నిర్మాణాలకు మునిసిపల్‌ అనుమతి తీసుకుని ఒక ఫ్లోర్‌గానీ, పెంట్‌ హౌజ్‌గానీ అదనంగా నిర్మించుకున్నారని తేలింది.


అలాంటి వాటిని సైతం పెద్ద విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ హెచ్‌ఎండీఏ అధికారుల బృందం తయారు చేసిన జాబితా వివాదాస్పదంగా మారింది. దీనిపై పాలకవర్గంలోని ప్రజా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత సోమ, మంగళవారాల్లో హెచ్‌ఎండీఏ అధికారుల బృందం బడంగ్‌పేట్‌లో చేపట్టిన తొమ్మిది కూల్చివేతల్లో నాదర్‌గుల్‌లోని ఎంవీఎ్‌సఆర్‌ కాలేజీ పక్కన ఉన్నది మాత్రమే 600 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నదని టీపీ ఉద్యోగి ఒకరు చెప్పారు. 


మంత్రి వద్దకు పంచాయితీ

బడంగ్‌పేట్‌లో రెండు రోజుల పాటు అధికారులు చేపట్టిన కూల్చివేతలపై కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ.. బుధవారం మంత్రి సబితారెడ్డి వద్దకు పరుగులు తీశారు. దాంతో ఆమె సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిసింది. తాము 600 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చాలని చెప్పామని వారు మంత్రితో పేర్కొన్నట్టు సమాచారం. ఇదే విషయమై ఆమె బడంగ్‌పేట్‌ కమిషనర్‌, టీపీఎ్‌సలతోనూ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్రమ నిర్మాణాలను ఏ ప్రాతిపదికన గుర్తించారని ఆమె వారిని ప్రశ్నించగా.. హెచ్‌ఎండీఏ అధికారులే జాబితా తయారు చేసుకున్నారని, దాంతో తమకు సంబంధం లేదని వారు మంత్రికి వివరించినట్టు తెలిసింది.


నిజంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆమె అధికారులకు సూచించినట్టు సమాచారం. కాగా హెచ్‌ఎండీఏ అధికారుల బృందంలోని ఓ అధికారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఆయన వల్లనే ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారిందని కొందరు కార్పొరేటర్లు మంత్రికి వివరించినట్టు తెలిసింది. మంత్రి సూచనతో బడంగ్‌పేట్‌లో తాత్కాలికంగా కూల్చివేతలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టు తెలిసింది. అందుకే బుధవారం అధికారుల బృందం ఈ కార్పొరేషన్‌ వైపు రాలేదని సమాచారం! ఎన్నో ఏళ్లుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకోకుండా.. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రమే కూల్చివేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అనుమతులు లేని బహుళ అంతస్తు కూల్చివేత 

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అనుమతులు లేకుండా చేపడుతున్న బహుళ అంతస్తును హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ అధికారులు బుధవారం కూల్చివేశారు. హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్థానిక పోలీసుల సహకారంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పెద్దఅంబర్‌పేట్‌ సర్వే నంబర్‌ 470లో ఓ వ్యాపారి మున్సిపల్‌ నుంచి ఏలాంటి అనుమతులు తీసుకోకుండా బహుళఅంతస్తు నిర్మిస్తున్నాడు. ఇటీవలే హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టిన సర్వేలో బిల్డింగ్‌ నిర్మాణం అక్రమమని తేలడంతో కూల్చివేతకు చర్యలు చేపట్టారు. రెండు ఎక్స్‌కవేటర్లతో గోడలు, రేలింగ్‌ కూల్చివేయగా, మరో రెండు కాంప్రిషన్‌ వాహనాలతో స్లాబ్‌లను ధ్వంసం చేశారు. మున్సిపల్‌ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మున్సిపల్‌ పరిధిలో గుర్తించిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ఏపీవో వసుంధర, టీపీవో శ్రీకాంత్‌, మేనేజర్‌ చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో..

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం హౌసింగ్‌ కాలనీలోని ఖాళీ స్థలాలను కబ్జాలు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ధనుంజయగౌడ్‌తో పాటు కాలనీ వాసులు ఆరోపించారు. బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాలనీలో గృహసముదాయాల చుట్టూ వదిలేసిన స్థలాన్ని ఆ కాలనీకి చెందిన వార్డు సభ్యుడు అక్రమంగా కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నాడని పేర్కొన్నారు. బస్టాండ్‌, పార్కు స్థలాన్ని కబ్జా చేశాడని తెలిపారు. దాంతో బ్లాక్‌లోని పై అంతస్తులో ఉంటున్న వారు తమ వాహనాలు, ఇతర వస్తువులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి స్థలాల్లో డబ్బాలను ఏర్పాటు చేసి కిరాయిలకు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే అక్రమ నిర్మాణలు, స్థలాల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-01-20T16:48:41+05:30 IST