
నాయిని రాజేందర్ రెడ్డి వర్సెస్ జంగా రాఘవరెడ్డి
వరంగల్ పశ్చిమ సీటు కోసం హోరాహోరీ
హనుమకొండ కేంద్రంగా రాఘవరెడ్డి రాజకీయాలు
అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన రాజేందర్‌రెడ్డి
పట్టించుకోకుంటే తన దారి తనదే అని హెచ్చరిక
కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం
ఓరుగల్లు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పీఠం మార్పు తర్వాత కొంతకాలం వేచి చూసిన సీనియర్ నేతలు నిరసన రాగం ఎత్తుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పని విధానం తమను అవమానించేవిధంగా ఉందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అదేస్థాయిలో జిల్లాల్లోనూ నేతల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. ఎవరికి వారు నియోజకవర్గాలపై పెత్తనం తమకే కావాలనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారంలో ఎవరికి వారు తమ నియోజకవర్గాలను భద్రపరచుకునే వ్యూహంలో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జనగామ జిల్లాఅధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య ఆధిపత్య పోరు తెరమీదకు వచ్చింది.
హోరాహోరీ పోరు
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత నాయిని రాజేందర్ రెడ్డి ఇపుడు హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ నేతగా పేరున్న రాజేందర్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక కారణంతో బీ-ఫారం చేజారింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కూడా పాలకుర్తి నియోజకవర్గంలోనే క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగారు. కారణాలేమైనప్పటికీ అనంతరం తన దృష్టి జనగామ నియోజకవర్గంవైపు సారించారు. జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ప్రచారం జోరుగా సాగింది. జనగామ నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సైతం మరోసారి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతా్‌పరెడ్డి సైతం జనగామ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో రాఘవరెడ్డి తాను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో రాజేందర్‌రెడ్డి వర్గీయుల్లో కలవరం మొదలైంది. ఈసారి టికెట్ రాజేందర్‌రెడ్డికి కచ్చితంగా దక్కుతుందనే ఆశాభావంతో ఆయన వర్గీయులు ఉండగా, రాఘవరెడ్డి తమ కార్యకలాపాలు సైతం ముమ్మరం చేశారు. దీంతో రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధిష్ఠానం ఏమాత్రం స్పందించలేదని నాయిని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయడానికి రాఘవరెడ్డికి అన్ని రకాల అర్హత ఉందని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టేకులగూడెం సొంత గ్రామం అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పాలకుర్తిలో పోటీ చేశారంటున్నారు. అంతేకాకుండా గులాబీ గాలి వీచి కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కూడా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఎన్నికల్లో తన సొంత బలంతో రాఘవరెడ్డి కార్పొరేటర్లను గెలిపించుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని రాఘవరెడ్డి తన వర్గీయులతో చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నాయిని దారెటు?
సీనియర్ నాయకుడిగా పార్టీ కోసం శ్రమించిన తనకు అనేకసార్లు టికెట్ ఇస్తానని చెప్పి మొండిచేయి చూపిందని రాజేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఈ సారి కూడా నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేనని తెగేసి చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న తనకు తెలియకుండా తన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పేరుతో కార్యకలాపాలు సాగడాన్ని నాయిని సహించలేక పోతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాఘవరెడ్డి కార్యకలాపాలు నిరోధించకపోతే ఈ నెల 30తేదీ తర్వాత తన దారి తాను చూసుకుంటానని హెచ్చరించారు.
కాగా, పార్టీ పట్టించుకోకపోతే నాయిని రాజకీయ కార్యాచరణ ఎటువైపు అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఒక వైపు రాజేందర్‌రెడ్డి వర్సెస్ రాఘవరెడ్డి ఆధిపత్య పోరు కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సైతం ఇదే వరంగల్ పశ్చిమ సీటుపై కన్నేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచి ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నరేందర్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. రేవంత్‌రెడ్డితో పాటు నరేందర్‌రెడ్డి కాంగ్రె్‌సపార్టీలో చేరారు. దీంతో సహజంగానే వరంగల్ పశ్చిమ సీటు నరేందర్‌రెడ్డికే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రె్‌సపార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి ఉందో త్వరలోనే తేలే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.