విభజన ఎలా ఉండొచ్చు?

ABN , First Publish Date - 2022-01-29T06:40:20+05:30 IST

ఎన్ని నిరసనలున్నా కొత్త జిల్లాల విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ప్రభుత్వం ఉండడంతో పరిపాలనాపరమైన అంశాలపై కూడా చర్చ జరుగుతోంది.

విభజన ఎలా ఉండొచ్చు?
వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అఖిలపక్షం నినాదాలు

చిత్తూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎన్ని నిరసనలున్నా కొత్త జిల్లాల విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ప్రభుత్వం ఉండడంతో పరిపాలనాపరమైన అంశాలపై కూడా చర్చ జరుగుతోంది.  అభ్యంతరాల స్వీకరణ అన్నది లాంఛనమే అంటున్నారు. ఏప్రిల్‌ 2నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయంటున్నారు. అదే జరిగితే పాలనా విభాగాల విభజన, ఏర్పాటు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికర చర్చగా ఉంది.  చిత్తూరు, శ్రీబాలాజీ జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు ఎలాగూ వస్తారు. శాఖల విభజన ఎలా ఉండబోతోంది?తెలంగాణ తరహాలో ముఖ్యమైన కొన్నింటిని మాత్ర మే విభజించి, మిగిలిన శాఖలను రెండు జిల్లాలకూ కలిపి ఉంచేస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. 

  శాఖల విభజన.... : శాఖల విషయానికొస్తే సందిగ్ధత నెలకొని ఉం ది. ఉదాహరణకు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చిత్తూరులో రెగ్యులర్‌గా పనిచేస్తూ శ్రీబాలాజీ జిల్లాకు ఇన్‌చార్జిగా వ్యవహరించవచ్చు.లేదా తిరుపతిలో ఉండే ఈఈని ఇన్‌చార్జి ఎస్‌ఈగా నియమించవచ్చు. ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ వంటి ఇతర శాఖల్లోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంది. జిల్లాల విభజన అయిన వెంటనే శాఖలన్నింటినీ విభజించే అవకాశాలు లేవని తెలుస్తోంది. జడ్పీ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడున్న పాలకవర్గాన్ని అలాగే కొనసాగిస్తారా.. కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త పాలకవర్గాలను ఏర్పాటుచేస్తారా అనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు ఇబ్బంది లేకపోయినా తిరుపతిలో మిగిలిన శాఖల ఆఫీసులకు వెతుక్కోవాల్సి రావచ్చు. 

పోలీస్‌ కమిషనరేట్‌గా తిరుపతి : ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లాలున్నాయి. ఐపీఎస్‌ అధికారులు ఎస్పీలుగా పనిచేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం తిరుపతిని పోలీసు కమిషనరేట్‌గా చేయొచ్చు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలను పూర్తిగా, శ్రీకాళహస్తిలోని కొన్ని మండలాలు, శ్రీసిటీని కలిపేసి కమిషనరేట్‌ను ఏర్పాటుచేసి డీఐజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని తిరుపతి రూరల్‌ పోలీసు జిల్లాగా ఏర్పాటు చేసి ఎస్పీని కేటాయించవచ్చు. తిరుపతి రూరల్‌ పోలీసు జిల్లా పరిపాలనా కేంద్రాన్ని తిరుపతి కాకుండా నాయుడుపేటలో ఏర్పాటు చేయొచ్చు.

పరిధి తగ్గనున్న చిత్తూరు :  ఇప్పుడున్న చిత్తూరు పోలీసు జిల్లా పరిధి కూడా తగ్గనుంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలు చిత్తూరు పోలీసు జిల్లాలో ఉండగా.. తాజాగా అవి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో కలుస్తున్నాయి. చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో చిత్తూరు, పలమనేరు, పుత్తూరు పోలీసు సబ్‌ డివిజన్లు మాత్రమే ఉంటాయి. చిత్తూరు డీఎస్పీ పరిధిలో ఉన్న పాకాల పోలీసు స్టేషన్‌ తిరుపతి కమిషనరేట్‌లోకి వెళితే.. చిత్తూరు సబ్‌డివిజన్‌లో 14స్టేషన్లు మాత్రమే ఉంటాయి. పుత్తూరు సబ్‌డివిజన్‌లో ఉన్న 13 పోలీసు స్టేషన్లలో మార్పులుండకపోవచ్చు. తిరుపతి పోలీసు జిల్లాలో ఉన్న రొంపిచెర్ల స్టేషన్‌ను చిత్తూరు జిల్లాలోకి తీసుకుని, చిత్తూరు లేదా పలమనేరు సబ్‌డివిజన్లలో కలపనున్నారు. మదనపల్లె సబ్‌డివిజన్‌ అన్నమయ్య జిల్లాలోకి వెళ్లిపోనుంది.

ఐఏఎ్‌సలు ఎందరు?

కొత్త జిల్లాల నేపథ్యంలో కలెక్టర్‌, ఎస్పీల పరిధి తగ్గనుంది. ప్రస్తుతం ఉన్నట్టుగా చిన్న జిల్లాలకు నలుగురు జేసీలను పెట్టకపోవచ్చంటున్నారు.  ఇద్దర్ని మాత్రమే జేసీలుగా కొనసాగించే అవకాశం ఉంది. రెవెన్యూ, డెవల్‌పమెంట్‌ జేసీ పోస్టులను కొనసాగించి, హౌసింగ్‌, వెల్ఫేర్‌ జేసీ పోస్టు పరిధిలోని శాఖలను ఇద్దరు జేసీలకు కలిపేయవచ్చు. రెవెన్యూ, డెవల్‌పమెంట్‌ జేసీలుగా ఐఏఎస్‌ అధికారులే కొనసాగుతారు. పలమనేరు ఆర్డీవోగా డిప్యూటీ కలెక్టర్‌ ఉంటారు.

Updated Date - 2022-01-29T06:40:20+05:30 IST