ఢిల్లీపై పట్టు

ABN , First Publish Date - 2022-04-06T06:13:23+05:30 IST

ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న మూడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు ఒక్కటైనాయి. మార్చి 30న లోక్‌సభ ఆమోదించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లును...

ఢిల్లీపై పట్టు

ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న మూడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు ఒక్కటైనాయి. మార్చి 30న లోక్‌సభ ఆమోదించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లును మంగళవారం రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లుగా విడివిడిగా ఉన్నవి ఇలా ఒక్కటి కావడంతో ఇకపై అద్భుతాలు చేయవచ్చునని అమిత్ షా అంటున్నారు. ఆప్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లపై సవతితల్లి ప్రేమ చూపిందనీ, చిల్లరవిదల్చి, ఉద్యోగులను జీతాలకు కూడా ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ విలీనం బీజేపీ రాజకీయప్రయోజనానికీ, కేంద్రపెత్తనానికే తప్ప ప్రజలకు మేలు చేసేది కాదని విపక్షాల వాదన.


ఢిల్లీ మీద అంత ప్రేమే ఉంటే, ముందు దానిని ఎన్నికల్లో గెలుచుకొని ఆ తరువాతే విలీనం చేపట్టవచ్చునుగా అని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. ఈ బిల్లుకు ‘ఆప్ ఫోబియా’ పేరు సరిగ్గా అతుకుతుందని కేజ్రీవాల్ పార్టీవాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దాదాపు దశాబ్దం క్రితం వరకూ ఒక్కటిగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆర్థిక స్వావలంబన, అధికారాల వికేంద్రీకరణ, పనితీరు మెరుగుదల తదితర ప్రయోజనాలను ఆశించి అప్పటి ప్రభుత్వం మూడుముక్కలు చేసింది. ఇప్పుడు కొత్త విలీనం బిల్లులో బీజేపీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చేపట్టిన మార్పుచేర్పులు వినా మున్సిపాలిటీ ఆర్థికస్థితినీ, పనితీరునూ మెరుగుపరచే ప్రత్యేక ప్రతిపాదనలేవీ లేవని విపక్షాల విమర్శ. మాంచి జోరుమీద ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఎక్కడ స్థానిక ఎన్నికల్లో నెగ్గుకొస్తుందోనన్న భయంతో వాటిని వాయిదావేయించే లక్ష్యంతో ఈ విలీనాన్ని ముందుకు తెచ్చారన్నది ఆరోపణ. మొన్న మార్చి ౯న రాష్ట్ర ఎన్నికల సంఘం మరో గంటలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రకటనకు సిద్ధపడుతూండగా, ప్రధానమంత్రి కార్యాలయం హడావుడిగా రంగంలోకి దిగి, మూడు కార్పొరేషన్లనూ కలిపివేసే ఆలోచన ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ఆపివేయమంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిందని ఆప్ విమర్శ. ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మీకు సరిగ్గా ఎన్నికలముందే ఈ విలీనం ఆలోచన ఎందుకు వచ్చిందన్న ఆప్ ప్రశ్న సముచితమైనది. ఎన్నికలు కాస్త వాయిదాపడితేనే మీరు ఓడిపోతారా? అన్న అమిత్ షా ప్రశ్నలో కొంటెతనం తప్ప సరైన సమాధానం లేదు. బీజేపీకి ధైర్యం ఉంటే ఎన్నికలు నిర్వహించి మూడు మున్సిపాలిటీల్లో నెగ్గితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల నుంచే తప్పుకుంటుందని కేజ్రీవాల్ సవాల్ కూడా విసిరారు. మూడు మున్సిపాలిటీల విలీనం ఉపరితలంలో సులువుగా కనిపిస్తున్నా, సుదీర్ఘ డీ లిమిటేషన్ ప్రక్రియను కనీసం ఓ రెండేళ్ళు సాగదీసే ఉద్దేశంలో కేంద్రం ఉన్నదనీ, సార్వత్రక ఎన్నికల్లోగా ఎంసీడీ ఎన్నికలు జరగకపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆప్ వాదన.


పదిహేనేళ్ళుగా తమ చేతుల్లో ఉన్న మూడు మున్సిపాలిటీలు ఇప్పుడు చేజారిపోతాయన్న భయం ఒక్కటే ఈ ప్రతిపాదనకు కారణం కాకపోవచ్చును కానీ, ఢిల్లీమీద తన అధికారాలను మరింత బిగించడానికి ఈ సవరణ ఉపకరిస్తుంది. వార్డులు, కౌన్సిలర్లు, డివిజన్లు, ఉద్యోగుల వేతనాలు, నిర్మాణ అనుమతులు ఇత్యాదివి నిర్ణయించే అధికారం ఇకపై కేంద్రానికి పోతాయి. అది నియమించిన స్పెషల్ ఆఫీసర్ సర్వమూ తానై చక్రం తిప్పుతాడు. ‘ప్రభుత్వం’ అని ఉన్న చోటల్లా ‘కేంద్ర ప్రభుత్వం’ అని మార్చారు. గతంలో ఏ లక్ష్యంతోనైతే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడుముక్కలు చేశారో, ఆ ప్రయోజనాలు నెరవేరలేదనీ, ఇప్పుడు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ఎంసీడీ పనిచేస్తుందని అమిత్ షా అంటున్నారు. వనరుల లేమితో ప్రజలకు లోపభూయిష్టమైన సేవలు అందుతున్నాయని కేంద్రం నిజంగానే భావిస్తే, ఆర్థికంగా ఆదుకోవడానికి దానికి ఎన్నోమార్గాలున్నాయి. మూడు మున్సిపాలిటీలు తన ఏలుబడిలో ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం నిధులివ్వకుండా వివక్ష చూపుతోందని బీజేపీ విమర్శిస్తుండగా, విపరీతమైన అవినీతితో, అలసత్వంతో ప్రజలకు సరైన సేవలు అందించడం లేదని ఆప్ విమర్శిస్తోంది. ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అమిత్ షా ఇప్పుడు ఢిల్లీలో మూడింటిని ఒక్కటి చేశారు. అప్పుడూ ఇప్పుడూ కూడా లక్ష్యం ప్రజాశ్రేయస్సు, అభివృద్ధే. రాజ్యసభలోనూ మరింత బలపడిన అధికారపక్షం మీద రగిలిపోవడం వినా విపక్షాలు చేయగలిగిందీ లేదు.

Updated Date - 2022-04-06T06:13:23+05:30 IST