కొమరాడలో హోల్డింగ్‌ జోన

ABN , First Publish Date - 2020-11-09T03:49:54+05:30 IST

ఏనుగులు జిల్లాను వీడడం లేదు. ఏజెన్సీ మండలాల్లో సంచరిస్తూ పంటలను నష్టానికి గురిచేస్తున్నాయి. గిరిజనుల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏనుగుల నియంత్రణపై దృష్టి సారించింది.

కొమరాడలో హోల్డింగ్‌ జోన
ఏనుగు

ఒంటరి ఏనుగు రక్షణ కోసం ఏర్పాటు

స్థల పరిశీలనలో అటవీ శాఖ అధికారులు 

విడతల వారీ మిగతా ఏనుగుల తరలింపు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఏనుగులు జిల్లాను వీడడం లేదు. ఏజెన్సీ మండలాల్లో సంచరిస్తూ పంటలను నష్టానికి గురిచేస్తున్నాయి. గిరిజనుల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏనుగుల నియంత్రణపై దృష్టి సారించింది.  అటవీ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. గుంపు నుంచి వేరై..ఒంటరిగా తిరుగుతూ ప్రాణ, ఆస్తి నష్టానికి గురిచేస్తున్న ఏనుగు కోసం హోల్డింగ్‌ (కంటైనమెంట్‌) జోన  ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో ఏజెన్సీలో అనువైన రెండు హెక్టార్లకు పైగా భూమిని సేకరించే పనిలో జిల్లా అటవీ శాఖ అధికారులు ఉన్నారు. 

కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లో గత కొద్ది నెలలుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కొమరాడ మండలంలో రెండు నెలలుగా తిష్ఠవేశాయి. ఆహారం దొరుకుతుండడంతో పాటు సేద తీరేందుకు నదీ పరీవాహక ప్రాంతాలు ఉండడంతో కొమరాడ మండలాన్ని విడిచిపెట్టడం లేదు. ఇటీవల గుంపు నుంచి ఒక ఏనుగు వేరు పడింది. మిగిలిన గుంపు ఒక వైపు... ఒక్క ఏనుగు మరోవైపు సంచరిస్తున్నాయి. ఒంటరి ఏనుగు పంటలను నాశనం చేస్తోంది. ఇటీవల కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెందిన యువకుడు ఏనుగు దాడిలో మృతిచెందాడు. దీంతో  గిరిజన, రైతు సంఘాల ప్రతినిధులు ఏనుగులు తరలించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో హోల్డింగ్‌ (కంటైన్మెంట్‌) జోన ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సుమారు రెండు హెక్టార్ల పైబడి అటవీ భూమిని సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. గుర్తించిన భూ భాగం చుట్టూ ట్రెంచిని లోతుగా తవ్విస్తారు. ఏనుగు ట్రెంచ్‌ నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా చర్యలు చేపడతారు. పుష్కలంగా ఆహారం అందేలా చర్యలు చేపడతారు. పర్యవేక్షణ ద్వారా దారిలోకి తెచ్చేందుకు ఒక మావటిని నియమిస్తారు. ముందుగా ఒంటరిగా తిరుగుతున్న ఏనుగును హోల్డింగ్‌ ప్రాంతంలోకి తరలిస్తారు. తరువాత మిగతా గుంపును అక్కడికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఎలిఫెంట్‌ సెల్‌ ఫారెస్ట్‌ అధికారి ఎం.మురళీకృష్ణ వద్ద ప్రస్తావించగా...హోల్డింగ్‌ జోన ఏర్పాటు విషయాన్ని ధ్రువీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొమరాడ మండలంలో భూ సేకరణ పనిలో ఉన్నట్టు తెలిపారు. 


Updated Date - 2020-11-09T03:49:54+05:30 IST