నేటి నుంచి పాఠశాలలకు సెలవు!

ABN , First Publish Date - 2021-04-20T04:30:52+05:30 IST

కరోనా ఉధృతమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు ప్రకటించింది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యాసంవత్సరం ముగిసినట్టయ్యింది.

నేటి నుంచి పాఠశాలలకు సెలవు!





ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆల్‌ పాస్‌

ప్రభుత్వం కీలక నిర్ణయం

పది, ఇంటర్‌ పరీక్షలు యథాతథం

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 19: కరోనా ఉధృతమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు ప్రకటించింది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యాసంవత్సరం ముగిసినట్టయ్యింది. వారందరూ ఉత్తీర్ణత సాధించినట్టే స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు. దీంతో ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు యధాతథంగా పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనాతో గత ఏడాది విద్యాసంవత్సరం అర్ధాంతరంగా ముగిసింది. మార్చి 10 నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. అప్పట్లో పదో తరగతి పరీక్షలు సైతం రద్దయ్యాయి. ఆల్‌పాస్‌గా ప్రకటించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత గతేడాది నవంబరు 2న తొలుత 9,10 తరగతులను ప్రారంభించారు. అదే నెల 23న ఎనిమిదో తరగతి విద్యార్థులకు, డిసెంబర్‌ 14 నుంచి ఏడో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి విద్యార్థులకు మాత్రం ఈ ఏడాది జనవరి 18 నుంచి తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల సెకెండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనాబారిన పడుతున్నారు. మరణాలు కూడా సంభవిస్తుండడంతో తరగతుల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ సెలవు ప్రకటించింది.  జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 3,370 ఉన్నాయి. వాటిలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ 2,89,552 మంది చదువుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారందరూ ఉత్తీర్ణత సాధించినట్టే. 


ఇంటర్‌,పది పరీక్షలు యధాతథం

ఇంటర్‌, పది పరీక్షలు మాత్రం యధాతథంగా జరగనున్నాయి. వీటిలో ఎటువంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలో 53 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. ఇందులో ద్వితీయ సంవత్సరం  ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు గత నెల 31 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.  ఇప్పటికే మూడు విడతలు పూర్తికాగా సోమవారం నుంచి నాలుగో విడత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ రాత పరీక్షలకు సంబంధించి జిల్లాలో 74 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్‌ఐవో మంజులవీణ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలనుసరించి తొమ్మిది శాఖల సమన్వయంతో పరీక్షలను నిర్వహించనున్నామని చెప్పారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఇప్పటికే 135 కేంద్రాలను గుర్తించారు.  30,448 మంది విద్యార్థులు రాయనున్నట్టు అంచనా. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో గదికి 24 మంది పరీక్షలు రాయగా... ప్రస్తుతం 12 నుంచి 16 మందికి కుదించనున్నారు. అవసరాన్ని బట్టి గదులను పెంచనున్నారు. 


Updated Date - 2021-04-20T04:30:52+05:30 IST