ఉమ్మడి జల్లాలో ఇంటింటి ఆరోగ్య సర్వే

ABN , First Publish Date - 2021-02-21T05:51:25+05:30 IST

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని వయసుల వారు రోగాల బారిన పడుతున్నారు. పట్టణాల్లో ఉరుకుల పరుగుల జీవితం, శారీర క శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, పల్లెల్లో జీవన విధానం దీనికి భిన్నంగా ఉన్నా అక్కడా ప్రాణాపాయం ఏర్పడే వరకు షుగర్‌, బీపీ, థైరాయిడ్‌, క్యాన్సర్‌ ఉన్న విషయం బయటపడటం లేదు.

ఉమ్మడి జల్లాలో ఇంటింటి ఆరోగ్య సర్వే

10 రకాల జబ్బులపై నిత్యం పర్యవేక్షణ

రూ.2కోట్లతో ఉచిత పరీక్ష ల కేంద్రం 

కొత్తగా ఉమ్మడి జిల్లాలో 90 సబ్‌ సెంటర్లు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని వయసుల వారు రోగాల బారిన పడుతున్నారు. పట్టణాల్లో ఉరుకుల పరుగుల జీవితం, శారీర క శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, పల్లెల్లో జీవన విధానం దీనికి భిన్నంగా ఉన్నా అక్కడా ప్రాణాపాయం ఏర్పడే వరకు షుగర్‌, బీపీ, థైరాయిడ్‌, క్యాన్సర్‌ ఉన్న విషయం బయటపడటం లేదు. ఈ రోగాలు బయటపడ్డాక నెలవారీ మందులు, రక్తపరీక్షల కోసం ఆర్థిక స్థోమత లేక మానసిక ఒత్తిడి ఇంకా పెరుగుతోం ది. వీటికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి ఆరోగ్య సర్వే, ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 70 శాతం ఆరోగ్య వివరాల నమోదు పూర్తి కాగా, నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉచితంగా వైద్యపరీక్షల కేంద్రం కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది.

ఉమ్మడి జిల్లాలో సుమారు 34లక్షల మంది జనాభా ఉండగా, అందులో 24లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విలేజ్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ పేరుతో ఇప్పటికే సేకరించారు. అందులో 1.80లక్షల మంది సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేశారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు ఇంటింటికీ తిరిగి కుటుంబంలో ఎవరైనా బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, అస్త మా, టీబీ, ఎయిడ్స్‌, క్యాన్సర్‌ వంటి రోగాలు ఉన్నాయా? అనే 30 రకాల సమాచారం సేకరించారు. బీపీ, షుగర్‌ వంటి 10 వ్యాధులపై నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. జిల్లాలోని ప్రతీ కుటుంబం ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ప్రభుత్వానికి అందుబాటులోకి రానుంది. దీంతో రోగిని ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు తెలుసుకొని ఉచితంగా మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకాలం ఆశాలు, ఏఎన్‌ంలు పేజీల కొద్దీ వివరాలు సేకరించే వారు. ఆ ఇబ్బందులను తప్పిస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆధార్‌ కార్డులా అందరికీ హెల్త్‌ ఐడీ ఇవ్వనున్నారు. ఈ నంబర్‌ను కంప్యూటర్‌లో క్లిక్‌ చేస్తే పూర్తి ఆరోగ్య సమాచారం క్షణాల్లో వస్తుంది. జిల్లాలో ఏ జబ్బులు, ఎంత మందికి ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. అనారోగ్య జాబితాలో ఉన్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. అదే విధంగా అవసరమైన వారికి తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌లో పరీక్షలు చేయిస్తారు. జిల్లా ఆరోగ్య వివరాలను ఈ హబ్‌కు పంపుతారు.


నల్లగొండలో వైద్య పరీక్ష కేంద్రం

తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌లో భాగంగా మూడు జిల్లా కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండలోని జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న ఈ పరీక్ష కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది. రోజుకు సుమారు 1500 మందికి ఉచితంగా రక్త, మూత్రం వంటి పరీక్షలు చేయనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. పరీక్ష కేంద్రం కోసం గదులు కేటాయించగా రూ.2కోట్ల విలువైన యంత్రాలు వచ్చాయి. శిక్షణ పొందిన ఏడుగురు ల్యాబ్‌ టెక్నీషియన్ల నియామకం పూర్తయింది. ఈ కేంద్రానికి ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని కల్పించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌లు అందుబాటులోకి రాగా, త్వరలో ఈ పరీక్షలను కూడా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ఏర్పాటుచేస్తున్న పరీక్ష కేంద్రం మరో 15 రోజుల్లో ప్రారంభంకానుంది.


ఉమ్మడి జిల్లాలో 90 కొత్త సబ్‌సెంటర్లు

బస్తీ దావఖానాల మాదిరిగా సబ్‌ సెం టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు 90 కొత్త సబ్‌ సెంటర్లు మంజూరు కాగా, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వీటి నిర్మాణాలు ప్రారంభించారు. పాత సబ్‌ సెంటర్ల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో సబ్‌సెంటర్‌ నిర్మాణానికి రూ.16లక్షలు మంజూరయ్యాయి. వీటిలో ఉచితంగా వైద్య పరీక్షలు చే సి మందులు అందజేయనున్నారు.


ప్రతీ కుటుంబం వివరాలు సేకరిస్తాం : ఎ.కొండల్‌రావు, నల్లగొండ డీఎంహెచ్‌వో 

ప్రతీ కుటుంబంలో అందరి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నాం. ప్రభుత్వం ఏప్రిల్‌ చివరి వరకు గడువు విధించింది. మాసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆశాలను గ్రూపులుగా చేసి లక్ష్యం ఖరారు చేశాం. సర్వే చురుకుగా సాగుతోంది. గడువులోపు కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం.


Read more