హోమ్‌ ఐసోలేషన్‌ కోరుకునే వారికి మెడికల్‌ కిట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-07-14T16:19:44+05:30 IST

హోమ్‌ ఐసోలేషన్‌ కోరుకునే వ్యక్తులకు మెడికల్‌ కిట్లు అందించి..

హోమ్‌ ఐసోలేషన్‌ కోరుకునే వారికి మెడికల్‌ కిట్లు ఇవ్వండి

కలెక్టర్‌ భరత్‌ గుప్తా


తిరుపతి(ఆంధ్రజ్యోతి): హోమ్‌ ఐసోలేషన్‌ కోరుకునే వ్యక్తులకు మెడికల్‌ కిట్లు అందించి అవి వాడాల్సిన విధానం, ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించిన తర్వాతే హోం ఐసొలేషన్‌కు అనుమతించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ భరత్‌గుప్తా చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్‌, జేసీ (డి) వీరబ్రహ్మం, అసిస్టెంట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌లతో తిరుపతి శ్రీనివాసంలో పర్యటించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, డాక్టర్లకు పలు సూచనలు చేశారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, డాక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని వచ్చిన బాధితులకు సౌకర్యాలు, సమయానికి భోజనం అందించేలా చూడాలని  సూచించారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారితో వైద్య బృందం రోజుకొక్కసారైనా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలన్నారు. అనంతరం శ్రీనివాసం ఐదు అంతస్తులలో పర్యటించి ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క అధికారి ఉండేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు అందిస్తున్న భోజనం రుచిచూసి సమయానికి అందించాలని సూచించారు. శ్రీనివాసంలో వైద్యసేవలకు సంబంధించిన పరికరాలు, కిట్లు ఏపీఎంఐడీసీ ఈఈ ధనంజయరావు అందించాలని ఆదేశించారు.


మీడియా సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు

తిరుపతి మీడియా ప్రతినిధి ఒకరు కొవిడ్‌తో మృతిచెందిన నేపథ్యంలో స్థానిక మీడియా సిబ్బందికి కలెక్టర్‌ చొరవతో సోమవారం మాధవంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కలెక్టర్‌కు మీడియా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్‌ భారతి, నగరపాలక సంస్థ డీసీ చంద్రమౌళి, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు, కలెక్టర్‌ ఏవో గోపాలయ్య, డీటీలు సాంబశివరావు, శ్యామ్‌ప్రసాద్‌, ఈశ్వర్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-07-14T16:19:44+05:30 IST