ఇంటికో ఉద్యోగం.. పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-05-20T05:49:14+05:30 IST

మండలంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమకు విష్ణుపురం నుంచి రైల్వే లైన్‌ ఏర్పాటుకోసం చేస్తున్న హద్దుల గుర్తింపును గురువారం రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు.

ఇంటికో ఉద్యోగం.. పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలి
పనుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

 రైల్వే లైన్‌ పనులు అడ్డుకున్న రైతులు

దామరచర్ల, మే 19: మండలంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమకు విష్ణుపురం నుంచి రైల్వే లైన్‌ ఏర్పాటుకోసం చేస్తున్న హద్దుల గుర్తింపును గురువారం రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు. పరిశ్రమకు బొగ్గు రవాణాకోసం సుమారు 10కి.మీ మేర రైల్వే లైన్‌ నిర్మాణానికి టీఎస్‌ జెన్‌కో ఆధ్వర్యంలో ఇటీవల భూసేకరణ చేపట్టారు. రైల్వే లైన్‌ పరిధిలో దామరచర్ల, తాళ్లవీరప్పగూడెం, కొత్తపల్లి, నర్సాపురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూములను కోల్పోతున్నారు. తాళ్లవీరప్పగూడెం గ్రామంలోని రైతులకు ఎకరాకు రూ.30లక్షలు చెల్లిస్తుండగా, కొత్తపల్లి శివారులోని భూములకు రూ.12లక్షలు చెల్లించేందుకు అధికారులు ధర నిర్ణయించడంతో కొన్నిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ, జెన్‌కో, పోలీసుల ఆధ్వర్యంలో హద్దురాళ్లు నాటుతుండగా, రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించడంతోపాటు పరిశ్రమలో ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించగా, తమ సమస్యలు పరిష్కరించే వరకూ పనులను చే యనీయమని రైతులు ఆందోళనచేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2022-05-20T05:49:14+05:30 IST