వాణిజ్య భవనాలకు ఇంటి పన్ను!

ABN , First Publish Date - 2021-07-26T03:07:29+05:30 IST

వాణిజ్య భవనాలకూ ఇంటి పన్ను ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. మునిసిపాలిటీలో రెండేళ్ల కిందట విలీనమైన ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలకు ఇళ్లకు మాదిరిగానే పన్నులు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డితో పాటు సదాశివపేట, జహీరాబాద్‌ మునిసిపాలిటీల్లోని పలు ప్రాంతాలను రెండేళ్ల కిందట విలీనం చేశారు

వాణిజ్య భవనాలకు ఇంటి పన్ను!
మున్సిపల్‌ రికార్డుల్లో నివాస భవనాలుగా నమోదైన పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని వాణిజ్య భవనాలు

మునిసిపాలిటీలలో విలీన ప్రాంతాల తీరు  

పన్నుల రివిజన్‌ లేక  ఆదాయం కోల్పోతున్న బల్దియాలు

ఒక్క సంగారెడ్డి మునిసిపాలిటీకే ఏటా రూ.కోటి నష్టం


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, జూలై25 : వాణిజ్య భవనాలకూ ఇంటి పన్ను ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. మునిసిపాలిటీలో రెండేళ్ల కిందట విలీనమైన ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలకు ఇళ్లకు మాదిరిగానే పన్నులు వసూలు చేస్తున్నారు. సంగారెడ్డితో పాటు సదాశివపేట, జహీరాబాద్‌ మునిసిపాలిటీల్లోని పలు ప్రాంతాలను రెండేళ్ల కిందట విలీనం చేశారు. అప్పట్లో విలీనమైన ప్రాంతాల్లో రెండేళ్ల వరకు అప్పటి వరకు ఉన్న పన్నులనే వసూలు చేయాలని మున్సిపల్‌ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రకారం రెండేళ్ల దాకా ఆయా ప్రాంతాల్లో గతంలో ఉన్న పన్నులనే మున్సిపల్‌ అధికారులు వసూలు చేశారు. 

రెండేళ్లు గడిచిపోవడంతో 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మునిసిపాలిటీలలో విలీనమైన ప్రాంతాల్లో పన్నులను మునిసిపాలిటీల గణాంకాల ప్రకారం వసూలు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం మునిసిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాలతో పాటు కొత్తగా ఏర్పాటైన నారాయణఖేడ్‌, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నుల రివిజన్‌ జరపాల్సి ఉన్నది. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో మునిసిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాలతో పాటు కొత్త మునిసిపాలిటీలలో ఇది వరకు ఉన్న పన్నుల వసూళ్లకే అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. 


సంగారెడ్డిలో విచిత్రం

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మునిసిపాలిటీలో రెండేళ్ల కిందట పోతిరెడ్డిపల్లి, చింతల్‌పల్లిలతో పాటు మల్కాపూర్‌లోని కొన్ని కాలనీలు విలీనమయ్యాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పోతిరెడ్డిపల్లి, మల్కాపూర్‌ ప్రాంతాలకు అప్పటికే పూర్తి డిమాండ్‌ ఉంది. అప్పట్లో గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలు సంగారెడ్డి మునిసిపాలిటీలోని ప్రాంతాలకన్నా విలువైనవి. ఇప్పుడు ఆయా ప్రాంతాలు మునిసిపాలిటీలో విలీనమైనా గ్రామ పంచాయతీలో నిర్ణయించిన ప్రకారమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నులను వసూలు చేస్తుండడం గమనార్హం. మునిసిపాలిటీలో నివాస భవనాలకు చదరపు గజానికి రూ.9 నుంచి రూ.13 వరకు ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే వాణిజ్య భవనాలకైతే చదరపు అడుగుకు రూ.16 నుంచి 24 వరకు లెక్క కట్టి ఆస్తి పన్ను నిర్ణయిస్తున్నారు. సంగారెడ్డి మునిసిపాలిటీలో విలీనమైన పోతిరెడ్డిపల్లి, మల్కాపూర్‌ ప్రాంతాల్లో సుమారు 500 వరకు వాణిజ్య భవనాలున్నాయి. ఈ వాణిజ్య భవనాలన్నీ జాతీయ రహదారికి ఇరువైపులా ఉండడంతో వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నది. అయినా మునిసిపల్‌ అధికారులు ఇప్పటి వరకు వీటిని వాణిజ్య భవనాలుగా గుర్తింపు ప్రక్రియను చేపట్టలేదు. ఫలితంగా ఆయా భవనాలకు గతంలో నిర్ణయించిన ఇంటి పన్ను మాదిరిగానే ఆస్తి పన్నును వసూలు చేస్తున్నారు. విలీనమైన ప్రాంతాల్లో ఆస్తి పన్నును రివిజన్‌ చేయకపోవడం, వాణిజ్య భవనాలను గుర్తించకపోవడం కారణంగా సంగారెడ్డి మునిసిపాలిటీ ఏటా కోటి రూపాయల అదనపు ఆదాయం కోల్పోతుంది. సదాశివపేట మునిసిపాలిటీలో విలీనమైన సిద్దాపూర్‌, జహీరాబాద్‌ మునిసిపాలిటీలో విలీనమైన పలు కాలనీలలోనూ ఇదే పరిస్థితి. ఈ ప్రాంతాల్లోనూ ఆస్తి పన్ను రివిజన్‌ జరగని కారణంగా ఆయా మునిసిపాలిటీలు ఏటా సుమారు రూ.50 లక్షల చొప్పున ఆదాయం కోల్పోతున్నట్టు మునిసిపల్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 


కొత్త మునిసిపాలిటీల్లోనూ

రెండేళ్ల కిందట జిల్లాలో కొత్తగా నారాయణఖేడ్‌, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, మునిసిపాలిటీలు ఏర్పడ్డాయి. ఆయా మునిసిపాలిటీల్లోనూ ఆస్తిపన్ను రివిజన్‌ జరగలేదు. కొత్త మునిసిపాలిటీలలో ఆస్తి పన్ను రివిజన్‌ నిర్వహించి, మునిసిపాలిటీల గణాంకాల ప్రకారం నిర్ణయించాల్సిందిగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో గతంలో గ్రామ పంచాయతీల లెక్కల క్రారమే ఆస్తి పన్నులను వసూలు చేస్తుండడంతో కోట్ల రూపాయల ఆదాయాన్ని మునిసిపాలిటీలు కోల్పోతున్నాయి. 

Updated Date - 2021-07-26T03:07:29+05:30 IST