అరుదైన జీవ జాతులకు నిలయం.. కవ్వాల్‌

ABN , First Publish Date - 2022-01-29T08:16:29+05:30 IST

ఎటుచూసినా దట్టమైన అడవులు...

అరుదైన జీవ జాతులకు నిలయం.. కవ్వాల్‌

  • అభయారణ్యంలో సందడి చేస్తున్న అరుదైన పక్షి జాతులు
  • ఐరోపా నుంచి వలస వచ్చిన నార్తర్న్‌ పింటైల్‌ పక్షి

ఖానాపూర్‌, జనవరి 28: ఎటుచూసినా దట్టమైన అడవులు... అడవుల్లో గలగలపారే సెలయేర్లు... ఆ సెలయేర్ల ఒడ్డున చెట్లపై వాలి సేదదీరే తీరొక్క పక్షులు... ఉత్తర భారతదేశం నుంచే కాకుండా ఐరోపా, సైబీరియా ప్రాంతాల నుంచి సైతం వలస వచ్చిన అరుదైన జాతుల పక్షులు.. ఇలా ఎంత చెప్పినాతనివి తీరని ప్రకృతి అందాలు కవ్వాల్‌ అడవుల సొంతం. నిర్మల్‌ జిల్లా కేంద్రం నుంచి కేవలం 20కిలో మీటర్ల దూరంలోనే ప్రారంభమయ్యే దట్టమైన కవ్వాల్‌ అభయారణ్యంలో కనిపించే సుందర దృశ్యాలివి. ఎముకలు కొరికే చలిలో, అడవుల పొదల్లోంచి భానుడి కిరణాలు నీటిపై పడుతున్న సమయంలో ఇక్కడి చెరువులు, కుంటల్లో కనిపిస్తున్న సుందర దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. కవ్వాల్‌లో కనిపించే అరుదైన పక్షులు, జంతువులు, ప్రకృతి అందాలను సందర్శకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. 


ఈ చలికాలంలో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, కడెం, ఉడుంపూర్‌ రేంజ్‌ల పరిధిలోని అడవులకు అరుదైన నేస్తాల తాకిడి పెరిగింది. సైబీరియన్‌ పక్షులతోపాటు నార్త్‌ ఇండియాలో ఎక్కువగా కనిపించే వివిధ రకాల జాతుల పక్షులకు కవ్వాల్‌ అభయారణ్యం నిలయంగా మారింది. ఐరోపా నుంచికవ్వాల్‌లోని కల్పకుంటకు నార్తర్న్‌ పింటైల్‌ పక్షివలస వచ్చింది. అలాగే నార్త్‌ ఇండియా నుంచి వలస వచ్చే పక్షుల్లో ప్రస్తుతం ఊలీనెక్డ్‌ స్టార్క్‌, బ్రాహ్మినీ డక్‌, బ్లాక్‌ హెడెడ్‌ ఐబిస్‌, రెడ్‌ న్యాప్‌డ్‌ ఐబిస్‌, గ్రేట్‌ కార్మరెంట్‌, ఓరియంటల్‌ డార్టర్‌, గ్రీన్‌ హెరాన్‌తోపాటు పలు రకాల పక్షులు ఉన్నాయి. ఇవే కాకుండా అంతరించి పోతున్నాయనుకుంటున్న అరుదైన జాతులకు చెందిన ఎల్లో వ్యాటిల్డ్‌ ల్యాప్‌వింగ్‌, రివర్‌ లాప్‌వింగ్‌ వంటి ఎనిమిది రకాల పక్షులు కవ్వాల్‌ అడవుల్లో తిరిగి జీవం పోసుకుంటున్నాయి. పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి సహా 15 రకాల మాంసాహార జంతువులతోపాటు జింకలు, కుందేళ్లు, నీలుగాయిలు, కొండగొర్రెలు, దుప్పులు, చుక్కల దుప్పులు, అడవి బర్రెలు లాంటి మరో 65కు పైగా జాతులకు చెందిన శాఖాహార జంతువులు కవ్వాల్‌ అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-29T08:16:29+05:30 IST