చర్మం భద్రం!

Published: Tue, 23 Mar 2021 14:50:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చర్మం భద్రం!

చర్మ సమస్యలు తేలికగా వదిలిపోవు.  వాటికి శాశ్వత పరిష్కారం హోమియో వైద్యంలో సాధ్యపడుతుంది. 


హోమియో పనితీరు

శరీరం బలపడి వ్యాధితో పోరాడాలంటే వ్యాధినిరోధక వ్యవస్థను మరింత చైతన్యపరచాలి. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొనే హోమియో వైద్యం ప్రారంభంలో లక్షణాలు పెరుగుతాయి. ఎప్పడైతే రోగనిరోధకవ్యవస్థ చర్మ సమస్య తీవ్రతను గ్రహించి అందుకు విరుగుడుగా చురుగ్గా పనిచేస్తుందో, ఆ వ్యాధి అంతే త్వరగా అదుపులోకి రావడంతో పాటు భవిష్యత్తులో తిరగబెట్టదు.


చర్మ సమస్యలకు

రస్‌ టాక్సికోడెండ్రాన్‌: చర్మం మీద దురద, దద్దుర్లకు కారణమయ్యే పాయుయిజన్‌ ఐవీ ఈ మొక్క పలు రకాల చర్మ సమస్యలకు చక్కని పరిష్కారం. కీళ్ల నొప్పులకు కూడా దివ్యౌషధంలా పనిచేసే ఈ మొక్క హెర్పిస్‌, తామర, డెర్మటైటిస్‌తో పాటు పలు రకాల చర్మ సమస్యల లక్షణాలైన దురద, మంట, నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.


గ్రాఫైట్స్‌: జర్మనీ వైద్యుడు శామ్యూల్‌ హానిమన్‌ ఇతర చర్మ సమస్యలతో కూడిన చికిత్సలో దీన్ని మొదటగా ఉపయోగించారు. తామరలో తలెత్తే పొడిబారి, పొట్టు రేగే చర్మం సమస్యలకు, గాయం లేదా శస్త్రచికిత్స తరువాత మందబడే చర్మ సమస్యలకు ఈ మందును వాడతారు.


హెపర్‌ సల్ఫ్యూరిస్‌: గాయాలు మానడం అలస్యమవుతున్నా, పొట్టుతో కూడిన తామర ఉన్నా హెపర్‌ సల్ఫ్యూరిస్‌ వాడొచ్చు. ఆల్చిప్పల లోపలి పొరల్లోని క్యాల్షియం, సల్ఫర్‌ పువ్వుల బూడిదలను కలిపి వాడే ఈ ఔషధంతో తామర వ్యాధిలో తలెత్తే చర్మ పగుళ్లు, మొటిమలను తగ్గించవచ్చు. అలాగే స్టెఫలోకోకస్‌ అరస్‌ అనే బ్యాక్టీరియాను ఈ మందు అడ్డుకుంటుంది.


నేట్రం మురియాటికం: ఇందులో ఉండే ప్రధాన మూలకం సోడియం. దీంతో ‘యాక్నం వల్గారిస్‌’ అనే మొటిమల సమస్యకు, హెర్పిస్‌, తామరలో కనిపించే బొబ్బలు, సూర్యరశ్మి కారణంగా చర్మం కందిపోయే ఎలర్జీలకు చికిత్స చేయవచ్చు.


తుజ ఆక్సిడెంటాలిస్‌: ఇంటి అలంకరణ మొక్క ఇది. దీని నుంచి తయారుచేసే మందును హోమియోపతి వైద్యంలో మదర్‌ టింక్చర్‌గా ఉపయోగిస్తారు. హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌తో తలెత్తే పులిపిర్లకు కూడా ఈ చికిత్స ఫలితాన్నిస్తుంది.


మెజీరియం: మోజీరియన్‌ అనే పొద బెరడు నుంచి తయారైన ఈ మందుతో తలనొప్పి, పంటినొప్పులను తగ్గించవచ్చు. పసిపిల్లల్లో కనిపించే ‘క్రస్టాలాక్టియా’ (చెవుల వెనక, తల వెంట్రుకల కుదుళ్లు, కళ్ల చుట్టూ చర్మం జిడ్డుగా రాలే సమస్య) అనే చర్మసమస్యను కూడా తగ్గించవచ్చు.


ఆర్సీనియం అల్బం: ఆర్సీనియం ట్రయాక్సైడ్‌ను పలుచన చేస్తే తయారయ్యే ఈ మందును ఆర్సినిక్‌కు విరుగుడుగా వాడతారు. ఆర్సినిక్‌ శరీరంలో చేరడంతో తలెత్తే హైపర్‌టెన్షన్‌, ఆర్సీనియల్‌ కెరటోసిస్‌, ఆర్సినిక్‌ వల్ల వచ్చే కేన్సర్‌కు చికిత్స చేయవచ్చు.


నైట్రికం ఆసిడం: పులిపిర్లు, చర్మ గాయాల చికిత్సకు ఇది అద్భుతమైన మందు. పగుళ్లు, గాయాలు, రసి కారుతూ ఉండే పుండ్లు వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చు. 


సెపియా అఫిషనాలిస్‌: ఒకరకం సముద్ర జీవి విడుదల చేసే ఇంకు నుంచి ఈ మందు తయారవుతుంది. ఈ ఔషధాన్ని మహిళల్లో ప్రసవానంతరం కనిపించే మానసిక కుంగుబాటు, మెనోపాజ్‌ దశలోని మహిళల సమస్యలకు ఉపయోగిస్తారు. నొప్పితో కూడిన చర్మసమస్యలు, కంటి కురుపులు, వెరికోజ్‌ వెయిన్స్‌లకు కూడా ఈ మందు పనిచేస్తుంది.  


రానన్‌క్యులస్‌ బల్బోనస్‌: పసుపు పచ్చ రంగులో ఉండే ఈ మొక్క పువ్వులు విషపూరితమైనవి. హోమియో వైద్యంలో ఈ పువ్వులను కండర కణజాలం, చర్మ సంబంధ సమస్యలకు ఉపయోగిస్తారు. తామర, హెర్పిస్‌, వేళ్ల అంచులు చిట్లే ససమ్య, దురదలకు ఈ మందు పనిచేస్తుంది.


ఓలియాండర్‌: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ ఔషఽధం చర్మ కణాలకు ఆక్సిడేషన్‌ బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ల నుంచి రక్షణనిస్తుంది. సొరియాసిస్‌, చుండ్రు, హెర్పిస్‌ల చికిత్సలో వాడతారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.