పదవులపై మళ్లీ ఆశలు

ABN , First Publish Date - 2021-04-13T05:41:20+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ నేతలు నామినేటెడ్‌ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట ఉన్న సీనియర్‌ నేతలు ఈ దఫా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి తమకు అవ

పదవులపై మళ్లీ ఆశలు

నామినేటెడ్‌ పదవుల కోసం ప్రయత్నాలు

అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం వద్దకు జిల్లా గులాబీ నేతలు

ఎమ్మెల్సీ, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ల పదవులపై దృష్టి

స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవితను కలుస్తున్న ఉమ్మడి జిల్లా నాయకులు

తమకు పదవులు వచ్చే విధంగా చూడాలని వినతులు

రాష్ట్రస్థాయిలో జూన్‌లో ఏడు ఎమ్మెల్సీ, పలు కార్పొరేషన్‌ స్థానాలు ఖాళీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ నేతలు నామినేటెడ్‌ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట ఉన్న సీనియర్‌ నేతలు ఈ దఫా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి తమకు అవకాశం వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ కవితను కలుస్తూ సీఎం కేసీఆర్‌ దృష్టికి మంత్రి కేటీఆర్‌ వద్దకు తీసుకెళ్లి అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయి పోస్టుల కోసం పట్టుపడుతున్నారు. కార్పొరేషన్‌ గాని, వేరే నామినేటెడ్‌ పోస్టుల్లో భర్తీల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలో జూన్‌ నెలలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటితో పాటు రాష్ట్రస్థాయిలో 40 కార్పొరేషన్‌ల వరకు నామినేటెడ్‌ పోస్టులు ఉన్నాయి. జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత పదవీకాలం జూన్‌తో ముగుస్తుంది. ఆమె మరో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన ఆమె.. మారిన పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో చేరారు. చేరే సమయంలోనే ఆమెకు మరో దఫా ఎమ్మెల్సీగా అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ నుంచి హామీ ఉండడంతో మళ్లీ రెన్యూవల్‌ అవుతుందని వారు నమ్మకంతో ఉన్నారు. తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఏడు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నందున ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి ఉన్న తమకు ఇప్పటి వరకు ఏ పదవులు రాలేదని సామాజికవర్గాల ఆధారంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ బలంగా ఉండడం వల్ల తమకు అవకాశం కల్పించాలని వారు మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన స్పీకర్‌ను కలుస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కలుస్తూ ఎమ్మెల్సీగా లేదా కార్పొరేషన్‌ చైర్మన్‌గానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

రాష్ట్రస్థాయిలో పదవుల కోసం..

రాష్ట్రస్థాయిలో నిజామాబాద్‌ జిల్లా నుంచి మార గంగారెడ్డికి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. కామారెడ్డి జిల్లా నుంచి శ్రీధర్‌తో పాటు తిరుమల రెడ్డికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ల చైర్మన్‌ పదవులు ఇచ్చారు. నిజామాబాద్‌ నుంచి ఎక్కువ మందికి రాష్ట్రస్థాయిలో అవకాశం ఇవ్వలేదని ఈ దఫా తమకు కల్పించాలని ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ద్వారా మరికొంత మంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తమకు అవకాశం వచ్చేవిధంగా చూడాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యమకాలం నుంచి పనిచేసిన నేతలతో పాటు రాజకీయ అవసరాలరిత్యా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు కూడా కోరుతున్నారు. పార్టీలో సీనియర్‌లు చాలామంది ఉండడం వల్ల ఈ దఫా ఉమ్మడి జిల్లాకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణాల ఆధారంగా అవకాశాన్ని సీఎం కల్పిస్తారని నేతలు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ సాధ్యం కాకుంటే రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవుల్లో ఏది ఇచ్చిన తమకు సమ్మతమేనని వారు తెలియజేస్తున్నారు. మరికొంతమంది నేతలు నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గంతో పాటు గ్రంథాలయ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని మరికొంతమంది కోరుతున్నారు. ఈ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

సీనియర్‌లకు అవకాశం దక్కేనా?!

ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన సీనియర్‌ నేతలు కొంతమంది ఉండడం వల్ల వారికి ఈ దఫా అవకాశం వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే రీతిలో ఉద్యమకాలం నుంచి వెంట ఉన్న వారికి కూడా సీఎం అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తర్వాత నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఉంటుందని తెలియడంతో ఎక్కువ మంది అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ దఫా ఇద్దరు లేదా ముగ్గురికి రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు తెలిపారు. పార్టీ వెంట ఉన్న సీనియర్‌ నేతలకు ఈ దఫా అవకాశం వచ్చిందని వారన్నారు. వచ్చే నెల రోజుల్లో ఎవరికి రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు రానున్నాయో తేలే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-13T05:41:20+05:30 IST