సీఎం నిర్ణయంపైనే ‘చేర్యాల’ ఆశలు

ABN , First Publish Date - 2021-06-20T05:24:01+05:30 IST

చేర్యాల, జూన్‌ 19 : చేర్యాల ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై బోలెడన్ని ఆశలుపెట్టుకున్నారు.

సీఎం నిర్ణయంపైనే ‘చేర్యాల’ ఆశలు
రెవెన్యూ డివిజన్‌ సాధనకు పాదయాత్ర చేపట్టిన చేర్యాల జేఏసీ నాయకులు (ఫైల్‌)

రెవె‘న్యూ’ డివిజన్‌ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని వేడుకోలు !


చేర్యాల, జూన్‌ 19 :  చేర్యాల ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై బోలెడన్ని ఆశలుపెట్టుకున్నారు. తాజా రాజకీయ పరిణామాల కారణంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట హుజూరాబాద్‌ను జిల్లాగా మార్చుతున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నేడు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం వస్తుండడంతో తమ ఆకాంక్షలను గుర్తించి స్పష్టత ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

చేర్యాల చారిత్రక, భౌగోళిక నేపథ్యం కలిగినప్పటికీ 2009లో నియోజకవర్గం కనుమరుగవడంతో పాటు నూతన జిల్లాల ఏర్పాటుతో విచ్ఛిన్నమై అస్తిత్వాన్ని కోల్పోయింది. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో విలీనం వల్ల సమూల అభివృద్ధితో పాటు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుందని  భావించినప్పటికీ నిరాశే నెలకొన్నది. ఈ విషయమై కొంతకాలంగా వివిధ రకాలుగా ఆందోళనలు కొనసాగించినా స్పష్టత కానరాలేదు. కానీ కొన్ని నెలల క్రితం మద్దూరు మండలంలోని దూల్మిట్టను మండలంగా ఏర్పాటు చేస్తూనే అదే మండలంలోని అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాలను చేర్యాలలో విలీనం చేశారు. ఆయా గ్రామాల ప్రజల చిరకాలవాంఛ నెరవేర్చిన మాదిరిగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసి తమ ఆకాంక్షను సైతం నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చేర్యాల ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

చేర్యాలను చీల్చి కొమురవెల్లి నూతన మండలాన్ని ఏర్పాటు చేసి రెండు మండలాలను రెవెన్యూపరంగా సిద్దిపేట ఆర్డీవో పరిధిలో చేర్చారు. మద్దూరు మండలాన్ని హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు. పోలీస్‌, ట్రాన్స్‌కో శాఖలను హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధికి చేర్చి వ్యవసాయశాఖను గజ్వేల్‌ డివిజన్‌కు చేర్చారు. ఇక కోర్టు పనులకు జనగామ జిల్లాకేంద్రానికి వెళ్లాల్సిందే. అలాగే మద్దూరును చీల్చి దూల్మిట్ట మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా సిద్దిపేట, నియోజకవర్గం జనగామ, భువనగిరి పార్లమెంటు పరిధిలో కొనసాగుతుండటానికి తోడు డివిజన్ల విషయంలోనూ ఒక్కోశాఖను మూడేసి ప్రాంతాలకు కేటాయించడంతో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు తిప్పలు తప్పడం లేదు. చేర్యాల మండలంలోని నాగపురి, షబాషీగూడెం, పెద్దరాజుపేట, వేచరేణి గ్రామాలు కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చేర్చారు. కానీ రెవెన్యూపరంగా చేర్యాలకు వెళుతుండగా, వివాదాలు, తగాదాలు, ఇతరత్రా          సమస్యల పరిష్కారానికి వ్యయ ప్రయాసలు కోర్చి కొమురవెల్లి  పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. 

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును కోరుతూ ఆయా మండలాల్లోని గ్రామపంచాయతీల పరిధుల్లో ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తూ దశలవారీగా ఉద్యమించారు. మంత్రి హరీశ్‌రావు చొరవ వహించి నవంబరు 2019లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు. ఈ విషయమై సీఎస్‌ సోమే్‌షకుమార్‌ స్పందించి చేర్యాల భౌగోళిక, ఇతరత్రా వివరాలకు సంబంధించి నివేదిక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కాస్త కదలిక వచ్చిందని భావించినా ఇప్పటి కీ సందిగ్ధత వీడకపోవడం, ఇతర ప్రాంతాల్లో కొత్తగా డివిజన్లు ఏర్పాటుచేస్తుండటంతో అమాత్యుడి ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. తమ మనోభావాలను గుర్తించి ఆకాంక్షను నెరవేర్చాలని ఇక్కడి ప్రజలు అభ్యర్థిస్తున్నారు. 

Updated Date - 2021-06-20T05:24:01+05:30 IST