పేదల ఆశలే ఆసరాగా..

ABN , First Publish Date - 2022-07-02T06:19:49+05:30 IST

పేదల ఆశలే ఆసరాగా..

పేదల ఆశలే ఆసరాగా..

డబుల్‌ ఇళ్లు, బ్యాంకు రుణాల పేరిట మోసం

పోలీసులకు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి 

దందాలో ఓ అంగనవాడీ టీచర్‌, మెప్మా ఆర్‌పీ

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/ఖమ్మంక్రైం, జూలై 1 : పేద, మధ్య తరగతి వారి ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు దందాలకు పాల్పడు తున్నారనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. అలాంటి వారిపై కఠిన చర్యలు లేకపోవడంతో నిత్యం ఎక్కడో ఒక చోట పేదలు మోసపోవాల్సి వస్తోంది. రాజకీయ నాయకులతో అనుచరులుగా చలామణి అవుతున్న కొందరు తమకు పలుకుబడి ఉందని, తామేం చెబితే అది జరుగుతుం దంటూ మాయ చేస్తున్నారు. అలాంటి వారిలో మహిళలు కూడా ఉండ టం గమనార్హం. ఒక ఫార్మాట్‌ తయారుచేసి ఆశావహుల వివరాలు, వారికి ఏఫ్లోర్‌ కేటాయించారో కూడా చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మంలో ఒక అంగనవాడీ టీచర్‌.. మెప్మా ఆర్‌పీగా పనిచేస్తున్న మరోమహిళతో కలిసి కొందరు మహిళలకు టోకరా వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు మహిళలు సుమారు 100మంది నుంచి రూ.కోటి వరకు వసూలుచేశారని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటి వరకు రూ.30లక్షలకు సంబంధించి బాధితులు ఫిర్యాదుచేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో మిగిలిన వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఖమ్మం నగరంలోని జమ్మిబండ ప్రాంతంతోపాటు మరికొన్ని ఏరియాలకు సంబంధించిన మహిళలు నుంచి నగరానికి చెందిన అంగనవాడీటీచర్‌ షకీనాబేగం, మెప్మా ఆర్‌పీ లక్ష్మి ఇద్దరూ కలిసి.. ‘మీకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తాం’ అంటూ కొన్ని తప్పుడు పత్రాలు తయారుచేసి చూపారు. అలాగే మీరు కోరుకున్న చోట డబుల్‌ బెడ్‌రూం ఇళ్లుతోపాటు సబ్సిడీ రుణాలు కూడా ఇప్పిస్తామని నమ్మించి.. ఒక్కొక్కరి నుంచి రూ.50వేల నుంచి రూ.2లక్షలు వరకు వసూలు చేశారు. అయితే ఖమ్మంఅర్బన పోలీసుస్టేషనలో ఐదుగురు మహిళలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. వీరిలో నగరానికి చెందిన ఇద్దరు తాము రూ.75లక్షలు ఇచ్చామని, దీనిపై గతంలో పంచాయతీ చేయగా.. కొంత నగదు తిరిగిచ్చేందుకు ఒప్పందపత్రం పత్రం రాసు కున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ మహిళల చేతిలో మోస పోయినవారు చాలామంది ఉన్నారని, సుమారు రూ.కోటి వరకు వసూలుచేశారని, ఎవరికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడంలేదని బాధి తులు పేర్కొంటున్నారు. మోసపోయిన వారిలో కొందరు మహిళలు శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కూడా ఫిర్యాదుచేసి తమకు న్యాయంజరిగేలా చూడాలని కోరారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ మాట్లాడూతూ సంఘటనపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని, ఇళ్లు, రుణాలు ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని, అలాంటివారి గురించి తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 



Updated Date - 2022-07-02T06:19:49+05:30 IST