పదోన్నతులపై ఆశలు

ABN , First Publish Date - 2021-01-10T05:25:09+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ అవుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా చేపడుతున్నది.

పదోన్నతులపై ఆశలు

 90శాతం మంది ఉపాధ్యాయుల సర్వీసు వివరాల సేకరణ పూర్తి

 సీనియార్టీ జాబితాను సిద్ధం చేస్తున్న జిల్లా అధికారులు

 త్వరలో మార్గదర్శకాలు జారీ

 ఉమ్మడి జిల్లాలో వేయి మంది ఉపాధ్యాయులకు లబ్ధి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉద్యోగ, ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ అవుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా చేపడుతున్నది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలకు చెక్‌పెట్టడంతోపాటు భవిష్యత్‌లో కూడా ఉపాధ్యాయుల సమగ్ర సమాచారాన్ని తమ వద్ద ఉండే విధంగా పకడ్బందీగా సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ రూపొందిస్తున్నది. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జనార్థన్‌రావు చొరవ తీసుకొని ప్రత్యేక ఫార్మాట్‌ ద్వారా ఉపాధ్యాయుల నుంచి సర్వీసు, వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో దాదాపు 13 వేల మంది ఉపాధ్యాయులుండగా ఇప్పటికే దాదాపు 10వేల మంది ఉపాధ్యాయులు తమ వివరాలను అందించినట్లు తెలిసింది. ఒక్క భూపాలపల్లి జిల్లా పరిధిలోని మిగిలిన ఉపాధ్యాయుల వివరాలన్నిటిని కూడా సోమవారం వరకు తెప్పించి సీనియార్టీ జాబితాను పకడ్బందీగా పూర్తిచేసేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఒక వేళ ఉపాధ్యాయులు ఇచ్చే వివరాల్లో ఏమైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు ధ్రువీకరించినట్లయితే ఆ ఉపాధ్యాయుడితోపాటు ఆయన అందించిన సమాచారాన్ని ధృవీకరించిన అధికారులపై చర్యలు తప్పవని పేర్కొనడంతో పూర్తి పారదర్శకతగా సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. మూడంచె ల్లో ఉపాధ్యాయుల వివరాలను పరిశీలనచేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఉపాధ్యాయుల వివరాలను అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ పూర్తిచేసి సీనియార్టీ జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను కూడా స్వీకరించేందుకు ఉపాధ్యాయులకు అవకాశం కల్పించి తుది జాబితాను విడుదల చేస్తారు. అయితే పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే సీనియార్టీ జాబితాను విడుదల చేసి పదోన్నతుల ప్రక్రియను చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ పక్కాగా ప్రణాళికను రూపొందిస్తున్నది. ఈనెల 15 తర్వాత ఎప్పుడైనా పదోన్నతుల షెడ్యూల్‌ విడు

దలయ్యే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అప్పటికే సీనియార్టీ జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 


ఉమ్మడి జిల్లాలో వేయి మందికి లబ్ధి


జిల్లాల పునర్విభజనకు ముందు 2015 జూలైలో పదోన్నతుల ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత నుంచి పదోన్నతులు చేపట్టక పోవడం, దాదాపు ఆరేళ్ల తర్వాత సీఎం కేసీఆర్‌ పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉపాధ్యాయులు పదోన్నతులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ను కలిసి పదోన్నతులు, బదిలీ ప్రక్రియకు ఆమోదం తీసుకుంటారని ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్‌ ఇంకా పదోన్నతులకు సంబంధించిన ఫైలుపై ఆమోద ముద్ర వేయక పోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉంటే వారంరోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల మందికి పదోన్నతి పొందే అవకాశాలుండగా అందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వేయి మందికి ప్రమోషన్లు వస్తాయని భావిస్తున్నారు. పలువురు ఎస్టీజీలకు స్కూల్‌ అసిస్టెంట్లు, స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయుడి పదోన్నతి లభించనున్నది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 74 మండల విద్యాధికారి పోస్టులు ఉండగా అందులో 72 పోస్టులు, 500 వరకు ప్రధానోపాధ్యాయుల పోస్టులతోపాటు వివిధ హోదాల్లోని మరో 400 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే అవకాశాలుండడంతో అర్హులైన వారు ప్రమోషన్‌ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని ప్రకటించి ఏళ్లు గడిచినా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. ఈసారి అలా కాకుండా వెంటనే పదోన్నతుల, బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 


సీనియార్టీ జాబితాతో ఉపాధ్యాయులకు మేలు...


జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఫార్మాట్‌లో ఉపాధ్యాయుల నుంచి సేకరిస్తున్న వివరాల ఆధారంగా రూపొందిస్తున్న సీనియార్టీ జాబితాతో ఉపాధ్యాయులకు కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా జూనియర్‌ ఉపాధ్యాయుడి కంటే సీనియర్‌కు తక్కువ జీతభత్యాలు పొందుతున్నట్లు తెలిస్తే వాటిని సవరించే అవకాశముంటుందని, దీనితో సీనియర్లకు లబ్ది చేకూరుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లా విద్యాశాఖ వద్ద కూడా ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని, దీనితో భవిష్యత్‌లో కూడా అన్నిటికి ఉపయోగంగా ఉంటుందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. 

  

  

Updated Date - 2021-01-10T05:25:09+05:30 IST