గొర్రెల పంపిణీపై ఆశలు

ABN , First Publish Date - 2021-01-12T05:05:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడాతమని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో గొర్రె కాపరుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

గొర్రెల పంపిణీపై ఆశలు
గొర్రెలు

- మొదటి విడతలో డీడీలు చెల్లించిన వారికి ఈ నెలలో పంపిణీ

- వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో విడత లబ్ధిదారులకు..

- రెండేళ్లుగా 10,612 మంది లబ్ధిదారుల ఎదురుచూపు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడాతమని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో గొర్రె కాపరుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ నెలలో మొదటి విడతలో డీడీలు చెల్లించి గొర్రెలు పంపిణీ కాని వారికి మాత్రమే పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో ఇద్దరు లబ్ధిదారులు మాత్రమే డీడీలు చెల్లించగా వారికి పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను 2017లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద జిల్లాలో 21,254 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో 10,642 మంది లబ్ధిదారులకు, రెండో విడతలో 10,612 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఒక్కో యూనిట్‌ వ్యయం లక్షా 25 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 75 శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం 93,250 రూపాయలు, లబ్ధిదారుడి  వాటా 25 శాతం 31,250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా 2017 జూన్‌లో ప్రభుత్వం పథకాన్ని ఆరంభించింది. 

మొదటి విడతలో 10,223 మందికి..


మొదటి విడతలో 10,223 మంది లబ్ధిదారులకు 2,14,683 గొర్రెలను పంపిణీ చేశారు. కొందరు పథకం ద్వారా గొర్రెలను పొందేందుకు ఆసక్తి కనబర్చక పోగా, ఇద్దరు లబ్ధిదారులు మాత్రం డీడీలు చెల్లించారని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ నారాయణ తెలిపారు. మొదటి గొర్రెల పంపిణీ 2018 జనవరి నాటికే పూర్తి చేయాల్సి ఉండగా, జాప్యం జరిగింది. ఆ కార్యక్రమం సెప్టెంబరు వరకు సాగింది. అదే ఏడాది మార్చి నుంచి రెండో విడత గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతలో సెప్టెంబరులో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తామంటూ ఊరిస్తూ వస్తున్నది. కానీ రెండేళ్లు గడిచినా  ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు ముందు మాత్రం రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  త్వరలో సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ అడుగు ముందుకు కదలలేదు. ఇక రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇక ఉండదని ఆశలు వదులుకున్నారు. ఇటీవల గొల్ల, కుర్మలకు సీఎం కేసీఆర్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో బడ్జెట్‌ కేటాయించి రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి.  

 నాలుగువేల కోట్ల బడ్జెట్‌..


ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగుస్తుండగా, ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం కానున్నది. ఆలోపు రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. గొర్రెల పంపిణీ కోసం 4 వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో నాలుగైదు నెలల తర్వాత రెండో విడత గొర్రెలను పంపిణీ చేయనున్నారని తెలుస్తున్నది. రెండో విడతలో పంపిణీ చేసే గొర్రెలకు సంబంధించి లబ్ధిదారుడి వాటా కింద ఎంపికైన వారి నుంచి ఎలాంటి డీడీలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే డీడీలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ నారాయణ వెల్లడించారు. 

Updated Date - 2021-01-12T05:05:48+05:30 IST