సస్పెండ్‌ అయిన వారికి ఆగమేఘాలపై పోస్టింగ్‌లు

ABN , First Publish Date - 2021-10-18T05:42:27+05:30 IST

ల్లా విద్యా శాఖలో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. డబ్బులిస్తే చాలు ఏ నిబంధనలు లెక్క చేయకుండా, ఏ అక్రమమైనా చేసేస్తారు అనేంతగా పరిస్థితి ఏర్పడింది.

సస్పెండ్‌ అయిన వారికి ఆగమేఘాలపై పోస్టింగ్‌లు

అడ్డగోలుగా..

తూతూమంత్రంగా విచారణ

తాజాగా ప్రమోషనలు ఇచ్చేందుకు ప్రయత్నాలు

సెన్స్యూర్‌ ఇవ్వకుండా ఇంక్రిమెంట్‌ నిలుపుదల చేసేలా ఏర్పాట్లు

తర్వాత అందరితోపాటు ఉద్యోగోన్నతి ఇచ్చేలా రూట్‌ క్లియర్‌

అక్రమ వ్యవహారాల్లో చేతులు మారుతున్న రూ.లక్షలు 

జిల్లా విద్యాశాఖలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

అనంతపురం విద్య, అక్టోబరు 17: జిల్లా విద్యా శాఖలో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. డబ్బులిస్తే చాలు ఏ నిబంధనలు లెక్క చేయకుండా, ఏ అక్రమమైనా చేసేస్తారు అనేంతగా పరిస్థితి ఏర్పడింది. తప్పు చేసి సస్పెండ్‌ అయిన వారికి పోస్టింగ్‌ ఇవ్వటమే కాదు ఏకంగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్సాహం చూపుతుండటమే ఇందుకు మంచి ఉదాహరణ. తాజాగా ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో అడ్డగోలు వ్యవహారాలకు కొందరు అధికారులు గేట్లు తెరిచారు.  


ఇలా సస్పెన్షన్‌...అలా ఎత్తివేత !

గతేడాది ఉపాధ్యాయ బదిలీల్లో చాలా సిత్రాలే జరిగాయి. కొందరు టీచర్లు అడ్డగోలుగా ఆప్షన్లు ఇచ్చి లబ్ధి పొందారు. అలాంటి వారిని సస్పెండ్‌ చేశారు. జిల్లాలో ముగ్గురు ఎస్‌జీటీలు వారి స్పౌజ్‌లు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ స్థానాల్లో పనిచేస్తుంటే ఆ స్థానాలకు దగ్గరగా వెళ్లకుండా 14.5 శాతం, 20 శాతం హెచ్‌ఆర్‌ఏ వచ్చే స్థానాలకు ఆప్షన్లు ఇచ్చి లబ్ధి పొందారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో విచారణ చేసి ఈ ఏడాది జనవరి 29న ఆ ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. అంతకుముందే ఇద్దరిపై సస్పెన్షన వేటు పడింది. మరో 8 మంది టీచర్లు సైతం ఇదే తరహాలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ఫిబ్రవరి 4న వారిని సస్పెండ్‌ చేశారు. మొత్తం 13 మంది టీచర్లపై సస్పెన్షన వేటు వేయటం జిల్లా విద్యాశాఖ వర్గాలు, ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఆగమేఘాల మీద మార్చి 19న వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదే ఉపాధ్యాయ వర్గాల్లో భారీ స్థాయిలో చర్చకు దారితీసింది.


లక్షలు పడితే.. లక్షణంగా ఓకే..!

జిల్లా విద్యాశాఖలో రూ.లక్షలు చేతితో పడితే... లక్షణంగా తప్పును ఒప్పు చేసేలా కొందరు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 13 మంది టీచర్లు సస్పెండ్‌ అయితే... వారిపై ఉన్న సస్పెన్షన్‌ రివోక్‌ (రద్దు) చేయడానికి భారీగానే కాసులు చేతులు మారినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ. 60 వేలు చొప్పున  రూ. 7.80 లక్షలు జిల్లా విద్యాశాఖలోని కొందరు అధికారులు వసూలు చేశారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకే వారికి ఆగమేఘాల మీద సస్పెన్షన్‌ రద్దు చేసి పోస్టింగ్‌ ఇచ్చారన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఉద్యోగోన్నతులకు రూట్‌ క్లియర్‌ చేయడానికి సైతం భారీగానే బేరాలు ఆడినట్లు తెలుస్తోంది. అందుకే శరవేగంగా వారి పెండింగ్‌ ఎంక్వైరీ ఫైల్‌ను నడిపి ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. 


విచారణ పేరుతో షో...

తాజాగా ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు ఇస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. దీంతో తాత్కాలిక సీనియారిటీ జాబితాలు అందుబాటులో ఉంచారు. ఏవైౖనా వినతులు, అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ టీచర్లకు ఇప్పటికే విద్యాశాఖాధికారులు సమాచారం ఇచ్చారు. షెడ్యూల్‌ మేరకు ఈనెల 23న సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. 25న  గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 29, 30 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌, తత్సమానమైన కేడర్‌ పోస్టుల ఉద్యోగోన్నతులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అయితే ఈ ఉద్యోగోన్నతుల్లోనే గతంలో సస్పెండైన వారికి ప్రమోషనలు ఇచ్చేందుకు పావులు కదిపారు. ఆగమేఘాల మీద పెండింగ్‌ ఎంక్వైరీ కింద ఉన్న ఆ 13 మందికి రూట్‌ క్లియర్‌ చేయడానికి పెద్ద డ్రామా నడిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ పెండింగ్‌లో ఉంటే ఉద్యోగోన్నతులు పొందడానికి వీలు పడదు. అందుకు విచారణ అనే ఒక షో నడిపారు.  తూతూమంత్రంగా విచారణ చేసి... ఎలాగైనా వారికి ఉ ద్యోగోన్నతులు ఇవ్వాలని చూస్తున్నారు. సస్పెండ్‌ అయిన వారికి పనిష్మెంట్‌ కింద సెన్స్యూర్‌ (ఏడాదికి పాటు ఉద్యోగోన్నతులకు అనర్హులు) ఇవ్వాల్సి ఉంది. ఇది ఇస్తే వారికి ఉద్యోగోన్నతులు రావన్న ఉద్దేశ్యంతో తాత్కాలికంగా ఇంక్రిమెం ట్‌ నిలుపుదల చేస్తున్నట్టు, ఇదే వారికి ఇస్తున్న పనిష్మెంట్‌గా చూపి ఉద్యోగోన్నతులకు లైన్‌క్లియర్‌ చేయడానికి పావులు కదిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీ వారిని డీఈఓ ఆఫీ్‌సకు పిలిచి విచారణ పేరుతో నామమాత్రంగా పేపర్లపై రాయించుకుని పంపారు. ఈనేపథ్యంలోనే అక్రమార్కుల ఉద్యోగోన్నతులకు లైన్‌ క్లియర్‌ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Updated Date - 2021-10-18T05:42:27+05:30 IST