ప్రయోగశాలలు.. ఎప్పటికో

ABN , First Publish Date - 2021-11-22T05:30:00+05:30 IST

ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రయోగశాల ఏర్పాటుచేసి పాడి రైతులకు వైద్య సేవలు చేరువ చేస్తామంటూ ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది.

ప్రయోగశాలలు.. ఎప్పటికో
వేమూరులోని ప్రభుత్వ పశువైద్యశాల

ఆరంభశూరత్వంగా పశు వ్యాధి నిర్ధారణ

ఏప్రిల్‌లో ప్రకటన.. మూడు నెలల క్రితం ప్రారంభం

పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకంలో తాత్సారం

నియోజకవర్గానికో ప్రయోగశాల లక్ష్యంపై మీనమేషాలు 


పశు వ్యాధుల నిర్ధారణ ప్రయోగశాలలు.. ఆరంభశూరత్వంగా మారాయి. పశు వ్యాధులను కచ్చితంగా నిర్ధారించి.. సకాలంలో నివారణ చర్యలు చేపట్టి అధిక పాల దిగుబడులు సాధించి పాడి రైతులకు, పశు పోషకులకు మేలు చేయాలని ప్రభుత్వం తలచింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికో పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిని మూడు నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ప్రయోగశాలలు నిర్మించిన దగ్గర పరికరాలు ఉంటే సిబ్బంది ఉండరు.. సిబ్బంది ఉన్న దగ్గర పరికరాలు లేవు.. కొన్ని పాత భవనాల్లో ఏర్పాటు చేయగా మరికొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పశు పోషకుల దరికి వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలియడంలేదు.  


తెనాలి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రయోగశాల ఏర్పాటుచేసి పాడి రైతులకు వైద్య సేవలు చేరువ చేస్తామంటూ ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది. స్థలం ఉన్నవాటిని నిర్మించటం, స్థలాలు అందుబాటులో లేనివాటిని అక్కడి పశువైద్యశాలల్లోకానీ, అగ్రి ల్యాబ్స్‌లో ఖాళీ ఉన్నచోట ఒక గదిని కేటాయించి చేతులు దులుపుకున్నారు. పరికరాలు ల్యాబ్‌లకు చేరి మూడు నెలలపైనే అవుతున్నది. అయితే వాటిని ప్రయోగశాలల్లో అమర్చి ఉపయోగంలోకి తీసుకొచ్చే విషయంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద వీటిని అమర్చే బాధ్యత రెండు కంపెనీలకే అప్పగించారు. వీరు జిల్లాల వారీగా పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు జిల్లాకు వచ్చి పరికరాలు బిగించడానికి మరో మూడు, నాలుగు నెలలపైనే పడుతుందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో జిల్లాలో ల్యాబ్‌లు ఉండీ అలంకారప్రాయంగానే మిగిలాయి. పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను తీసుకొచ్చిన ప్రభుత్వం, అమలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పశుసంవర్ధక శాఖ స్పందిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. జిల్లాలోని 17 నియోజకవర్గాలకు 14 చోట్ల మాత్రమే ల్యాబ్‌లు మంజూరయ్యాయి.  గుంటూరు ఈస్ట్‌, నరసరావుపేటల్లో రెండు పెద్ద ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పెదకూరపాడు, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో అగ్రీ ల్యాబ్‌ భవనాల్లోని ఒక గదిని కేటాయించారు. సత్తెనపల్లి, తెనాలి(పెదరావూరు), బాపట్ల, తాడికొండ(తుళ్లూరు), మాచర్ల, వేమూరు, గురజాల, చిలకలూరిపేటల్లో నిర్మాణ దశలో ఉన్నాయి.


ల్యాబ్‌లో చేసే పరిక్షలు

పశువులు, ఇతర పెంపుడు జంతువులకు వచ్చే వ్యాధులను ఆధునిక పరీక్షా విధానంలో ముందుగానే తెలుసుకుని వాటిని నివారించటం లక్ష్యంగా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ల ద్వారా రక్తం, మూత్రం, పేడ, పాలు పరిశీలన చేయాలి. చర్మవ్యాధులు, ధాతు లోపాల వంటివి వాటిని పరీక్షల ద్వారా తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలి. బయోకెమికల్‌ ఎనాలసిస్‌ వంటి 27 రకాల అత్యాధునిక పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం సాధారణంగా చేపట్టే కేవలం 6 రకాల పరీక్షలను మాత్రమే కొన్ని ల్యాబ్‌లలో చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన టెక్నికల్‌ సిబ్బందిని, సహాయక సిబ్బందిని ఎస్వీ యూనివర్సిటీ అప్పట్లోనే ఎంపిక చేసింది. గుంటూరు, పొన్నూరులోని ల్యాబ్‌లలో మాత్రం ఒకచోట ల్యాబ్‌ అసిస్టెంట్స్‌, మరోచోట సహాయ సిబ్బంది లేరు. వేమూరు, మంగళగిరి, రేపల్లె ల్యాబ్‌లలో మైక్రోస్కోప్‌లు లేవు. మరికొన్ని చోట్ల పరికరాలు అరకొరగా ఉన్నాయి.


త్వరలో అందుబాటులోకి

ప్రభుత్వం తీసుకొచ్చిన పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌ల విషయంలో కొందరు అపోహలతో ఉన్నారు. అన్నీ సమకూరాయి. కొన్నిచోట్ల ఇప్పటికే పరీక్షల ఫలితాలు రైతులకు అందుతున్నాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే స్థల, పరికరాల ఇబ్బందులున్నాయి. ఎక్కడా అలసత్వం లేదు. అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రోజుల వ్యవధిలోనే రైతులకు పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి. - డాక్టర్‌ ప్రసూన, అదనపు ఏడీ, పశుసంవర్ధక శాఖ, గుంటూరు


 

Updated Date - 2021-11-22T05:30:00+05:30 IST