పేదల ఆసుపత్రిపై ఎంతకంత నిర్లక్ష్యం!?

ABN , First Publish Date - 2020-12-01T04:28:36+05:30 IST

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ప్రభుత్వ వైద్యశాల.. జిల్లాలోని ఎందరో పేదలకు వైద్యపరంగా వరప్రసాదిని.

పేదల ఆసుపత్రిపై ఎంతకంత నిర్లక్ష్యం!?
సెల్లార్‌లో నీటిని తోడుకుతున్న అగ్నిమాపక సిబ్బంది

జీజీహెచ్‌లో అసలేం జరుగుతోంది!?

ఆదివారం ఘటన.. ఎవరిది బాధ్యత

సెల్లార్‌ మునిగిపోతున్నా బేఖాతర్‌

దీనివల్లే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ఆసుపత్రి భారమంతా ఇద్దరు ఎలక్ట్రిషీయన్లపేనే

ఇద్దరు రోగుల మృతిపై సందేహాలెన్నో

నెల్లూరు (వైద్యం)నవంబరు 30 : నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ప్రభుత్వ వైద్యశాల.. జిల్లాలోని ఎందరో పేదలకు వైద్యపరంగా వరప్రసాదిని. రూ.352 కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రిని ఆధునీకరించి, పభుత్వ వైద్య కళాశాలతోపాటు 750 పడకల సౌలభ్యం కల్పించారు. అయితే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్నట్టుగా జీజీహెచ్‌ పరిస్థితి మారిపోయింది. రోగికి అవసరమైన సదుపాయాలు ఎంతోకొంత ఉన్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఒక్కోసారి వారి ప్రాణాల మీదకే వస్తోంది. ఆదివారం విద్యుత్‌ సరఫరా ఆగిపోయి అంధకారంలోకి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. ఆసుపత్రి భవనంలోని సెల్లార్‌లో చిన్నపాటి వర్షానికే నీరు చేరిపోతోంది.  ఇక్కడే విద్యుత్‌ కంట్రోల్‌ ప్యానల్‌ ఉంది. 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి ఉధృతి పెరిగి 5 అడుగుల విద్యుత్‌ ప్యానల్‌ వరకు చేరిపోయింది. దీంతో విద్యుత్‌ ప్రసారాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ముందుగానే సెల్లార్‌లో నీటిని తోడేసి ఉంటే సరిపోయేది. అయితే, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీసం అందుబాటులో ఉన్న రెండు జనరేటర్ల ద్వారా కూడా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించలేకపోయారు. అధికారుల తీరుపై అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా జీజీహెచ్‌లో చోటుచేసుకుంటున్న సమస్యలు, అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వైద్య కళాశాలలో నాలుగు అంతస్థులు ఉండగా, ప్రతి అంతస్థుకు విద్యుత్‌ ప్యానల్‌ బోర్డులు ఉన్నాయి. ఇందుకు విరుద్దంగా జీజీహెచ్‌ సెల్లార్‌లో ఒకే ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేయడం, వర్షం వచ్చినప్పుడల్లా సమస్యలు ఉత్పన్నం అవుతున్నా పట్టించుకోకపోవడం పట్ల  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అత్యవసర శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే..

ఇదిలా ఉంటే జీజీహెచ్‌ మూడవ అంతస్థులో 10 ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అత్యవసర శస్త్రచికిత్సలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం కరోనా బాధితులు 46 మంది ఆసుపత్రులో ఉన్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బాధితులు వందల సంఖ్యలో ఉండేవారు.  ఆ  స్థితిలో ఇలా విద్యుత్‌ సరఫరా ఆగిపోయి ఉంటే పరిస్థితి ఏమిటన్న భయాందోళన అందరిలోనూ నెలకొంది. ఇతర  వ్యాధిగ్రస్థులకు సంబంధించి శస్త్రచికిత్సలు అత్యవసరమైతే ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆదివారం చోటుచేసుకున్న విధంగా 8 గంటలపాటు విద్యుత్‌ ఆగిపోతే రోగుల తరలింపులో వెంటిలేటర్లపై ఉండే వారికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 


ఎలక్ర్టీషియన్ల కొరత

ప్రధాన ఆసుపత్రితోపాటు ప్రసూతి ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల, విద్యార్థుల వసతి గృహాలు, వైద్యులు, వైద్య సిబ్బంది క్వార్టర్స్‌ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉన్న భవనాలలో విద్యుత్‌ ప్రసారాలలో ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కనీసం 10 మంది ఎలక్ర్టీషియన్లు అవసరం. అయితే జీజీహెచ్‌లో అలాంటి నియామకాలు చేపట్టలేదు. ఐదుగురు రెగ్యులర్‌ ఎలక్ర్టీషియన్లను నియమించాల్సి ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ కేవలం ఇద్దరు కాంట్రాక్టు ఎలక్ర్టీషియన్లు  మాత్రమే అందుబాటులో ఉన్నారు. వారు కూడా ట్రామాకేర్‌ విభాగానికి చెందిన వారే. విద్యుత్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏమైనా లోపాలు ఏర్పడితే సరిదిద్దే పరిస్థితి లేదు.  


ఇద్దరి మృతిపై అనుమానాలెన్నో?

ఇదిలాఉంటే ఆదివారం విద్యుత్‌ ఆగిపోయిన కారణంగా దాదాపు 8 గంటలపాటు ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందులో 55 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో పాటు కిడ్నీ డయాలసిస్‌ చికిత్స పొందుతున్నారు. విద్యుత్‌  సరఫరా అర్ధంతరంగా ఆగిపోవడంతో వెంటిలేటర్‌పై ఉన్న బాధితుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ఓ మహిళ కూడా కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ అందక మృతి చెందినట్టు సమాచారం. అయితే, ఈ మృతులపై అధికారులు మాత్రం విద్యుత్‌ సరఫరా ఆగిపోవడం వల్ల వారు మృతి చెందలేదని చెబుతున్నారు.  కరోనా బాధితులను, ఐడీ వార్డుకు, సాధారణ రోగులను ఓపీ భవనానికి తరలించి చికిత్స చేస్తున్నారు. 


సీపీఎం ఆందోళన

ఇదిలా ఉంటే జీజీహెచ్‌లో విద్యుత్‌ అంతరాయంపై సీపీఎం ఆందోళన చేపట్టింది. ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సాంబశివరావును కలిసి పరిస్థితిని మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదలకు వైద్యం అందించే జీజీహెచ్‌లో విద్యుత్‌ సరఫరా ఆగిపోవడం బాధాకరమన్నారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు కృష్ణయ్య, సంపత్‌కుమార్‌, కిన్నెర కుమార్‌, వీర్ల శ్రీనివాసులు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T04:28:36+05:30 IST