లేవు.. లేవు.. లేవు!!

ABN , First Publish Date - 2022-05-28T05:41:32+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి(జీజీహెచ)కి నెలకు సగటున రూ.2 లక్షల మందులు అవసరం. 3 నెలలకు ఒకసారి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి మందులు తీసుకునే అవకాశం ఉంది.

లేవు.. లేవు.. లేవు!!
ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

జీజీహెచలో మందుల కొరత

అత్యవసర మందులకూ మంగళం 

కనీసం బ్యాండేజ్‌ కూడా లేదు

బయట కొనుగోలు చేసేందుకు అప్పులు ముట్టవు

ఇప్పటికే రూ.కోటి బకాయిలు 

చేతులెత్తేసిన ప్రైవేట్‌ మెడికల్‌ ఏజెన్సీలు 



దెబ్బ తగిలితే కట్టు కట్టే బ్యాండేజీ... లేదు                      

సిరంజిలు.... లేవు

అవసరమైన సిరప్‌లు...  లేవు

నార్మల్‌ సెలైన్లు...  లేవు

యాంటీ బయోటిక్స్‌... లేవు

మెట్రోజైల్‌ ఐవీ....  లేదు

కనీసం గ్లూకోస్‌ స్టిప్‌లు....  లేవు 


లేవు.. లేవు... లేవు... ఏదడిగినా లేవు. ఇదీ జిల్లాకే తలమానికమైన ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వినిపించే సమాధానం. ఈ ప్రధాన వైద్యశాలను ఆరు నెలలుగా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జీజీహెచకి ప్రతి రోజూ 1500 మంది వరకు వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది నిరుపేదలే. అయితే వారికి అవసరమైన మం దులు కూడా అక్కడ అందుబాటులో లేవు.  దీనికి ముఖ్య కారణం నిధులు లేకపోవట మే. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో దాతలు దయతలచి ఆర్థిక సహకారం అందిస్తేగానీ మందులు కొనలేని దయనీయ స్థితి అక్కడ నెలకొంది. అయితే దాతల నుంచి నిధుల సేకరణ దిశగా ఆసుపత్రి వర్గాల ప్రయాత్నాలు సాగటం లేదు. కలెక్టర్‌ ఇస్తానన్న నిధులు కూడా సకాలంలో రాకపోవటంతో అధికారులు చేతులేత్తేస్తు న్నారు. ఫలితంగా నిరుపేదలకు వైద్యం మరింత దుర్భరం అవుతోంది.



నెల్లూరు(వైద్యం) మే 27 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి(జీజీహెచ)కి నెలకు సగటున రూ.2 లక్షల మందులు అవసరం. 3 నెలలకు ఒకసారి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి మందులు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ప్రస్తుత త్రైమాసికానికి అనుమతులు రాకపోవంతో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి మందులు తీసుకునే వీలు లేకుండాపోయింది. ఇక, అత్యవసర మందుల విషయానికి వస్తే ఎక్కువగా బయట ఏజెన్సీల నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. జీజీహెచకు అత్యవసర మందులు సరఫరా చేసే రెండు ఏజెన్సీలకు రమారమి రూ. కోటి బకాయి ఉన్నట్లు తెలిసింది. దీంతో బాకీ చెల్లించకుండా మందులు ఇవ్వలేమని ఆ ఏజెన్సీలు తేల్చిచెప్పేశాయి. ఇటు ప్రభుత్వం నిధులు విడుదల చేయక, అటు ఏజెన్సీలు అప్పు ఇవ్వకపోవటంతో ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమైంది. అక్కడక్కడ సర్దుబాటు చేసి తాత్కాలికంగా మందులు కొనుగోలు చేసినా అవి నాలుగు రోజులు కూడా రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు మందుల చీటీ రాసిచ్చి బయట కొనుక్కోవాలని సూచిస్తుండటంతో పేదలపై అదనపు భారం పడుతోంది. 


బ్యాండేజీ కూడా లేదంట!


ప్రభుత్వం జనరల్‌ ఆసుపత్రిలో కనీసం బ్యాండేజీ కూడా లేదంటే రోగులు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు 1000 సిరంజిలు అవసరంకాగా అవి అందుబాటులో లేవు. లైఫ్‌ సపోర్టు డ్రగ్‌గా ఉన్న నార్మల్‌ సెలైన (సోడియం క్లోరైడ్‌) కూడా లేదు. అలర్జీకి వాడే అడ్రినల్‌ మందులు లేవు. అలాగే అస్తమా వ్యాధికి వాడే నాన అడ్రినల్‌, యాంటీ బయోటిక్స్‌ సిట్రోయాక్సిన, టాక్సిన, సెఫొటాక్సిన, సుప్రియాక్సిన వంటివి కూడా లేవు. గ్యాసి్ట్రక్‌ సమస్యకు ఇచ్చే పానటాక్‌కు సపోర్టింగ్‌గా వాడే సిరప్‌ కూడా ఇక్కడ లేదు. పానటాక్‌ మాత్రలను తాత్కాలికంగా బయట కొనుగోలు చేసినా అవి అయిపోయే దశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఇనఫెక్షన నివారణకు వినియో గించే మెట్రోజైల్‌ ఐవీ (ఇంట్రావైరల్‌ లిక్విడ్‌) కూడా జీజీహెచలో అందుబాటులో లేదు. జ్వరానికి వినియోగించే పారాసెటిమల్‌ ఇంజక్షన, పెంటాప్రొజోల్‌ ఇంజక్షన్లూ లేవు. షుగర్‌ పరీక్షలకు సంబంధించి కనీసం గ్లూకోజ్‌ స్ర్టిప్స్‌ కూడా లేకపోవడం గమనార్హం.



మందులు బయటకు రాస్తున్నారు


పెద్దాసుపత్రిలో వైద్యులు రోగులకు మందులు బయటకు రాస్తున్నారు. ఇక్కడ మందులు లేవని సిబ్బంది చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆసుపత్రికి మందులు రావాల్సి ఉందని, ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే వారంతా నిరుపేదలేనన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవటం దుర్మార్గం. 

-  వెంకటేశ్వర్లు, బాధితుడు


సాధారణ మందులు కూడా లేవు 


ఆసుపత్రిలో సెలైన, సాధారణ మందులు కూడా లేవంటున్నారు. సిబ్బందిని అడిగితే త్వరలో వస్తాయని చెబుతున్నారు. చేసేది లేక బయట కొనుక్కుంటున్నాం.

- శ్రీనివాసులు, బాధితుడు


నిధుల కొరత 


మందుల కొనుగోలుకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో నిధుల కోసం అగచాట్లు తప్పటం లేదు. నిధులు వస్తే మందులు కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం కొంత వరకు మందులు కొన్నాం. అయినా కొరత తీవ్రంగా ఉంది. 

- డాక్టర్‌ రాధాకృష్ణరాజు, జీజీహెచ సూపరింటెండెంట్‌

Updated Date - 2022-05-28T05:41:32+05:30 IST