హా..సుపత్రులు!

ABN , First Publish Date - 2022-06-27T06:34:34+05:30 IST

అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అభివృద్ధి అంతా మేమే చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్య సేవలందిస్తున్నాం..

హా..సుపత్రులు!
గోపాలపురంలో రూ. 1.50 కోట్లతో నిర్మించిన సీహెచ్‌సీ భవనం

ఆసుపత్రులున్నా.. సేవలు సున్నా

చీకట్లో గోపాలపురం ఆసుపత్రి 

కరెంట్‌ లేదు.. జనరేటర్‌ పనిచేయదు

గత మూడేళ్లుగా ఇదే తీరు

నిడదవోలులో ఓపీకి వైద్యులు లేరు..

కొవ్వూరులో రిఫర్‌ చేయడంతోనే సరి 

ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యపు ఛాయలు


అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అభివృద్ధి అంతా మేమే చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్య సేవలందిస్తున్నాం.. ఇవీ నాయకులు ఇచ్చే ప్రసంగాలు.. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే నియోజకవర్గ కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో చిన్న చిన్న సమస్యలను మూడేళ్లగా పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నారు.. ఇందులో ప్రధానంగా గోపాలపురం ఆసుపత్రి సమస్య వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే మూడేళ్ల కిందట గత ప్రభుత్వ హయాంలో రూ. కోటిన్నరతో ఆసుపత్రి భవనం నిర్మించారు.. నేటికీ ఆ ఆసుపత్రికి విద్యుత్‌ సౌకర్యం కల్పించకలేకపోయారు. దీంతో అన్ని సౌకర్యాలున్నా సేవలు మాత్రం సున్నాగా మిగిలాయి.  ఇటీవల కలెక్టర్‌ సందర్శించి సిబ్బందిపై మండిపడ్డారు. అయినా నేటికీ తీరు మారలేదు. ఇక నిడదవోలు ఆసుపత్రిని సుమారు   రూ.3 కోట్లతో నిర్మించారు. ఇప్పటి వరకూ పూర్తిస్థాయి వైద్య సిబ్బంది నియమించలేకపోయారు.               ఇక అత్యవసర సమయంలో కొవ్వూరు ఆసుపత్రికి వెళితే రిఫర్‌ చేసి సరిపెడుతున్నారు.  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. 


కలెక్టర్‌ హెచ్చరించినా.. గోపాలపురం ఆసుపత్రిలో మారని తీరు


గోపాలపురం, జూన్‌ 26 : జిల్లా కలెక్టర్‌ చెప్పినా తీరు మారలేదు.. నేటికీ సమస్యలు పరిష్కరించలేదు.గత ప్రభుత్వ హయాంలో సుమారు కోటిన్నరతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు..ఆ తరువాత ప్రభుత్వం మారిపోయింది. కనీసం రూ.50 వేలు ఖర్చు పెట్టి విద్యుత్‌ సౌకర్యం కల్పించలేకపోయారు.. గత మూడేళ్లగా సమస్య ఉన్నా పట్టించుకునే నాథులే కానరాలేదు.ఇదెక్కడో మారుమూల కాదు..నియోజకవర్గ కేంద్రమైన గోపాల పురంలో.. దీంతో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలున్నా ఎందుకూ పని రాకుండా పోతు న్నాయి. వైద్య సేవలు సక్రమంగా అంద డం లేదు. సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రి.. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ హోదా పొందినప్పటికీ దానికి వసతులు కల్పించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో వైద్య విధాన పరిషత్‌ నిధులు సుమారు కోటిన్నరకు పైగా ఖర్చు చేసి భారీ భవనాన్ని నిర్మించారు. అయితే దానికి అవసరమైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయలేకపోయారు.నాటి నుంచి నేటి వరకు విద్యుత్‌ సౌకర్యం లేక నిరుప యోగంగా మారింది. దీంతో ఒక దాత జనరేటర్‌ను కొనుగోలు చేసి ఇచ్చారు. అది వినియోగంలో లేక మరమ్మతులకు లోనై మూలకు చేరింది. దీంతో ఆసుపత్రిలో యూపీఎస్‌తో సరి పెట్టుకునే పరిస్థితి నెలకొంది. ఎక్సరే విభాగం ఉన్న రేడియోగ్రాఫర్‌ లేకపోవడం వల్ల పనిచేయడంలేదు.ఆసుపత్రిలో వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో రోగులకు సత్వర సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్‌ బ్యాంకు ఉన్నా దాన్ని కొనసాగించేందుకు సరైన వసతులు లేకపోవడంతో అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే ఇతర ప్రాంతా లకు వెళ్లాల్సిందే.. పోస్టుమార్టం చేయడానికి అనుమతులున్నా సరైన వసతులు లేక పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు, రాజమండ్రి వెళ్లాల్సిన దుస్థితి. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్నప్పుడు ఆసుపత్రికి ప్రతి నిత్యం రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారు. ప్రసవాలు, ఆపరేషన్లు, నిరంత రాయంగా జరిగేవి. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రం హోదా పెరిగినా వసతులు లేక వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది.ఏదైనా ప్రమాదభరితమైన కేసు వస్తే రాజమండ్రి, కొవ్వూరు వంటి ఆసుపత్రులకు పరుగెత్తాల్సిందే.  



కొవ్వూరు వెళితే.. రిఫర్‌ చేస్తారంతే..



కొవ్వూరు, జూన్‌ 26 : పేరుగొప్ప ఊరుదిబ్బ అంటే ఇదేనేమో. రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిద్యం వహిస్తున్న కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కొరతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన కొవ్వూరు పట్టణంలోని  సామాజిక ఆరోగ్య కేంద్రం రోగులపాలిట రిఫరల్‌ కేంద్రంగా మారింది. ప్రజలు ఏ చిన్న వైద్యానికి వచ్చినా  రాజమహేంద్రవరం ఆసుపత్రికి రిఫర్‌చేయడంతో రిఫరల్‌ కేం ద్రంగా పేరుగాంచింది. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి రోజు 250 నుంచి 300 మంది రోగులు వైద్య సేవలకు వచ్చేవారు. ప్రస్తుతం వైద్యుల కొరత కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. అంతేకాకకుండా కొవ్వూరు పట్టణానికి ఆనుకుని గామన్‌బ్రిడ్జి, రోడ్డు కం రైలు బ్రిడ్జిలతో పాటు, రాష్ట్ర, జాతీయ రహాదారులు ఉన్నాయి. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయినా ఏ ఒక్కరికీ వైద్య సేవలందవు.. ఎవరు వచ్చినా రాజమహేంద్రవరం వెళ్లిపోవాల్సిందే. దీనిపై కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుభాషిణిని ప్రశ్నించగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల భర్తీ చేస్తేనే ప్రజలకు పూర్తిస్తాయిలో వైద్యం అందించగలమన్నారు.

ఖాళీగా ఉన్న పోస్టులివే..

సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు 1, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ 1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు 8మందికి 4గురు మాత్రమే ఉన్నారు. స్టాఫ్‌నర్సులు 10 మందికి ఆరుగురు ఉన్నారు. దియేటర్‌ అసిస్టెంట్‌లు 2, పోస్టుమార్టం అసిస్టెంట్లు 2, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌, రేడియోగ్రాఫర్‌ 1, ఫార్మాసిస్టు 1, ఏఎన్‌ఎమ్‌ 1, దోబి 1, స్వీపర్‌లు 4, జనరల్‌ డ్యూటీ అటెండర్‌లు 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 



నిడదవోలులో ఓపీ సేవలకూ చింతే..


నిడదవోలు, జూన్‌ 26 : రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్ద పీట వేస్తున్నామన్నది ఒట్టి మాటలే. దీనికి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రే నిదర్శ నం.నిడదవోలు పట్టణంలోని ప్రభు త్వ ఆసుపత్రి స్థానంలో వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.2.97 కోట్ల  నాబార్డు నిధు లతో పక్కా భవనాన్ని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016లో నిర్మించారు.అయితే అప్పటి నుంచి ఇప్ప టి వరకు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత కారణంగా పేదల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యం గా గర్భిణులకు మహిళా గైనిక్‌ డాక్టర్‌ పూర్తిస్థాయిలో లేరు.  మత్తు డాక్టర్‌ లేకపోవ డంతో గర్భిణులు అప్పులు చేసి కార్పొ రేట్‌ ఆసుపత్రులను ఆశ్రయి స్తున్నారు.మరో పక్క ఆపరేషన్‌ థియేటర్‌ ఉన్నా సరైన సాంకేతిక పరిజ్ఞానం అమరకపోవడం  వల్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్‌ ఈ ఆసుపత్రికి జనరేటర్‌ ఏర్పాటు చేయించారు. అది ఎప్పుడు చూసినా మరమ్మతులే. పూర్తి స్తాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో ఔట్‌ పేషెంట్‌ విభాగంలో రోగులకు సేవల కొరతే. 

Updated Date - 2022-06-27T06:34:34+05:30 IST