అల్లాహ్‌ మెచ్చిన ఆతిథ్యం

Dec 3 2021 @ 01:58AM

కసారి మహాప్రవక్త మహమ్మద్‌ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ‘‘ఓ మహా ప్రవక్తా! నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా ఉంటే పెట్టండి’’ అని అడిగాడు. 

అప్పుడు మహమ్మద్‌ తన ఇంట్లో తినడానికి ఏదైనా ఉంటే తీసుకురమ్మని ఒక మనిషిని పంపించారు. 

కొంతసేపటికి ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ‘‘మీ ఇంట్లో తాగడానికి నీరు తప్ప మరేవీ లేవు’’ అని చెప్పాడు.

అప్పుడు మహాప్రవక్త అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి... ‘‘మీలో ఎవరైనా ఈ రోజు రాత్రి ఈయనను అతిథిగా తీసుకువెళతారా?’’ అని అడిగారు.

అక్కడే ఉన్న ఆయన అనుచరుడు అబూతలహా అన్సారీ ‘‘మహా ప్రవక్తా! అతణ్ణి నేను అతిథిగా తీసుకువెళ్తాను’’ అని చెప్పారు. అతణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంట్లో గౌరవంగా కూర్చోబెట్టి, తన భార్యతో ‘‘ఈయన మహాప్రవక్త మహమ్మద్‌ గారి అతిథి. ఈ రోజు మనం తినకపోయినా పరవాలేదు. ఈయనకు ఎలాంటి లోటు రానివ్వకూడదు’’ అన్నారు. 

‘‘ఈ రోజు పిల్లల కోసం ఉంచిన రొట్టె ముక్కలు, తాగడానికి కొంత నీరు తప్ప మరేవీ లేవు’’ అని ఆమె చెప్పింది. ‘‘సరే! నువ్వు పిల్లలకు ఏవైనా నీతి కథలు చెప్పి పడుకోబెట్టు. మనమిద్దరం ఈ పూట ఏమీ తినొద్దు. ఈ విషయం మన అతిథి గుర్తించకుండా జాగ్రత్త పడాలి. మేము భోజనానికి కూర్చున్నప్పుడు నువ్వు దీపం ఆరిపోయేలా చెయ్యి. ఆ తరువాత చీకటిలోనే మన అతిథికి రొట్టెలు వడ్డించు. నేను ఖాళీ పళ్ళెం ముందు ఉంచుకొని, రొట్టెలు తింటున్నట్టు నటిస్తాను’’ అన్నారు.

అలా ఆ భార్యాభర్తలిద్దరూ అతిథికి ఏమాత్రం అనుమానం రాకుండా... అతని కడుపు నింపారు. పిల్లలతో సహా వారు పస్తు ఉన్నారు. 

మరునాడు ఉదయం మహా ప్రవక్త దగ్గరకు అబుతలహా వచ్చారు. 

మహా ప్రవక్త ఆయనను చూసి... తన చుట్టూ ఉన్నవారితో ‘‘ఇతను నిన్న రాత్రి చేసిన పుణ్యకార్యానికి అల్లాహ్‌ ఎంతో సంతోషించాడు’’ అని చెప్పారు.

నిస్వార్థంగా, సేవాతత్పరతతో అతిథి సత్కారాన్ని చేసిన వారు ఎల్లప్పుడూ అల్లాహ్‌ కృపకు పాత్రులవుతారు.

  • మహమ్మద్‌ వహీదుద్దీన్‌
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.