ముస్లిం విద్యపై.. వివక్ష

ABN , First Publish Date - 2022-06-28T05:17:51+05:30 IST

ముస్లిం విద్యార్థులకు సాంకేతిక విద్యపై ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. ముస్లీం మైనార్టీ బాలురు, బాలికలకు సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నరసరావుపేట మండలం ములకలూరు వద్ద ఐటీఐ కళాశాల, వసతి గృహాలను నిర్మించారు. కేంద్ర ముస్లీం మైనార్టీ శాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యాయి.

ముస్లిం విద్యపై.. వివక్ష
బాలికల వసతి గృహం


ఐటీఐ కళాశాల భవన నిర్మాణాలతో సరి

రూ.8.12 కోట్లతో నిర్మించిన భవనాలు నిరుపయోగం 

కళాశాలల్లో అడ్మిషన్లు వసతి గృహాల్లో ప్రవేశాలు ఎప్పటికో


నరసరావుపేట, 27: ముస్లిం విద్యార్థులకు సాంకేతిక విద్యపై ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. ముస్లీం మైనార్టీ బాలురు, బాలికలకు సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నరసరావుపేట మండలం ములకలూరు వద్ద ఐటీఐ కళాశాల, వసతి గృహాలను నిర్మించారు. కేంద్ర ముస్లీం మైనార్టీ శాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యాయి. రూ.8.12 కోట్లతో  భవనాలను నిర్మించారు. అయితే మూడేళ్లుగా ఈ భవనాలు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వం నిర్మించి ప్రారంభించిన కళాశాల, వసతిగృహాల భవనాలను ప్రస్తుత ప్రభుత్వం వినియోగించకుండా పాడు బెడుతున్నది. బాలుర, బాలికల ఐటీఐ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో కూడా అడ్మిషన్లు నిర్వహించడంలేదని అధికారులు చెప్పారు. అన్ని వసతులతో నిర్మించిన భవనాలను వినియోగించక పోవడంపై ముస్లిం వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల భవనాల నిర్మాణానికి రూ.3.92 కోట్లు వెచ్చించారు. అయితే కళాశాలలను ప్రారంభించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. భవనాలను ఇంకా ముస్లీం మైనార్టీ సంక్షేమ శాఖ స్వాధీనం చేసుకోలేదు. కళాశాలలను ప్రారంభించేందుకు మిషనరీ, ఉద్యోగులను నియమించాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఇంకా ప్రభుత్వం ప్రారంభించలేదు. వసతిగృహాల్లో ఒక్కో భవనాన్ని 100 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఇందుకోసం రూ.4.20 కోట్లు ఖర్చు చేశారు. వీటిని ప్రారంభించి మూడేళ్లు అయినా వినియోగించే ప్రయత్నం చేయడంలేదు. వసతి గృహాల నిర్వహణకు పది మంది ఉద్యోగులు అవసరం. అయితే ఈ నియమాకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నది. అయినా వసతి గృహాల నిర్వహణపై ఎటువంటి ఉత్తర్వులు లేవు. 100 మంది బాలురు, 100 మంది బాలికలకు ఇక్కడ వసతి కల్పించే అవకాశం ఉన్నా ఈ దిశగా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ఏడాది కూడా వసతి గృహాల్లో ప్రవేశాలను నిర్వహించే పరిస్థితులు కానరావడంలేదు.  


ప్రతిపాదనలు పంపాము..

ఐటీఐ కళాశాల, వసతి గృహాలకు అధ్యాపకులను, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతి పాదనలు పంపాము. ఈ విద్యా సంవత్సరంలో వసతి గృహాలలో అడ్మిషన్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాదికి ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్లు నిర్వహించే పరిస్థితి లేదు. 

- మహ్మద్‌ గని, ముస్లీం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి

Updated Date - 2022-06-28T05:17:51+05:30 IST