సంక్షేమంలో.. అర్ధాకలి

ABN , First Publish Date - 2021-11-17T05:30:00+05:30 IST

సంక్షేమ హాస్టల్స్‌లో గత ప్రభుత్వం ఏకరూప మెనూ అమల్లోకి తీసుకువచ్చింది.

సంక్షేమంలో.. అర్ధాకలి

హాస్టల్‌ మెనూకు ధరల సెగ

విద్యార్థులకు అందని పోషకాహారం 

నేటీకీ రెండేళ్ల క్రితం నాటి ధరలే చెల్లింపు

మెస్‌ చార్జీల పెంపుదల డిమాండ్‌పై నిర్లక్ష్యం


అన్నంలో గుడ్డు.. చికెన్‌.. ఉండదు. సాయంత్రం స్నాక్స్‌ లేదు. ఉదయం టిఫిన్లు లేవు. ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల చారు.. పప్పే దిక్కు.. వీటితో భోజనం చేయలేక.. అర్ధాకలితో సంక్షేమ విద్యార్థులు అల్లాడుతున్నారు. ఇంటికి, తల్లిదండ్రులకు దూరంగా వసతిగృహాల్లో ఉంటూ విద్యను కొనసాగిస్తున్న పిల్లల క్షుద్బాధ వర్ణనాతీతంగా ఉంది. మార్కెట్‌లో నిత్యావసరాలు ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయలు కొనేలా లేవు. గ్యాస్‌ సిలెండర్‌ ధర మండిపోతోంది. అయినా వసతిగృహాల్లోని విద్యార్థుల సంక్షేమం గురించి.. మెస్‌ చార్జీల పెంచాలన్న ఆలోచన అధికారులు చేయడంలేదు.. పాలకులకు పట్టడంలేదు. దీంతో సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడంలేదు. మెనూ అడగొద్దు.. పెట్టింది తినాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఎదురవుతుంది. జగనన్న దీవెన పథకం వల్ల వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ కారణంగా వార్డెన్లపై మెనూ అమలు భారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో పౌష్టికాహారం గురించి దెవుడెరుగు.. కడుపునిండా భోజనం పెడితే చాలన్నట్లుగా విద్యార్థులు ఉన్నారు. 


 (ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

సంక్షేమ హాస్టల్స్‌లో గత ప్రభుత్వం ఏకరూప మెనూ అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం అల్పాహారంగా ఆదివారం రెండు పూరీలు, ఇడ్లీ,  సోమవారం కిచిడీ, మంగళవారం పులిహోర, బుధవారం ఐదు ఇడ్లీలు, గురువారం ఉప్మా, శుక్రవారం పొంగలి, శనివారం ఇడ్లీలు అందజేయాలి. ఉదయం అల్పాహారం అనంతరం పాఠశాలకు వెళ్లే సమయంలో స్కూల్‌ విశ్రాంతి సమయంలో తీనేందుకు వీలుగా సెనగ ఉండలను ఇవ్వాలి. సాయంత్రం బఠాణీ లేదా సెనగలు ఇవ్వాలి. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం పాలు ఇవ్వాలి. ఆది, మంగళ, గురువారాల్లో కోడి మాంసంతో భోజనం ఇవ్వాలి. అయితే పెరిగిన ధరల కారణంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ అటకెక్కింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమలు చేసిన మెస్‌ చార్జీలే నేటికీ సంక్షేమ వసతిగృహాల్లో అమలవుతున్నాయి. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.40 ప్రభుత్వం కేటాయించింది. ధరలేమో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారం అందడంలేదు. ఫలితంగా సంక్షేమ హాస్టల్స్‌, గురుకుల విద్యార్థులు అర్ధాకలితో విలవిలాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సాంఘిక(42), గిరిజన(19 రెసిడెన్సీయల్‌ స్కూల్స్‌, 9 హాస్టల్స్‌), బీసీ(50పైగా హాస్టల్స్‌, 20పైగా కాలేజి హాస్టల్స్‌), దివ్యాంగుల(3) సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దాదాపు 35వేలమందికిపైగా విద్యార్థులు వసతి పొందుతూ విద్యాభాస్యం చేస్తున్నారు. వీటిల్లో రెండేళ్లుగా మెస్‌ చార్జీలు సవరించడం లేదు. ఫలితంగా మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. మెస్‌చార్జీల పెంపుకోసం ఎన్నిసార్లు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా పాలకులు ఆలకించడంలేదు. దీంతో  విద్యార్థులు అర్థాకలితో అల్లాడిపోతున్నారు. చాలా చోట్ల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తూ దాంతోనే రోజంతా వెళ్లదీస్తున్నారు. మార్చి నెల నుంచి డైట్‌ చార్జీలు రావడం లేదు. ఒకవైపు పెరుగుతున్న ధరలు మరోవైపు పెండింగ్‌లో బిల్లుల కారణంగా వార్డెన్లు మెనూ ప్రకారం వండిపెట్టే పరిస్థితి లేకుండాపోతుంది. దీంతో అందుబాటులో ఉన్న కూరగాయలతో నీళ్లచారే పప్పులాగా వండేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు కోడి గుడ్డుతో పాటు పౌష్టికాహారం కూడా అందించాలి. కాని పెరిగిన ధరల కారణంగా అవి సక్రమంగా అందచేయలేకపోతున్నారు. కొంత మంది విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్లతో భోజనం చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని ఉదయం, సాయంత్రం టిఫిన్లు, స్నాక్స్‌ తదితరాలను కొనుగోలు చేస్తున్నారు.


సంక్షేమ అధికారులు.. అప్పుల పాలు

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో రెండేళ్ల క్రితం అమలు చేసిన ధరలే ఇప్పుడు ఇస్తుంది. దీంతో వార్డెన్లు ఆర్థికభారంతో అప్పులపాలువుతున్నారు.  పాలు, పెరుగు, గుడ్లు, అరటిపండ్లు, కూరగాయలు, గ్యాస్‌, నిత్యావసరాలను వార్డెన్లే తెచ్చిపెట్టాలి. రెండేళ్ల క్రితం ధరలే ఇప్పటికీ అమలవుతుండటంతో పలువురు వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. రెండేళ్ల క్రితం రూ.450 ఉన్న గ్యాస్‌ ధర ఇప్పుడు రూ.1000కి చేరింది. ఇదే బాటలో గుడ్డు, నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఉండటంతో వార్డెన్లపై అదనపు భారం పడుతుంది. కొంతమంది జేబులో డబ్బులు పెట్టలేక ఉన్నదాంతోనే సరిపెడుతున్నారు. దీంతో విద్యార్థులు కడుపునిండా భోజనం అందడంలేదు. నెలకు రూ.లక్షకు పైగా అప్పులుతెచ్చి హాస్టల్‌ కొనసాగిస్తున్నామని, మూడు నెలలుగా బిల్లులు  ఇవ్వడంలేదని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాలతో పాటు వార్డెన్లు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.  

- తాడికొండలోని బీసీ విద్యార్ధినుల హాస్టళ్లలో నాలుగు రోజులు ఇవ్వాల్సిన గుడ్లను మూడు రోజులకు, మూడు రోజులు పెట్టాల్సిన చికెన్‌ను రెండు రోజులకు, నాలుగు రోజులు ఇవ్వాల్సిన ప్రూట్స్‌ మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఉదయం పూట టిఫిన్‌లో రెండు రోజులు ఇడ్లీ ఇవ్వాల్సి ఉండగా దానిని ఒక రోజుకు కుదించారు. చపాతిని పూర్తిగా నిలిపివేశారు.  

- బాపట్లలోని సంక్షేమ వసతి గృహాలలో మెనూ పాటించటంలేదు. ధరల పెరుగుదల, సకాలంలో బిల్లులు రాకపోవటం, వచ్చిన బిల్లులకు సరిపడ సరుకులు రాకపోవడంతో వార్డెన్లు ఇష్టానుసారంగా వండి పెడుతున్నారు. మెనూ అమలు కావడంలేదని సంజయ్‌గాంధీకాలనీలోని గిరిజన కళాశాల వసతిగృహ విద్యార్థులు తెలిపారు.

- తెనాలి కొత్తపేటలోని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)కు నాణ్యమైన  బియ్యం సరఫరా కాకపోవడంలేదు. దీంతో వండిన ఆహారం మెత్తగా మారి విద్యార్థులు ఇష్టంగా తినలేకపోతున్నారు. ధరల పెరుగుదలతో మెనూ అమలు చేయడం కష్టంగా ఉందని అయినా సొంత నిధుల నుంచే విద్యార్థులకు భోజనాలు అందిస్తున్నట్లు కొందరు వార్డెన్లు చెప్పారు.  


ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం

వసతి గృహాల్లో మెనూ విషయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అమలు చేస్తున్నాం.   నిర్దేశించిన ప్రకారం మెస్‌ చార్జీలు అమలు చేస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రస్తుతం మెస్‌చార్జీలు ప్రభుత్వం  పెంచలేదు. 

-  మధుసూదనరావు, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌  


అమలుకాని మెనూ 

హాస్టల్‌ మెస్‌ చార్జీలు 2018 తర్వాత పెంచలేదు. ప్రస్తుతం ఎక్కడా ప్రభుత్వ మెనూ అమలు కావడం లేదు. వార్డెన్లు ఇష్ట ప్రకారం మెనూ అమలు చేస్తున్నారు. చార్జీలు పెంచాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు.

 - మనోజ్‌కుమార్‌,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి



ప్రభుత్వ చెల్లించే ధర మార్కెట్‌ ధరలు(కిలో చొప్పున)

---------------------------------------------------------

పామాయిల్‌ రూ.78 రూ. 130

వేరుశనగలు రూ.100 రూ. 134

మినపప్పు రూ. 80 రూ.110

చింతపండురూ. 140 రూ. 190

చికెన్‌ రూ. 180 రూ. 240

కోడిగుడ్డు రూ.4 రూ.5

------------------------------------------------------

తరగతుల వారీగా మెస్‌చార్జీలు.....


తరగతి మెస్‌ చార్జీ(నెలకు)

------------------------------------------------------------

3 నుంచి 4 రూ. 1000

5 నుంచి 7 రూ.1250

8 నుంచి 10 రూ.1250

ఇంటర్‌ నుంచి పీజీ రూ.1400

 

Updated Date - 2021-11-17T05:30:00+05:30 IST