హాస్టళ్లకు ధరాఘాతం

ABN , First Publish Date - 2021-12-08T06:18:34+05:30 IST

పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచకపోవడంతో వసతి గృహాల్లో మెనూ అమలు చేయడం చాలా కష్టంగా వున్నదని వార్డెన్లు వాపోతున్నారు.

హాస్టళ్లకు ధరాఘాతం

మూడేళ్ల కిందట నిర్ణయించిన డైట్‌ చార్జీలే ఇప్పటికీ చెల్లింపు

తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ.1,000 నుంచి రూ.1,400 వరకు మంజూరు

పెరిగిన ధరలతో మెనూ అమలు కష్టంగా ఉందంటున్న వసతి గృహాల వార్డెన్లు

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యం

అనధికారికంగా అనేకచోట్ల మెనూలో కోత

ప్రస్తుత రేట్ల ప్రకారం సవరించాలని డిమాండ్‌

జిల్లాలో బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలో 139 హాస్టళ్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్‌ చార్జీలను ప్రభుత్వం పెంచకపోవడంతో వసతి గృహాల్లో మెనూ అమలు చేయడం చాలా కష్టంగా వున్నదని వార్డెన్లు వాపోతున్నారు. ముఖ్యంగా కొద్దినెలలుగా నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 2018లో అప్పటి ధరల ప్రకారం ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు డైట్‌ చార్జీలను నిర్ణయించింది. ప్రీ మెట్రిక్‌లో ఐదో తరగతిలోపు విద్యార్థులకు నెలకు రూ.1,000, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు రూ.1,250, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు రూ.1,400 చొప్పున చెల్లిస్తోంది. ఈ మొత్తంతో వసతి గృహాల్లో వుండే విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం రాగి మాల్ట్‌ ఇవ్వాలి. అయితే కొద్దినెలలుగా నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరగడంతో మెనూ అమలు చేయలేక వార్డెన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. 


రెండు రెట్లు పెరిగిన ధరలు

2018తో పోలిస్తే నిత్యావసర సరకుల రెట్టింపు అయ్యాయి. అప్పట్లో గుడ్డు హోల్‌సేల్‌లో రూ.3.75 పైసలకు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం రూ.5.30 పైసలు పెట్టాల్సి వస్తుందంటున్నారు. అదేవిధంగా చికెన్‌ ధర కిలో నాడు రూ.140 ఉంటే, ప్రస్తుతం రూ.200, ఆయిల్‌ అప్పుడు రూ.70 ఉంటే, ప్రస్తుతం రూ.145కు కొనుగోలు చేస్తున్నారు. అలాగే, గ్యాస్‌ ధర నాడు రూ.450 ఉంటే, ప్రస్తుతం రూ.900కు కొనుగోలు చేస్తున్నారు. అరటిపండు ఒక్కొక్కటి రూ.3 నుంచి రూ.4కు కొనుగోలు చేయాల్సి వస్తోందంటున్నారు. వీటితోపాటు ఉప్పు, పప్పు, మసాలా, కూరగాయల ధరలు భారీగానే పెరిగినట్టు పేర్కొంటున్నారు. 


మెనూ అమలు కష్టం

ప్రస్తుతం వసతి గృహాల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలి. టిఫిన్‌ కింద ఒక రోజు పూరీ, రెండు రోజులు ఇడ్లీ, మిగిలిన రోజుల్లో పులిహోర, ఉప్మా పెడతారు. భోజనంలో వారంలో నాలుగుసార్లు గుడ్డు, నాలుగుసార్లు అరటిపండు, మూడు రోజులు చికెన్‌ పెట్టాలి. రసం, పప్పు పెట్టాల్సి ఉంటుంది. అయితే, పెరిగిన ధరల వల్ల ఈ మెనూ అమలు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. కొన్నిచోట్ల అనధికారికంగా మెనూలో కోతలు విధిస్తున్నారు. రేట్లు పెంచడమో, ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెనూలో మార్పులు చేయడమో చేయాలని వార్డెన్లు కోరుతున్నారు. 


ఇదీ లెక్క

జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల 32 ప్రి మెట్రిక్‌ హాస్టళ్లలో 2,413 మంది, 23 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో 1,420 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో గల 54 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో 3,540 మంది, 30 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో  1,910 మంది విద్యార్థులు ఉంటున్నారు.  

Updated Date - 2021-12-08T06:18:34+05:30 IST