చలికి.. గజగజ!

ABN , First Publish Date - 2021-11-12T05:33:41+05:30 IST

బడుగు, బలహీన పేద వర్గాలకు విద్యావకాశాలు కల్పించే లక్షంగా ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి.

చలికి.. గజగజ!
వినుకొండ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దుప్పట్లు లేకుండా పడుకున్న విద్యార్థులు

 పెరుగుతున్న చలి తీవ్రత

హాస్టళ్లలోని విద్యార్థులకు దుప్పట్లూ కరువే

గతంలో ఇచ్చిన దుప్పట్లతో సరి

వసతి గృహాల్లో రెక్కలు లేని కిటికీలు

మిగిలిన మౌలిక వసతులు అంతంతమాత్రమే 

పలు హాస్టళ్లు అద్దె భవనాల్లోనే..


రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజామున మంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నా ఇన్నీ కావు. గదుల తలుపులు సరిగా లేక, కిటికీలకు రెక్కలు లేక చలి నేరుగా గదిలోకి వస్తుండడంతో చలికి వణికిపోతున్నారు. ఈ ఏడాది దుప్పట్లు కూడా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు దోమలు విజృంభిస్తున్నాయి. 

   

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు11: బడుగు, బలహీన పేద వర్గాలకు విద్యావకాశాలు కల్పించే లక్షంగా ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. కొవిడ్‌ కారణంగా గత కొంతకాలంగా మూతపడిన వసతి గృహాలు చాలావరకు వాడుకలో లేక మరమ్మత్తులకు గురవుతున్నాయి. కొన్ని వసతి గృహాల్లో గదులకు తలుపులు లేవు. తలుపులున్న చోట కిటికీలు లేవు. కిటికీలకు రెక్కలు లేవు. ఓ వైపు దోమలు. మరో వైపు చలితో  వణికిపోయే పరిస్థితి తప్పడం లేదు. జిల్లాలోని పలు హాస్టళ్లను ఆంధ్రజ్యోతి బుధవారం రాత్రి సందర్శించింది. ఆ సమయంలో పలు సమస్యలు వెలుగు చూశాయి. 

 తెనాలి నియోజకవర్గంలో  15 వరకు ఎస్టీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1000మందికి ఉండేవారు. కరోనా తర్వాత హాస్టళ్లు తెరుచుకోగా సగం మందే వచ్చారు. తెనాలి ఎస్సీ బాలికల వసతి గృహంలో బాత్‌రూంకు తలుపులు లేవు. చాలా చోట్ల కిటికీలు పాడైపోయాయి. కొన్ని శ్లాబ్‌లు పెచ్చులూడిపోయాయి. ఎస్టీ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీసం దుప్పట్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం 75మంది విద్యార్థుల వరకు ఉంటే వారికి సరిపోను గదులు లేవు. దీంతో తరగతి గదుల్లోనే వసతి కూడా ఏర్పాటు చేశారు. కిటికీలు లేవు, తలుపులేవు.. సరికదా దోమ తెరలన్నా ఇస్తున్నారంటే అదీ లేదు.  

 చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఎదురుగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రస్తుతం 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. 150మంది ఉండాల్సిన ఈ రేకుల షెడ్‌ భవనంలో ప్రస్తుతం 350మంది ఉంటూ చదువుకుంటున్నారు. రెండువైపులా కంపచెట్లు ఉండటంతో దోమల బెడద తప్పడంలేదు. అందరూ హాలులో, తరగతి గదుల్లో చలికి వణుకుతూ.. ఇరుక్కుని పడుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇక యడ్లపాడు మండలానికి చెందిన సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల పట్టణంలోని అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ కూడా సౌకర్యాల కొరత ఉంది.

తాడికొండలోని ఏపీఆర్‌ఎస్‌, బాలయోగి గురుకుల పాఠశాల, బీసీ విద్యార్థినుల హాస్టళ్లలో చదువుకునేవారికి ఈ సంవత్సరం ఒక్క దుప్పటిని కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. దీంతో విద్యార్థులు తమ సొంత ఖర్చుతో దుప్పట్లు కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నారు. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 500 మంది ఉన్నారు. ఇందులో 300 మంది నూతనంగా నిర్మించిన డార్మిటరిలో ఉంటున్నారు. డార్మిటరిలో విద్యార్థులు ఉపయోగించుకోవాటానికి 40 బాత్రూమ్స్‌ నిర్మించారు. ట్యాపులు లేకపోవటంతో వాటిని ఉపయోగించకుండా బాత్రూమ్స్‌కు తాళలు వేశారు. ప్రస్తుతం 10వ తరగతిలో ఉన్న విద్యార్థులకు 7వ తరగతిలో ఉన్నప్పుడు దుప్పట్లు ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.  బీసీ విదార్థినుల హాస్టల్స్‌ కూడా దుప్పట్లు, కిందవేసుకునే కార్పెట్స్‌ను పంపిణీ చేయలేదు.  

 వినుకొండ పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికల వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 1,200మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా వసతి గృహాల్లో మరమ్మతులు చేయించారే తప్ప విద్యార్థులకు రాత్రిపూట అవసరమైన దుప్పట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో  చలికి ఇబ్బందులు పడుతున్నారు. పేస్టులు, ప్లేట్లు, సబ్బులు, తదితర కాస్మోటిక్స్‌ కూడా అందని ద్రాక్షాలా మిగిలాయి. దీంతో  తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో వార్డెన్‌ లేక ఆరు నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడులేడు. ఈపూరు మండలం ఎస్సీ హాస్టల్‌లో దుప్పట్లు, కాస్మోటిక్స్‌ ఇవ్వలేదని విద్యార్థులు చెబుతున్నారు. నూజెండ్ల మండలంలో బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సరిపడ గదులు లేవు, ప్రహరీ గోడ లేకపోవడంతో హాస్టల్‌ ఆవరణలోకి పశువులు రావడంతో విద్యార్థులు రక్షణ లేక అవస్థలు పడుతున్నారు. ఏపీ మోడల్‌ పాఠశాల హాస్టల్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది.  

బాపట్ల పట్టణంలోని వసతి గృహాల్లో  నేటి వరకు కప్పుకోవటానికి దుప్పట్లు ఇవ్వలేదు. వసతి గృహాల చుట్టూ వ్యర్ధాలు పేరుకుపోయి దోమల వ్యాప్తి అధికమై విద్యార్థులు రాత్రిపూట కంటిమీద కునుకు వేయటంలేదు. బాపట్ల పట్టణం సంజయ్‌గాంధీకాలనీలో గిరిజన కళాశాల బాలుర వసతి గృహం కిటికీలకు మెష్‌లు లేవు.  ఇక్కడ ఇన్‌చార్జ్‌ వార్డెన్‌ పనిచేస్తున్నారు. ఆయన ఒక్కరోజు కూడా ఇక్కడ నిద్ర చేసిన దాఖలాలులేవు. బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందలేదు.  

 వేమూరులోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్స్‌లో కరోనా భయంతో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక్కడ గతంలో 80 మంది విద్యార్థులుండేవారు. ఇప్పుడా సంఖ్య 20కి తగ్గింది. ఇక్కడ అన్ని వసతులు సమకూర్చారు.  


సత్తెనపల్లి పట్టణంలోని హాస్టళ్లలో ఇంతవరకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. ఎస్టీ బాలుర వసతి గృహం అద్దెభవనంలోనే కొనసాగుతోంది. వార్డెన్‌ కిటికీలకు దుప్పట్లు, రేకులు కొట్టించారు.  ఎస్టీ బాలుర వసతిగృహానికి పూర్తికాలపు వార్డెన్‌ లేరు. తెనాలివార్డెన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన స్థానికంగా నివాసముండరు.  బీసీ బాలుర వసతిగృహానికి అదేపరిస్థితి 

 రెంటచింతల మండలంలో బీసీ, ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయి. రెండేళ్లుగా వీరికి దుప్పట్లు, కాస్మోటిక్స్‌ వంటివి పంపిణీ చేయలేదు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు వసతి గృహంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దుప్పట్లు, ప్లేట్లు, కాస్మోటిక్స్‌ అందించలేదు. కారంపూడిలోని బాలయోగి గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. వసతి గృహాల్లో కిటికీలు ఊడిపోయాయి. చలికాలం కావడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. 

పిడుగురాళ్లలో ఉన్న బీసీ బాలుర వసతిగృహంలో సుమారు 30 మంది లోపు విద్యార్థులున్నారు. గిరిజన బాలుర వసతిగృహంలోనూ 165 మందికి పైగా విద్యార్థులున్నారు. వారందరూ ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న దుప్పట్లు రగ్గులు కప్పుకొని చలి నుంచి కాపాడుకుంటున్నారు. మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న ఐదు వసతి గృహాల్లో ఈ ఏడాది ఒక ్క విద్యార్థి కూడా చేరిక జరగలేదు. గురజాలలో ఉన్న ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలలో 70 మందిలోపు పిల్లలున్నప్పటికీ వారికి కూడా దుప్పట్లు అందనే లేదు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో ఉన్న వసతిగృహాలకు సొంత భవనాలు ఉండగా కొన్నింటికి నాడు-నేడు పథకం ద్వారా రంగులు వేసి కొన్ని మౌలిక వసతులు సమకూర్చారు. 

 పొన్నూరులో బీసీ సంక్షేమశాఖ వసతి గృహ భవనం శిఽఽథిలావస్ధకు చేరుకుంది. మున్సిపల్‌ వాటర్‌ కుళాయి సౌకర్యంలేక పోవటంతో విద్యార్ధులు బోరువాటర్‌ తాగాల్సివస్తుంది. విద్యార్ధులకు గత ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు కాస్మోస్టిక్‌ చార్జీలు రాలేదు. 

Updated Date - 2021-11-12T05:33:41+05:30 IST