
- ప్రభుత్వ రవాణా శాఖ విధి విధానాల జారీ
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో నిర్ణీత హోటళ్ల వద్ద ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వ రవాణా శాఖ విధి విధానాలు జారీచేసింది. నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని ప్రయాణికులకు అందజేయాలని, ఆహార పదార్ధాల ధరల పట్టిక అందరికీ తెలిసే విధంగా ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. హోటళ్ల ప్రవేశద్వారం వద్ద ప్రయాణికుల అభిప్రాయాలు తెలిపేందుకు అనువుగా ఫిర్యాదు పెట్టె ఉంచాలని, ప్రయాణికుల సంక్షేమార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రయాణికుల లగేజీకి భద్రత కల్పించాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని తేల్చి చెప్పింది. ఆహార పదార్ధాలకు కంప్యూటర్ బిల్లు వసూలుచేయాలని నిర్ణీత హోటళ్లకు ఉత్తర్వులు జారీచేసింది. శాఖాహార వంటకాలతో పాటు టీ, కాఫీ, వడ, బజ్జీ, బిస్కెట్లు తదితరాలు విక్రయించుకొనేందుకు ఆ హోటళ్ల యాజమాన్యాలకు ఒక సంవత్సరం లైసెన్స్ మంజూరుకు టెండర్లను రవాణా శాఖ ఆహ్వానించింది. ఈ ఆహార టెండర్లలో గతంలో పెట్టిన ‘శాకాహార’ నిబంధన తీసివేసి అన్ని హోటళ్ల వద్ద బస్సులు ఆపేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి