ఆధార్‌లో ఫొటో మార్చి ఇల్లు రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2020-11-29T05:42:24+05:30 IST

ఆధార్‌కార్డులో ఫొటో మార్పుతో అక్రమంగా ఓ ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆధార్‌లో ఫొటో మార్చి ఇల్లు రిజిస్ట్రేషన్‌

సూర్యాపేట క్రైం, నవంబరు 28 : ఆధార్‌కార్డులో ఫొటో మార్పుతో అక్రమంగా ఓ ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట పట్టణం అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన చిలుకల కృష్ణమూర్తి ఇంటి పన్ను చెల్లించేందుకు మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అప్పటికే రికార్డుల్లో తన ఇళ్లు అదే కాలనీకి చెందిన షేక్‌ ఖాజాబీ పేరు మీదకు మారిందని సిబ్బంది తెలిపారు. కృష్ణమూర్తి రిజిస్ట్రేషన్‌ చేయించడంతో పేరు ఇంటి యాజమాని పేరు మార్చినట్లు వారు తెలిపారు. ఆందోళనకు గురైన కృష్ణమూర్తి ఘటపై పోలీసులకు ఈ నెల 10వ తేదీన ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. కృష్ణమూర్తి ఇంటిని కాజేయాలనే ఉద్దేశ్యంతో అదే కాలనీకి చెందిన షేక్‌ ఖాజాబీ సూర్యాపేట పట్టణానికి చెందిన యలగందుల కరుణాకర్‌ అనే వ్యక్తికి రూ.40 వేలు ఇచ్చి పధకం పన్నింది. ఈ మేరకు కందగట్ల గ్రామానికి చెందిన బొల్లె శ్రీధర్‌ అనే వ్యక్తిని చిలుకల కృష్ణమూర్తిగా చూపించేందుకు మీసేవ ఆఫీసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కోదాడ పట్టణానికి చెందిన బండ్ల రాజేష్‌ సహకారంతో ఆధార్‌ కార్డులో ఫొటో మార్పు చేసింది. ఆ కార్డు ఆధారంగా రూపొందించిన పత్రాలతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. దీంతో నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ ఆంజనేయులు తెలిపారు. కేసు దర్యాప్తులో పట్టణ ఎస్‌ఐ ఏడుకొండలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2020-11-29T05:42:24+05:30 IST