ఇంటిపాట్లు!

ABN , First Publish Date - 2022-05-22T06:27:59+05:30 IST

తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది జగనన్న లే-అవుట్లలోని లబ్ధిదారుల పట్ల ప్రభుత్వ తీరు.

ఇంటిపాట్లు!

జగనన్న లే అవుట్లలో అరకొర డబ్బుతో గృహ నిర్మాణానికి అవస్థలు

 అప్పు తెచ్చి గూడు నిర్మించుకున్నా కాలనీలో మౌలిక సదుపాయాల కరువు

 కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేని దైన్యం

 ఇల్లు కట్టుకోకుంటే రద్దు చేస్తామని అధికారుల హెచ్చరికలు

 ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా లబ్ధిదారుల పరిస్థితి!

   తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది జగనన్న లే-అవుట్లలోని లబ్ధిదారుల పట్ల ప్రభుత్వ తీరు. స్థలాలిచ్చి కనీస సదుపాయాలు కల్పించకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇంటి నిర్మాణానికి ఇచ్చే డబ్బులు  బేస్‌మెంట్‌కు కూడా సరిపోవనే బాధ, వడ్డీకి తెచ్చి నిర్మాణం చేపట్టినా కాలనీలో నివసించేందుకు కనీస సౌకర్యాలు కూడా లేవనే వేదన, ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే రద్దు చేస్తామని అధికారుల బెదిరింపులు... వీటన్నింటి నడుమ లబ్ధిదారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుంది. తాగునీరు, విద్యుత్‌, అంతర్గత రోడ్లు.. ఏవీ లేకుండా ఎలా ఉండాలని కంచికచర్ల జగనన్న కాలనీ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  

కంచికచర్ల, మే 21 : కంచికచర్లలో జుజ్జూరు వెళ్లే రోడ్డులో నాగేంద్ర స్వామి పుట్ట వెనుకవైపు ప్రభుత్వం మూడు లేఅవుట్‌లు వేసింది. ఒకటి, రెండు లేఅవుట్‌లలో కంచికచర్లకు చెందిన 954 మందికి నివేశన స్థలాలు ఇచ్చారు. మూడో లేఅవుట్‌లో మండలంలోని కొత్తపేట, గనిఆత్కూరు గ్రామాల లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారు. వీటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రెండు లేఅవుట్‌లలో కలిపి 832 పక్కాగృహాలు మంజూరు చేశారు. లేఅవుట్లలో తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, లేనిపక్షంలో ఇళ్ల స్థలాల పట్టాలు రద్దు చేస్తామని పాలకులు, అధికారులు ఒకటికి నాలుగు సార్లు లబ్ధిదారులను బెదిరించారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఏ మూలకూ చాలవు. అయితే స్థలాలు  తీసేసుకుంటారనే భయంతో అందిన కాడల్లా అప్పులు చేసి, సగం మందికిపైగా లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపట్టారు. సిమెంట్‌, ఇనుము ధరలు బాగా పెరిగాయి. ట్రాక్టరు ఇసుక రూ.4వేలు. నిర్మాణానికి నీళ్లు కొనాల్సి వస్తోంది. ఇప్పటికి మూడు గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 20 ఇళ్ల  శ్లాబులు  పూర్తయ్యాయి. మిగతా గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన గురించి పాలకులు, అధికారులు  మర్చిపోయారు. 

తాగునీటి సదుపాయం లేదు 

కాలనీకి పాలకులు శంకుస్థాపన చేసి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. కాలనీలో ఐదు బోర్లు వేసి చేతులు దులుపుకున్నారు. బోర్ల నీరు తాగటానికి వాడకానికి కూడా పనికిరాదు. ఫ్లోరైడ్‌ అధికశాతం ఉంది. నీరు కటిక ఉప్పుగా ఉంటుంది. అక్కడక్కడా కుళాయిలు ఏర్పాటు చేసి, అడపాదడపా అందిస్తున్న ఈ ఉప్పు నీళ్లు వృథాగా పోవటం తప్ప దేనికి ఉపయోగపడటం లేదు. పదికాలాలు ఉండాల్సిన పక్కాగృహల నిర్మాణానికి ఉప్పు నీరు వాడితే కొద్దికాలానికే దెబ్బతింటాయి. అందుకే ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు పీపాలతో మంచినీళ్లు కొంటున్నారు. 

విద్యుత్‌ లేక రాత్రుళ్లు అంధకారమే

కాలనీకి విద్యుత్‌ సదుపాయం లేదు. బోర్ల మోటార్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా స్తంభాలు వేసి కనెక్షన్లు ఇచ్చారు తప్ప మిగతా చోట్ల విద్యుత్‌ లేదు. అంతర్గత రోడ్ల వెంబడి స్తంభాలు కూడా లేవు. దీనివల్ల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండాపోయింది.   వీధి దీపాలకు సదుపాయం లేదు. రాత్రిళ్లు ఇక అంధకారమే. చుట్టూ పంట పొలాలు కావటంతో విష పురుగుల సంచారం ఎక్కువగా ఉండటంతో రాత్రిళ్లు కాలనీలోని ఇళ్లలో ఉండాలంటేనే లబ్ధిదారులు భయపడుతున్నారు. విద్యుత్‌ కల్పనకు సంబంధించి ఇటీవల టెండరు ఖరారైందన్నట్టుగా చెపుతున్నారు. అవి ఆచరణలోకి వచ్చేదెప్పుడు? అవి పూర్తి అయ్యేదెప్పుడు? అప్పటిదాకా లబ్ధిదారులు ఏం చేయాలి? అంటే అధికారుల నుంచి సమాధానం లేదు. 

అరకొరగా అంతర్గత రోడ్లు 

అంతర్గత రోడ్లు సరిగ్గా లేవు. మొదట్లో ఉపాధి హామీ పథకం ద్వారా అంతర్గత రోడ్ల పనులు మమ అనిపించారు. ఇప్పుడు అవీ అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లపై పాదచారులు నడవడం కూడా కష్టమే. ఇటు ద్విచక్రవాహనాల రాకపోకలు అసాధ్యం. గుంతలు పడటం వల్ల వర్షపు నీళ్లు నిలబడే పరిస్థితి. సిమెంట్‌ రోడ్లు వేసేందుకు యోచిస్తున్నామంటూ అధికారులు సెలవిస్తున్నారు. వర్షాలు ప్రారంభమైతే నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. 

ప్రధాన రోడ్డును వదిలేశారు!

నాగేంద్ర స్వామి పుట్ట వెనుక వైపు ఉన్న ఈ కాలనీకి వెళ్లేందుకు దగ్గరి మార్గం లేదు. జుజ్జూరు రోడ్డులో రెండు కిలోమీటర్ల తర్వాత పేరకలపాడు వెళ్లే డొంక రోడ్డులో నుంచి ఈ కాలనీకి వెళ్లాల్సి ఉంది. మొత్తం 3.5 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 1.5 కిలోమీటర్లు మట్టి రోడ్డు. ప్రధానమైన ఈ రోడ్డును ఇప్పటి వరకు బాగు చేయలేదు. ఇప్పటిదాకా లబ్ధిదారులు మేటీరియల్‌ను పొలాల మీదుగా తీసుకు వెళ్లారు. వ్యవసాయ పనులు ప్రారంభించినందున రాకపోకలకు రైతులు అంగీకరించటం లేదు. వానాకాలంలో కాలనీకి వెళ్లేందుకు దారితెన్నూ లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇన్ని సమస్యల నడుమ ఇళ్ల నిర్మాణం చేపట్టి, గృహ ప్రవేశాలు చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2022-05-22T06:27:59+05:30 IST