Advertisement

72,519 మందికి ఇళ్ల పట్టాలు

Nov 29 2020 @ 00:58AM
చోడవరం మండలం జెన్నవరంలోని లేఅవుట్‌

గ్రామీణ ప్రాంతంలో 68,783 

ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీల్లో 3,736 

32 లేఅవుట్లు సిద్ధం

వచ్చే నెల 25న పంపిణీ

టిడ్కో ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందజేత

విశాఖ నగరంలో పంపిణీకి బ్రేక్‌

భూ సమీకరణపై వివాదం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో 68,783 మందికి, ఎలమంచిలి, నర్సీపట్నం మునిసి పాలిటీల్లో 3,736 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం సుమారు 1,600 ఎకరాలు సేకరించారు. దీంట్లో 1,370 ఎకరాలు ప్రభుత్వ, 168 ఎకరాలు అసైన్డ్‌ భూమి కాగా...మరో 50 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. మొత్తం 832 చోట్ల లేఅవుట్లు వేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ సెంటున్నర ప్లాటు ఇస్తారు. కాగా ప్రస్తుతానికి లబ్ధిదారులకు డీ ఫారం పట్టాలు పంపిణీ చేస్తారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక కన్వేయెన్స్‌ డీడ్స్‌ ఇస్తారు. వీరితోపాటు చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం వుంటున్న 16,954 మందికి ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్లు (ఎల్‌పీసీ) అందజేస్తారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ద్వారా నిర్మించిన 26,448 ఇళ్లను ఎంపికచేసిన లబ్ధిదారులకు అందజేస్తారు. జీవీఎంసీ పరిధిలో 24,192, ఎలమంచిలిలో 432, నర్సీపట్నంలో 1824 ఇళ్లు ఉన్నాయి. 


నగరంలో లేనట్టే?

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 1,77,960 మంది పేదలకు 50 గజాల వంతున పంపిణీ చేసేందుకు 6,116.5 ఎక రాలు సమీకరించాలని అధికారులు భావించారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్‌, గాజువాక, పెందుర్తి, పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం మండలాల్లో సుమారు 4,200 ఎకరాలను గుర్తించారు. అయితే వాటిలో అత్యధిక శాతం పేదలు దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న భూములే ఉన్నాయి. జీవనాధారం పోతుందని చెప్పినా వినకుండా అనేక మండలాల్లో అఽధికారులు బలవంతంగా భూ సమీకరణ చేశారు. దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తంకావడం, పోలీసు కేసులు కూడా నమోదుకావడంతో సీపీఎం నాయకులు లోకనాథం హైకోర్టులో కేసు వేశారు. అధికారులు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, పరిహారంలో కూడా వివక్ష చూపిస్తూ, ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా ఇస్తున్నారని కోర్టుకు వివరించారు. ముఖ్యంగా భూ సమీకరణ చట్టం 2013ను అమలు చేయలేదని పేర్కొన్నారు. దాంతో కోర్టు స్టే ఇచ్చింది. 


ప్రతి అర్హుడికీ పట్టా

- ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌

జిల్లాలో అర్హులైన పేదలకు పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా అందుబాటులో ఉంచాం. అభ్యంతరాలుంటే ఫిర్యా దు చేయవచ్చు. మండలాల్లో పట్టా ల పంపిణీకి సంబంధించి మరో సారి తనిఖీ చేయాలని ఆర్డీవోలను ఆదేశించాం. మార్చిలో జాబితాలు సిద్ధంచేసిన తరువాత దరఖాస్తు చేసుకున్న వారికి కూడా డీపట్టాలు అందజేస్తాం. కాగా ఇప్పటికే సిద్ధంచేసిన లేఅవుట్‌లలో రహదారులు ఎక్కడైనా ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింటే సరిచేస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో పట్టాల పంపిణీపై హైకోర్టులో వ్యాజ్యం వున్నందున ప్రస్తుతానికి నిలిపివేశాం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.