కొవిడ్‌పై ఇంటింటి సర్వే పూర్తి

ABN , First Publish Date - 2021-05-09T05:16:39+05:30 IST

కొవిడ్‌పై ఇంటింటి సర్వే పూర్తి

కొవిడ్‌పై ఇంటింటి సర్వే పూర్తి
పరిగిలోని టీచర్స్‌ కాలనీలో ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బంది

  • వికారాబాద్‌ జిల్లాలో 15వేలకుపైగా బాధితులు..!
  • కరోనా చికిత్సకు వైద్యశాఖ చర్యలు

పరిగి: ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చేసిన క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయింది. వికారాబాద్‌ జిల్లాలో గత మూడు రోజులుగా చేసిన సర్వే నివేదికను జిల్లా అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. జిల్లాలో కరోనాపై చేసిన సర్వేలో భాగంగా ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, తీవ్ర తలనొప్పి, ఒళ్ళునొప్పులు, కళ్లు ఎర్రబడి భయపడుతున్నారా? పాజిటివ్‌ వస్తుందేమెననే భయంతో పరీక్షలు చేయించుకోకుండా బయట తిరుగుతున్నారా? ఇక మీరు చితపడనక్కర్లేదనే భరోసాతో వివరాలు సేకరించారు. జిల్లాలో 566 గ్రామ పంచాయితీలలో 1.80 లక్షల కుటుంబాలు, 4 మునిసిపాలిటీల పరిధిలో 40 వేల కుటుంబాలు కలిపి మొత్తం జిల్లాలో 2.20 లక్షల కుటుంబాలను గత మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో కూడిన బృందం సర్వే చేపట్టింది. జిల్లా మొత్తంలో కొవిడ్‌ లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు, తదితర లక్షణాలున్న వ్యక్తులు 12 వేల నుంచి 15 వేల వరకు ఉండవచ్చని సర్వేలో తేల్చారు. జిల్లాలోని పంచాయతీ, మునిసిపల్‌ పరిధిలో గత మూడు రోజులుగా సర్వే నిర్వహించారు. పాజిటివ్‌ ఉన్న కుటుంబాలు, వ్యక్తులకు వైద్యశాఖ అధికారులు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైద్యసిబ్బంది స్వయంగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి కిట్లను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

  • మూడో రోజు 7,898 ఇళ్లలో జ్వర సర్వే

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎల్పీవో స్మిత అన్నారు. మండలంలోని కాచవానిసింగారం మహేశ్వరీ కాలనీలో నిర్వహించిన సర్వేలో ఆమె పాల్గొన్నారు. కాగా గత మూడు రోజుల్లో 7,998 ఇళ్లలో సర్వే నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇందులో 154మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించామని తెలిపారు. జ్వరం, జలుబు ఉన్నవారికి మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి, అశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • ఘట్‌కేసర్‌లో జ్వర సర్వే విజయవంతం

ఘట్‌కేసర్‌ : కరోనా లక్షణాలను గుర్తించడానికి నిర్వహిస్తున్న జ్వర సర్వే శనివారం విజయవంతంగా కొనసాగింది. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో 1,505 ఇళ్లను సర్వే చేయడంతోపాటు 21మందికి కరోనా లక్షణాలు బయటపడినట్లు కమిషనర్‌ వసంత తెలిపారు. లక్షణాలున్న వారికి మందులు అందజేసి జాగ్రత్తలు పాటించాలని ఆశ వర్కర్లు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పోచారం మున్సిపాలిటీతోపాటు చౌదరిగూడ పంచాయతీలో సర్వేను వేగంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • పాత్రికేయుల సంక్షేమానికి కృషి

శామీర్‌పేట : కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పాత్రికేయుల సంక్షేమానికి సాయంగా టీఆర్‌ఎస్‌ శామీర్‌పేట మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళ జగదీశ్‌గౌడ్‌ శానిటైజర్లు, విటమిన్‌ ట్యాబ్లెట్లు, మాస్కులు అందజేశారు. శామీర్‌పేటలోని ప్రింట్‌ మీడియా ప్రతినిధులకు తన సొంత ఖర్చులతో వాటిని అందజేశారు.

  • కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

శామీర్‌పేట : సూరారంలోని మంత్రి మల్లారెడ్డి కాలేజీలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర ఆధ్యక్షుడు బాలమూర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. కాగా ఈ ధర్నా కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క విచ్చేసి మద్దతు తెలిపారు. ఆ సమయంలో దేవరయాంజాల్‌ మాజీ ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎమ్మెల్యే సీతక్కను కలిసి ధర్నాకు మద్దతు తెలిపారు. కాగా ఆ సమయంలో ధర్నా నిర్వహిస్తున్న వారిని దుండిగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

  • ఈనెల 10 నుంచి ఘట్‌కేసర్‌లో లాక్‌డౌన్‌

ఘట్‌కేసర్‌ : మున్సిపాలిటీ పరిధిలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులను కట్టడి చేసేందుకు ఈనెల 10నుంచి 23వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు లాక్‌డౌన్‌  కొనసాగుతుందని అన్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. కాగా మెడికల్‌ షాపులు, ఆసుపత్రులు తెరిచి ఉంటాయని, దుకాణ సముదాయాలు, ఇతర అన్నిరకాల షాపులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబును కలిసి రోజూ ఒంటిగంట నుంచే పెట్రోలింగ్‌ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరినట్టు చైర్‌పర్సన్‌ ముల్లి పావని, వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌లోని చర్చీలలో జరిగే ప్రార్ధనలను సైతం నిలిపివేస్తున్నట్లు ఈ సందర్భంగా చర్చీల అసోసియేషన్‌ నిర్వహకులు తెలిపారు.

  • భయం గుప్పిట్లో గ్రామాలు

ఘట్‌కేసర్‌ రూరల్‌/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల : కరోనా సెకెండ్‌వేవ్‌ తీవ్రంగా ఉండటంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాగా ప్రజలు, ఉద్యోగస్తులు వివిధ పనుల నిమిత్తం నిత్యం నగరానికి వెళ్లి వస్తుండటంతో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించని వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గ్రామాల్లో చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా ప్రజలు భయపడుతున్నారు. కరోనాపై సరైన అవగాహన లేకపోవడంతో సతమతవుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలంటే కరోనా ఫలితం ఎలా వస్తుందోనని జంకుతున్నారు. సెకండ్‌వేవ్‌ తగ్గేవరకు అత్యవసర పని ఉంటే తప్ప బయటకు వెళ్లొదని, స్వీయ నియంత్రణే  శ్రీరామరక్ష  అని వైద్యులు సూచిస్తున్నారు. కాగా శనివారం అవుషాపూర్‌లో సర్పంచ్‌ ఏనుగు కావేరిమశ్చేందర్‌రెడ్డి రసాయనాలను పిచికారి చేయించారు. కరోనా ఉదృతి దృష్ట్యా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో శనివారం మధ్యాహ్నం 3 గంటలనుండి అన్ని వ్యాపార సంస్థలు మూసివేసి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించారు. ఇది ఈనెల 20 వరకు కొనసాగనుంది. కాగా ఆసుపత్రులు, మెడికల్‌ షాపుల్లాంటి అత్యవసర సర్వీసులను ఈ లాక్‌డౌన్‌ నుండి మినహాయించారు. వ్యాపారాలు నడిచే సమయంలో ఎవరుకూడా మాస్కులు లేకుండా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడకూడా నలుగురైదుగురు ఒకే ద్గగర గుమిగూడకుండా భౌతికదూరం పాటించేలా మున్సిపల్‌ వాహనంద్వారా అప్రమత్తం చేస్తున్నారు. కరోనా వైర్‌సను తరిమికొట్టేందుకు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ప్రజలు, వ్యాపారులు శనివారం రెండో రోజు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ కొనసాగించారు. సర్పంచ్‌ బండారు శైలజారెడ్డి ఆదేశాలతో దుకాణాలు, ఫర్టిలైజర్‌ షాపులు, హోటళ్లు మూసివేశారు. దీంతో పట్టణ కేంద్రంలోన్ని రోడ్లు, వీధులన్నీ బోసిపోయి కనిపించాయి.

Updated Date - 2021-05-09T05:16:39+05:30 IST