జిల్లాలో ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-05-07T04:37:13+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులను గుర్తించేందుకు వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది.

జిల్లాలో ఇంటింటి సర్వే
క్యాతూరు మండలం లింగన్‌వాయిలో సర్వే చేస్తున్న సిబ్బంది

- కొవిడ్‌ బాధితుల గుర్తింపు

- ఒక్కరోజే 43,237 మంది నుంచి వివరాల సేకరణ

- 1,416 మందికి కొవిడ్‌ లక్షణాలు

- లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలి : డీఎంహెచ్‌వో

గద్వాలక్రైం, మే 6 : జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులను గుర్తించేందుకు వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. కొందరు కొవిడ్‌ లక్షణాలున్నా, భయంతో పరీక్ష చేయించుకునేం దుకు వెళ్లడం లేదు. ఒక వేళ పరీక్ష చేయించు కున్నాక పాజిటివ్‌గా తేలితే చుట్టుపక్కల వారు తమను దూరం పెడతారని వారు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చందూనాయక్‌ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది గురువారం ఇంటింటి సర్వే ప్రారం భించారు. 


లక్ష్యం 1,20,863 మంది 

జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,20,863 మందిని సర్వే చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించు కుంది. అందులో గురువారం ఒక్కరోజే 484 బృందాలు వివిధ ప్రాంతాలలో సర్వే చేశారు. మొత్తం 43,237 మందిని సర్వే చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. వారిలో 1,416 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, 764 మందికి కొవిడ్‌ కిట్స్‌ను అందించినట్లు చెప్పారు. మిగితా వారికి కూడా కిట్స్‌ అందించేందుకు చర్యలు తీసుకున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు.


కొవిడ్‌ లక్షణాలున్న వారి గుర్తింపు

ఇటిక్యాల : కరోనా వైరస్‌ నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఇటిక్యాల మండలంలో గురువారం వైద్యసిబ్బందిపంచాయితి సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించారు. జ్వరం వచ్చిన వారిని, కరోనా లక్షణాలు వున్నవారిని గుర్తించి, అవసరమైన పరీక్షలు చేయించి, మందులు ఇవ్వనున్నట్లు డాక్టర్‌ మాలకొండయ్య తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి, వైద్యం అందించ నున్నట్లు తెలిపారు. మందులు సక్రమంగా వాడి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చన్నారు. 


సర్వే బృందాలకు సహకరించాలి : డీఎంహెచ్‌వో

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే చేసేందుకు వచ్చే బృందం సభ్యులకు ప్రజలు సహకరించాలని డీఎంహెచ్‌వో కోరారు. అలా అయితేనే కొవిడ్‌ కట్టడి సాధ్యం అవుతుందని అన్నారు. పక్క వారు ఏం అనుకుంటారోనని మొహమాటపడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుచుకోవాలని సూచించారు. ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. చేయిదాటాకా ఆసుపత్రిలో చేరినా ఫలితం ఉండదన్నారు. 

Updated Date - 2021-05-07T04:37:13+05:30 IST