బకాయిల భారం

Published: Mon, 24 Jan 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బకాయిల భారం

మందకొడిగా ఇంటి పన్ను వసూళ్లు

కరోనాతో గత ఏడాది కంటే తగ్గిన వైనం 

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నత్తనడకే

లక్ష్యాలు చేరుకోవడంలో ఉద్యోగులు విఫలం 

అభివృద్ధికి నిధులు లేక పాలకవర్గాలు విలవిల

  

మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ఇంటి పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.కోట్లలో డిమాండ్‌ ఉండగా వసూళ్లు లక్షల్లో మాత్రమే ఉంటున్నాయి. కరోనా.. ఉపాధి కోల్పోవడం.. పంటలు దెబ్బతినడం.. వ్యాపారాలు లేకపోవడం.. పెరిగిన ధరలు.. ఖర్చులు  తదితర కారణాలతో పన్నుల వసూళ్లు ఆశాజనకంగా లేవు. పన్నుల లక్ష్యాలను అధికారులు అధిగమించకపోతుండటంతో ఏటికేడు  బకాయిల భారం పెరిగిపోతూ ఉంది. అయినా  ఉద్యోగులు వసూళ్లపై పెద్దగా శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామంటున్నా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అటు పన్నుల వసూళ్లు కాకపోవడం.. ఇటు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పురపాలక సంఘాలు, పంచాయతీల్లో ప్రగతి కుంటుపడుతోంది. మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో గత ఏడాది కంటే కూడా పన్నుల వసూళ్లు తగ్గినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఒకింత పర్వాలేదు కాని పంచాయతీల్లో సగానికి సగం కూడా పన్నులు వసూలు చేయలేకపోతున్నారంటే ఆశ్చర్యంకాదు.  


సచివాలయంతో సంకటం

గతంలో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక సిబ్బంది ఉండేవారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లకు నియమించిన సిబ్బందిని తొలగించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులపైనే పనుల వసూళ్ల భారం పడింది. అయితే ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శిపై రెండు, మూడు గ్రామాలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఈ పనిభారంతో వారు ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించలేకపోతున్నారు. జనవరి నెల పూర్తవుతున్నా ఇప్పటికి కనీసం 50 శాతం కూడా ఇంటి పన్నులు వసూలు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


  

ప్రగతికి.. ఆటంకం

మున్సిపాలిటీలు, పంచాయతీలకు ప్రధాన ఆదాయవనరైన ఇంటి పన్నుల వసూళ్లు మందగించాయి.  మౌలిక వసతుల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది. పన్నుల వసూళ్లు పూర్తిగా జరగకపోవటంతో సిబ్బంది జీతాలకు, దైనందిన కార్యకలాపాలు, పారిశుధ్య పనులు, రోడ్లు, డ్రెయిన్ల పనులు చేయించడానికి నిధులు కొరత ఏర్పడింది. ప్రగతి పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా జరగకపోవడంతో సర్పంచులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నిధుల లేమితో రెండేళ్లుగా అభివృద్ధి తిరోగమనంలో పడింది.

 

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

మునిసిపాలిటీ, మండలాల పరిధిలో ఆస్తిపన్నుల వవసూళ్లు మందగించాయి. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంటిపన్ను బకాయిల వసూళ్లు చాలా నియోజకవర్గాల్లో 50శాతం లోపు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఏటా ఈ సమయానికి 60 నుంచి 70శాతం వరకు పన్నులు వసూలయ్యేవి. కరోనా పరిస్థితుల్లో చాలా మున్సిపాలిటీల్లో 50శాతం లోపే జరిగాయి. ఇక పంచాయతీల పరిధిలో అయితే  పన్నుల వసూళ్లు దారుణంగా ఉన్నాయి.  గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్‌ విలువ ప్రకారం ప్రజలపై పన్నుల భారం పెరిగింది. అయితే ఆ స్థాయిలో వసూళ్లు ఉండటంలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్నుల వసూళ్లు ఆశాజనకంగా లేవని అధికారులే చెప్తున్నారు. కొవిడ్‌ కారణంగా సామాన్యుల ఆర్థిక  పరిస్థితి కునారిల్లటంతో ఆస్తిపన్ను చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే 10శాతం కూడా ఇంటి పన్నులు వసూళ్లు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా, వివిధ కారణాల వల్ల పన్ను బకాయిల వసూళ్లు మందగించాయని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పన్నుల వసూళ్లతో ఆదాయం సమకూర్చుకోవాలని పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా అధికారులు మార్చి నెలలోపు ఐదుశాతం పన్ను పెంపుతో చెల్లించాలని, కొన్ని పంచాయతీల్లో యజమానులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు, నగరాలలో చెత్తపన్ను ప్రవేశ పెట్టింది. ప్రతి ఇంటికి రోజుకు రూ.2, రూ.4 చొప్పున నెలనెలా వసూలు చేయాలి. ఆస్తి పన్నుల కట్టడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ చెత్త పన్ను వసూలు కష్టమని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.    

 - నరసరావుపేట మున్సిపాలిటీలో ఆస్తి, నీటి పన్నులు రూ20.70 కోట్లకు ఇప్పటికి రూ.6.04 కోట్లు  మాత్రమే వసూలు చేశారు. నరసరావుపేట మండల పరిధిలోని గ్రామాల్లో రూ.1,79,47,973 పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.22,01,132 మాత్రమే వసూలు చేశారు. రొంపిచర్ల మండలంలో రూ.84,72,338కు రూ.14,11,600 వసూలు చేశారు.  

- చిలకలూరిపేట మునిసిపాలిటీలో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.6.12 కోట్లుగా ఉండగా ఇప్పటివరకు రూ.3.13 కోట్లు మాత్రమే వసూలైంది.  చిలకలూరిపేట మండలంలో ప్రస్తుత పాత బకాయి కలుపుకుని రూ.76.77 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా రూ.18.48 లక్షలు మాత్రమే ఇప్పటి వరకు వసూలైంది. యడ్లపాడు మండలంలో మొత్తం రూ.1.45 కోట్లకు రూ.19 లక్షలు మాత్రమే వసూలైంది. నాదెండ్ల మండలంలో మొత్తం రూ.1.16 కోట్లకు రూ.7.14 లక్షలు మాత్రమే వసూలైంది. 

- తాడికొండ మండలంలో 15 పంచాయతీలకు రూ.2.82 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.82.37 లక్షల మాత్రమే వసూలు చేశారు.     

- సత్తెనపల్లి మండలంలో మొత్తం రూ.1,83,91,365లకు రూ.29,84,120 మాత్రమే వసూలైంది. ముప్పాళ్ల మండలంలో రూ.1,04,09,082లకు రూ.58 లక్షలు మాత్రమే వసూలైంది. రాజుపాలెం మండలంలో రూ.64,33,383లకు  రూ.14,94,776, నకరికల్లు మండలంలో రూ.41,08,886లకు రూ.18,34,654 మాత్రమే వసూలైంది.

- బొల్లాపల్లి మండలంలో సుమారు రూ.71 లక్షలు, శావల్యాపురం మండలంలో రూ.49 లక్షలు, వినుకొండ మండలంలో రూ.75 లక్షలు, ఈపూరు మండలంలో రూ.1.25 కోట్లు, నూజెండ్ల మండలంలో రూ.45 లక్షల బకాయిలు ఉన్నాయి. వినుకొండ మున్సిపాలిటీలో  రూ.2.80 కోట్ల పన్నులకు 90 శాతం వసూలు చేసినట్లు కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. 

- పెదకూరపాడు మండలంలో రూ.84,82,887కు రూ.15,76,227, అచ్చంపేట మండలంలో రూ.1,07,43,685కు రూ.16,75,736 మాత్రమే వసూలైంది. క్రోసూరు మండలంలో 20 శాతం, అమరావతి మండలంలోని 40 శాతం ఇంటి పన్నులను వసూలు చేశారు. 

- మాచర్ల పట్టణంలో ఇంటి పన్ను సుమారు రూ. 3 కోట్లు డిమాండ్‌ ఉండగా రూ.1.50 కోట్లు వసూలయ్యాయి. మాచర్ల మండల పరిధిలో పన్నుల వసూలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. కారంపూడి మండలంలో 10 శాతం, వెల్దుర్తి, రెంటచింతల మండలాల్లో 20 శాతంగా ఉంది. 

- వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం రూ.3 కోట్ల 80 లక్షల 50 వేలు వసూలు కావాల్సి ఉండగా కేవలం ఒక కోటి 13 లక్షలే వసూలైంది.  

- దాచేపల్లి పురపాలక సంఘ పరిధిలో రూ.1.15 కోట్లు, మాచవరం మండలంలో రూ.45.50 లక్షలు, పిడుగురాళ్ల మండలంలో రూ.కోటి, పిడుగురాళ్ల పురపాలక సంఘంలో రూ.2 కోట్లు, గురజాల మండలంలో రూ.40 లక్షలు, పురపాలక సంఘంలో రూ.50 లక్షల మేర బకాయిలున్నాయి. 

- కొల్లిపర, తెనాలి మండలాల్లో ఇంటిపన్ను డిమాండ్‌ మొత్తం రూ.3,04,65,223 ఉండగా దాంట్లో  ఇప్పటి వరకు వసూలైంది రూ.1,04,58,678 మాత్రమే.     నియోజకవర్గంలో 30శాతం కూడా వసూలు కాలేదు.     

- బాపట్ల పట్టణంలో రూ.7కోట్ల 63లక్షలకు  ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలు మాత్రమే వసూలు చేశారు. బాపట్ల మండలంలో 28 శాతం, కర్లపాలెం మండలంలో 40.10 శాతం, పిట్టలవానిపాలెం మండలంలో 30 శాతం పన్నులను వసూలు చేశారు.  

- దుగ్గిరాల మండలంలోని పంచాయతీల్లో పన్ను వసూళ్లు 18 శాతం మాత్రమే. మోరంపూడి గ్రామంలో అత్యధికంగా 80.శాతం వసూలు కాగా పెదకొండూరు 3.65శాతం, మోరంపూడిలో 4.79శాతం మాత్రమే వసూళ్లయ్యాయి.  

- పొన్నూరు మున్సిపాలిటీలో రూ.2.89 కోట్లకు  ఇప్పటి వరకు రూ.2.15 కోట్లు వసూలైంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.