నాటి ఇళ్లకు నేడు వసూళ్లా!?

ABN , First Publish Date - 2021-11-07T04:15:27+05:30 IST

జిల్లాలో 3.5 లక్షలకుపైగా ఇళ్ల రుణగ్రస్థులు ఉన్నట్లు అధికారులు అంచనా. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తయినట్లు తెలిసింది.

నాటి ఇళ్లకు నేడు వసూళ్లా!?
సంగంలో 2000లో నిర్మించిన పక్కా గృహాల కాలనీ

లబ్ధిదారుల వివరాల సేకరణ

తెరమీదకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌

పెదవి విరుస్తున్న అసలు హక్కుదారులు

చేతులు మారిన వారికి మేలు


గతంలో పేదల కోటాలో ప్రభుత్వం ద్వారా నిర్మించుకున్న ఇళ్లు.. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిలో వారివి కావు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఆ ఇంటిపై వారికి సర్వహక్కులు ఉండవు. కానీ హక్కులు పొందాలంటే ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. అదే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌. ఇప్పటికే ‘‘గతంలో ఎప్పుడైనా ఇల్లు మంజూరైందా!? ఎవరి పేరు మీద మం జూరైంది!?’ తదితర వివరాలను సర్వే పేరుతో ఇంటి యజమాని నుంచి రాబడుతున్నారు. 


సంగం, నవంబరు 6 : జిల్లాలో 3.5 లక్షలకుపైగా ఇళ్ల రుణగ్రస్థులు ఉన్నట్లు అధికారులు అంచనా. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తయినట్లు తెలిసింది. అందులో భాగంగానే వలంటీర్లు తమకు కేటాయించిన 50 ఇళ్లలో ఉన్న వారి దగ్గరకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేయనున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు,, పట్టణాల్లో రూ. 15వేలు చొప్పున వసూలు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత వారందరికీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద ధ్రువపత్రాలు అందించనున్నారు.


వివరాల సేకరణ


ప్రస్తుత ప్రభుత్వం ఆస్తులను కుదువ పెట్టి అప్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు గృహ నిర్మా ణ పథకాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. 1983 నుంచి 2015 వరకు ఈ 32 సంవత్సరాల్లో మంజూరైన ఇళ్లు ఎన్ని, ఏయే పథకాల కింద మంజూరయ్యాయి, యూనిట్‌ వ్యయం ఎంత, అన్న వివరాలను ఆరాతీసే పనిలో ఉంది. లబ్ధిదారుడి పేరు, ఆయన బతికే ఉన్నాడా.. లేకుంటే వారసులు ఉన్నారా, అసలు ఆ ఇళ్లు వారి చేతుల్లోనే ఉందా,  లేకుంటే విక్రయించారా..? అన్న సమగ్ర వివరాలను వలంటీర్ల ద్వారా సేకరిస్తున్నారు. వచ్చిన వివరాలన్నీ  సచివాలయాల్లో కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. ఆ తరువాత వీఆర్వో, సచివాలయ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వెళ్లి ఆ ఇంటికి హద్దులు నిర్ణయిస్తున్నారు. విస్తీర్ణాన్ని గుర్తిస్తున్నారు. ఈ తతంగం అంతా చకచకా జరుగుతోంది. అదే విషయాన్ని గృహ నిర్మాణ శాఖకు నివేదిస్తున్నారు. హౌసింగ్‌శాఖ కేటగిరీల వారీగా విభజించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు 3.5 లక్షల లబ్ధిదారుల నుంచి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయవచ్చునని జిల్లా అధికారులు అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.  


వసూలు ఇలా..


వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం గృహ నిర్మాణశాఖ కేటగిరీలను విభజించింది. అప్పట్లో ఇంటిని పొందిన వ్యక్తి కానీ.. ఆయన వారసులు కానీ ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 15 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. నగరాల్లో రూ. 20 వేలు వసూలు చేస్తారు. ఒక వేళ లబ్ధిదారుడు ఇంటిని విక్రయిస్తే.. కొనుగోలు చేసినవారు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 20 వేలు, నగరంలో రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో ఉన్న 3.5 లక్షల రుణగ్రస్థుల నుంచి వందలాది కోట్ల రూపాయలు వసూలవుతాయని అటు పాలకులు, ఇటు అధికారుల అంచనాలో ఉన్నారు.


పెదవి విరుపు


అప్పుడెప్పుడో ప్రభుత్వాలు నిర్మించిన పక్కా గృహాలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం వసూళ్లకు నోటీ్‌సలు ఇవ్వడంతో అసలు లబ్ధిదారులు పెదవివిరుస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో నివశిస్తుంటే ఇళ్ల మాది కాకపోతుందా ? అని అసలు లబ్ధిదారులు అంటున్నారు. కొందరు నోటీసులు తీసుకోవడం లేదు. అయితే అసలు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసినవారు మాత్రం వారి వద్ద ఎటువంటి ఆధారం లేకపోవడంతోపాటు ఇంటి స్థలాలకు విలువ పెరగడంతో ఏ రోజు ఏం జరుగుతుందో ప్రభుత్వం తీసుకువచ్చిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నగదు చెల్లించి హక్కు పత్రాలు పొందాలని చూస్తున్నారు.

Updated Date - 2021-11-07T04:15:27+05:30 IST