పత్రాలతో.. సరి

ABN , First Publish Date - 2021-12-08T05:37:00+05:30 IST

పత్రాలతో.. సరి

పత్రాలతో.. సరి
నరసరావుపేటలో నిర్మించిన గృహాలు

టిడ్కో గృహ ప్రవేశాలెప్పుడో

నెలలు గడుస్తున్నా దక్కని ఇల్ల్లు 

మౌలిక వసతులకు నిధుల కొరత

పట్టణ పేదల సొంతింటి కల నెరవేరదాయే

అద్దెలు, వడ్డీల భారంతో లబ్ధిదారుల సతమతం

రెండున్నరేళ్లుగా పాడుపెట్టడంతో శిథిలావస్థలోకి


సొంతింటి కల.. ఇంకా కలగానే ఉంది. కళ్ల ముందు కట్టిన ఇల్లు కనిపిస్తున్నా.. గృహ ప్రవేశం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. పట్టణాల్లోని పేదల కోసం గత టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నది. 32,304 మంది లబ్ధిదారులకు ఇప్పట్లో గృహయోగం కలిగేలా లేదు. ఇంటి కోసం వాటా ధనం చెల్లించేందుకు లబ్ధిదారులు తెచ్చిన మొత్తంపై వడ్డీ భారం పెరుగుతూ ఉంది. మరోవైపు అద్దెలు కట్టలేక పట్టణ పేదలు అల్లాడుతున్నారు. లబ్ధిదారుల ఆందోళనలతో దిగివచ్చిన పాలకులు ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను కొన్ని నెలల క్రితం అట్టహాసంగా పంపిణీ చేశారు. అయితే మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం పరచడంలో కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వానికి అసలు ఇళ్లు ఇచ్చే ఆలోచన ఉందా లేదా అని మండిపడుతున్నారు.  


నరసరావుపేట, డిసెంబరు 7: గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు స్వాధీన పరచడంలో పాలకులు అలసత్వం వీడటంలేదు. గత ప్రభుత్వం జిల్లాలో పట్టణ పేదల కోసం 32,304 ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. వీటిలో 25,180 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 7,124 గృహాల నిర్మాణం వివిధ దశలలో ఉంది. పూర్తయిన గృహాలను అప్పట్లోనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీటికి మౌలిక వసతులకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అరకొర పనులు కాని, మౌలిక వసతుల కల్పన కాని, లబ్ధిదారులకు పంపిణీ గురించి కాని పట్టించుకోలేదు. మధ్యలో నిలిచి పోయిన పనులు రెండున్నరేళ్లుగా వదిలేశారు. కనీసం పూర్తి చేసిన ఇళ్లను స్వాధీనం పరచకుండా కాలక్షేపం చేస్తుంది. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఆందోళనలతో మరోసారి ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అట్టహాసంగా పంపిణీ చేశారే కాని ఇప్పటి వరకు స్వాధీన పరచలేదు. ఇంటి కోసం అప్పు చేసి మరీ చెల్లించిన వాటా ధనానికి వడ్డీ పెరిగి పోతుండటంతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు నివాసాలకు అద్దె చెల్లించడం ఇలా పేదలు ఆర్థిక వెతలు ఎదుర్కొంటున్నారు. ఇంటిని ఇవ్వండి మహాప్రభో అని పేదలు కోరుతున్నా వీరి మొర ఆలకించే వారే కరువయ్యారు.


వసతుల కల్పనపై కాలయాపన

టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు స్వాధీన పరచడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. వసతుల కల్పనపై గడువులు పెంచుకుంటూ పోతుంది. ఇక పూర్తి కావాల్సిన గృహాల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. మౌలిక వసతులకు నిధుల కొరత ఏర్పడింది. ఏడాది క్రితం మౌలిక వసతుల కోసం సుమారు రూ.244 కోట్లు వ్యయం అవుతుందని టిడ్కో అంచనా వేసింది. నిధులు మంజూరు చేయడంలో జాప్యం కొనసాగుతునే ఉంది. చిలకలూరిపేట, గుంటూరు ప్రాంతాల్లో దాదాపు 4 వేల గృహాలకు మౌలిక వసతులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అయినా ఈ ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారో.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో ఎవరికీ తెలియడంలేదు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు రెండున్నరేళ్లుగా వినియోగంలోకి రాకపోవడంతో అవి శిఽథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.   


ఇల్లు పోయే.. నగదు రాదాయే   

టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఆయా పట్టణాల వారీగా పేదలను ఎంపిక చేసి లబ్ధిదారులుగా పలువురిని గుర్తించింది. వీరు అప్పట్లో తమ వాటా ధనాన్ని వడ్డీకి తెచ్చి మరీ  చెల్లించారు. ఇళ్లు పూర్తి అయ్యాయి.. గృహ ప్రవేశాలే తరువాయి.. అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం మారింది. దీంతో వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను సమీక్షించి అనర్హులని పలువురి పేర్లను తొలగించింది. ఆ ఇళ్లను మరొకరికి కూడా కేటాయించారు. అయితే లబ్ధిదారులు చెల్లించిన ఇంటి వాటా ధనం తిరిగి ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నది. ఇలాంటి వారికి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. అటు ఇల్లుపోయిందని.. వడ్డీకి తెచ్చిన నగదు కూడా ఇవ్వకుండా అధికారులు తిప్పించుకుంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-12-08T05:37:00+05:30 IST