టిడ్కో.. ఇదీ లెక్క!

ABN , First Publish Date - 2020-11-24T06:06:48+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో తలపెట్టిన టిడ్కో ఇళ్లను రూపాయికే అందిస్తామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

టిడ్కో.. ఇదీ లెక్క!

300 చదరపు అడుగుల ఇళ్లు మాత్రమే రూపాయికి!

జిల్లాలో లబ్ధి పొందేది 10 వేల మందే! 

20 వేల మంది తమ వాటా చెల్లించాల్సిందే 

రూపాయి పరిధిలోకి రాని ఇళ్లకు అలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌ 

మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అప్పగిస్తారా? 


పట్టణ ప్రాంతాల్లో తలపెట్టిన టిడ్కో ఇళ్లను రూపాయికే అందిస్తామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం రూపాయికే ఇస్తామన్న ఇళ్ల విస్తీర్ణం 300 చదరపు అడుగులు మాత్రమే. వీటిని పొందేది 10 వేల మంది. గ్రౌండింగ్‌ అయి తుది దశలో ఉన్న మిగిలిన 20 వేల ఇళ్ల లబ్ధిదారులు మాత్రం కేటగిరీని బట్టి తమ వంతు వాటా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయని ప్రభుత్వం హడావిడిగా టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా అలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఇస్తామన్న రూపాయి ఆఫర్‌ (జీరో బెనిఫిషియరీ వాటా) వర్తించే పరిస్థితి లేదు! జిల్లాలో ఈ విధంగా లబ్ధిపొందేది 10 వేల మంది మాత్రమే. మిగిలిన 20 వేల మంది లబ్ధిదారులు తమ వాటా చెల్లించాల్సిందే. జిల్లావ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, ఇతర మేజర్‌ పట్టణాల పరిధిలో మొత్తం 96,138 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్‌ వచ్చింది. అప్పట్లోనే దశల వారీగా వీటిలో 42,962 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటిలో  31,424 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయి. ఇలా గ్రౌండింగ్‌ అయిన వాటిలో 15 వేల ఇళ్ల వరకు 95 శాతం  పనులు పూర్తి చేసుకుని, ఫినిషింగ్‌, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి  ఏడాదిన్నర కాలం దాటే వరకు టిడ్కో ఇళ్లలో విజిలెన్స్‌ విచారణలు, ఇళ్ల తగ్గింపు వ్యవహారాలు నడిచాయి. ఏడాదిన్నర తర్వాత కానీ.. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఓ విధాన నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రూపాయికే టిడ్కో ఇళ్లను ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రలో పేదలకు 300 అడుగులలోపు స్థలంలో ఉచితంగా ఇంటిని నిర్మిస్తానని అప్పట్లో ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి జగన్‌ పట్టణ ప్రాంత ఇళ్లకు సంబంధించి రాయితీ కల్పించారు. టిడ్కో ఇళ్లలో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. టైప్‌-1 ఇళ్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణం, టైప్‌-2 ఇళ్లు 365 చదరపు అడుగులు, టైప్‌-3 ఇళ్లు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ ఉంటాయి. ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా పేదలకు  ఇస్తామన్న ఉచిత ఇళ్లు.. టైప్‌-1 కేటగిరీ కిందకు వస్తాయి. ఈ కేటగిరిలో జిల్లావ్యాప్తంగా 10 వేల మంది లబ్ధిదారులున్నారు. టైప్‌-2, టైప్‌-3 నివాసాలకు 20 వేల మంది లబ్ధిదారులున్నారు. వీరంతా తమ వాటా చెల్లించుకోవాల్సిందే. 


ఎవరి వాటా ఎంత? 

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల బెనిఫిషియరీ వాటాను పరిశీలిద్దాం.   టైప్‌-1  కేటగిరిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి రూ.6,65,000 వ్యయం అవుతుంది. టైప్‌-2లో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి రూ.7,65,000 వ్యయం అవుతుంది. టైప్‌-3లో 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి రూ.8,65,000 వ్యయం అవుతుంది. ఈ మూడు  కేటగిరీల్లో కూడా.. కేంద్ర ప్రభుత్వం కామన్‌గా విస్తీర్ణంతో సంబంధం లేకుండా రూ.1,50,000 గ్రాంట్‌గా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా (ఇంటి రాయితీ + మౌలిక సదుపాయాల ఖర్చు) రూ.2,50,000 ఇస్తుంది. మొత్తం రూ.4 లక్షల రాయితీ వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ పోను టైప్‌-1 ఇంటి లబ్ధిదారుడు రూ.2,65,000, టైప్‌-2 లబ్ధిదారుడు రూ.3,65,000, టైప్‌-3 లబ్ధిదారుడు 4,65,000 తన వాటాగా భరించాలి. గత ప్రభుత్వం లబ్ధిదారుని వాటాగా బ్యాంకు లోన్‌ ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో ఈ విషయమై చర్చిస్తోంది. అయితే ప్రభుత్వం అంటున్న ఉచితం పది వేల మందికే ప్రయోజనం కల్పిస్తుండగా.. 20 వేల మందికి మాత్రం రుణభారం తప్పని పరిస్థితి ఏర్పడింది. 


మిగిలిన ఇళ్లకు అలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌  

జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రూపాయి ఇళ్ల పరిధిలోకి రాని 20 వేల టిడ్కో ఇళ్లకు సంబంధించి అలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌ వచ్చాయి. దీంతో ఈ ఇళ్ల  కేటాయింపునకు దాదాపు రంగం సిద్ధం చేస్తున్నట్టే లెక్క. టైప్‌-1 ఇళ్లకు మాత్రం ఇంకా అలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వలేదు. ఈ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గుర్తించిన లబ్ధిదారుల జాబితానే అర్హతల ప్రకారం ఉండటంతో.. దానినే కొనసాగిస్తున్నారు. 


రాజకీయ కారణాలతో పేదలను ఇబ్బంది పెడతారా? 

 టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఇటీవల రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి. దీంతో ప్రభుత్వం హడావిడిగా టిడ్కో ఇళ్లకు అలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చింది. ఆర్డర్స్‌ ఇవ్వటం మంచిదే అయినా, ఫినిషింగ్‌ పనులు పూర్తి కాకుండా, మౌలిక సదుపాయాలేవీ కల్పించకుండా ఇళ్లు ఇచ్చేసి, చేతులు దులిపేసుకుంటే లబ్ధిదారులు ఆ తర్వాత పడరాని పాట్లు పడాలి. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తన వాటా బడ్జెట్‌ను విడుదల చేస్తేనే మిగిలిన పనులను పూర్తి చేయటం సాధ్యం అవుతుంది. 

Updated Date - 2020-11-24T06:06:48+05:30 IST