పట్టా.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2020-11-30T06:41:06+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీ సంగతేమోగానీ.. ఇటు ప్రజలు, అటు అధికారులు పడుతున్న టెన్షన్‌ అంతా, ఇంతా కాదు.

పట్టా.. టెన్షన్‌!

కొత్త దరఖాస్తుదారుల సంగతేమిటి? 

రెండు పర్యాయాలు వాయిదా

ప్రతిసారీ పెరిగిన లబ్ధిదారుల సంఖ్య

తొలిదశ లో అందరికీ ఇవ్వడం సాధ్యమేనా? 

అదనంగా పెరిగిన వారికి భూములెలా?

ఇళ్ల పట్టాల ముద్రణ సంగతేమిటి? 


ఇళ్ల పట్టాల పంపిణీ సంగతేమోగానీ.. ఇటు ప్రజలు, అటు అధికారులు పడుతున్న టెన్షన్‌ అంతా, ఇంతా కాదు. రోజురోజుకూ పెరిగిపోతున్న లబ్ధిదారుల సంఖ్య ఒక వైపు.. ఆ సంఖ్యకు అనుగుణంగా భూ లభ్యత లేకపోవటం మరొక వైపు అధికారులను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

 క్రిస్మస్‌ రోజు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేయటంతో.. జిల్లా యంత్రాంగం రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన సమీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటికి రెండు డివిజన్లలో సమీక్షలు జరిగాయి. మండలాల వారీగా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు సమీక్షలు జరుపుతున్నారు. పట్టాల పంపిణీ వాయిదా పడిన రెండు సందర్భాల్లోనూ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. తొలుత రెండు లక్షలుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు మూడు లక్షలకు చేరింది. ఇంతమందికి భూములను సేకరించడం అధికారులకు కత్తిమీద సామయింది. ఇప్పుడు అదనంగా పెరిగిన లబ్ధిదారుల కోసం మళ్లీ భూములను చూడడమంటే మాటలు కాదు. ప్రభుత్వ భూములు దుర్భిణీ వేసినా దొరకటం లేదు. మరోవైపు ఇంకా అర్హుల నుంచి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. వారంతా క్రిస్మస్‌ రోజు తమకు స్థలం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే కొత్తగా వచ్చిన లక్ష మందికి ఇవ్వటానికి ప్లాట్లు లేవు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. 


పట్టాల ప్రింటింగ్‌ సంగతేమిటి? 

డిసెంబరు పదో తేదీలోపు ఇళ్ల పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ డివిజన్ల పరిధిలో సమీక్షల సందర్భంగా జిల్లా యంత్రాంగం నిర్దేశిస్తోంది. వాటిని ఎక్కడ ముద్రించాలి? ఎవరు ముద్రించి ఇస్తారు? ఏ కేటగిరీ పట్టాలను ప్రింట్‌ చేయాలి? అనేదానిపై స్పష్టత లేదు. ఒక వేళ ఎవరి పరిధిలో వారు బయట ముద్రించుకోవాల్సి వస్తే.. దీనికి అయ్యే వ్యయం ఎలా? అనే అంశంపైనా స్పష్టత లేదు. దీంతో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-11-30T06:41:06+05:30 IST