సీన్‌ రివర్స్‌

ABN , First Publish Date - 2020-12-02T06:32:06+05:30 IST

జక్కులనెక్కలం భూ బాగోతానికి సంబంధించి మరిన్ని కీలక పత్రాలు మంగళవారం వెలుగు చూశాయి.

సీన్‌ రివర్స్‌
జక్కుల నెక్కలం భూ భాగోతానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన కీలక పత్రం

జక్కులనెక్కలంలో భూ బాగోతం బట్టబయలు! 

ఒరిజినల్‌ అసైనీలు కొందరే

వెలుగు చూసిన కీలకపత్రం 

చేతులు మారిన జాబితా వెలుగులోకి.. 

ఆంధ్రజ్యోతి కథనంపై వైసీపీ నేతల కస్సుబుస్సు 

వాట్సాప్‌ గ్రూప్‌లలో యాజమాన్యంపై ప్రేలాపనలు 

కీలక పత్రాలు బహిర్గతం కావటంతో సైలెంట్‌ 

రూల్స్‌ మార్చేసి.. అడ్డగోలు వయోలేషన్స్‌ 


జక్కులనెక్కలం భూ బాగోతానికి సంబంధించి మరిన్ని కీలక పత్రాలు మంగళవారం వెలుగు చూశాయి. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. జక్కులనెక్కలం భూముల సేకరణలో చోటు చేసుకున్న అవకతవకలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకు రావటంతో రెవెన్యూ యంత్రాంగం వీటిని సరిచేసుకుంనేందుకు తిప్పలు పడుతోంది. మరోవైపు ల్యాండ్‌ సీలింగ్‌ భూముల బాగోతం బయటకు రావటంతో వైసీపీ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. కాగా ఈ అవినీతిపై జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత దృష్టి సారించారు. గన్నవరం తహసీల్దారు నరసింహారావును ఈ వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకుని విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

జక్కులనెక్కలంలో పేదలకిచ్చిన సీలింగ్‌ భూములను ఇళ్ల పట్టాల కోసం రెవెన్యూ యంత్రాంగం ఎంపిక చేసింది. చేతులు మారిన భూములను నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవటమే కాకుండా.. పరిహారం కూడా మంజూరు చేయించటం వివాదాస్పదమయింది. మరోవైపు గ్రామ రెవెన్యూ అధికారిని తెర ముందు పెట్టి, కథ నడిపించిన కొందరు వైసీపీ నేతలు ఇప్పుడు కలుగు నుంచి బయటకొచ్చారు. ఈ అవినీతి కథను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో కొందరు వైసీపీ నాయకుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఆ అసహనంతోనే ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై వాట్సాప్‌గ్రూప్‌లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా కీలక పత్రాలు వెలుగులోకి రావడంతో, ఈ భూములకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. 


ఒరిజినల్‌ అసైనీలు కొందరే  

జక్కులనెక్కలం భూ వివాదం వివరాల్లోకి వెళితే.. సర్వే నెంబర్‌ 32, 33లలోని 12 ఎకరాల సీలింగ్‌ భూములను 48 మంది పేదలకు దశాబ్దం క్రితం సాగు కోసం ఇచ్చారు. దీనిలో ఒక్కొక్కరికీ 25 సెంట్ల చొప్పున కేటాయించారు. కాలక్రమంలో కొందరు తమకు కేటాయించిన భూములను అమ్ముకున్నారు. ఈ భూములను ఇళ్ల పట్టాల కోసం తీసుకోవాలని రెవెన్యూ భావించింది. తాజాగా వెలుగు చూసిన ఒక డాక్యుమెంట్‌లో చింతా శ్రీదేవి, పల్లవి విజయకుమారి, కొమరవల్లి ఝాన్సీరాణి, కర్రి ధనలక్ష్మి, వడ్లమూడి కుమారి, ములకా పైడమ్మ, గొర్రిపర్తి భూ లక్ష్మి, ఆర్‌.నాగేంద్రమ్మ, తాళ్లూరి మనోహరం, చింతపాటి అప్పాయమ్మ, మంగలపూడి మేరీకుమారి, తుండూరు దుర్గమ్మ, నందిపాముల లీలమ్మ, బండి హెలెన్‌ కుమారి, తాళ్లూరి నారాయణ, తాడిశెట్టి రాములమ్మ, చోరగుడి ప్రమీల, దేవరపల్లి లలితకుమారి, మంగలపూడి వజ్రం పేర్లను మాత్రమే ఒరిజినల్‌ అసైనీగా పొందు పరిచారు. 


చేతులు మారిన ప్లాట్లు.. 

వెలుగులోకి వచ్చిన మరో కీలక డాక్యుమెంట్‌లో పట్టాదారులు అమ్ముకోగా, చేతులు మారిన వారి జాబితా కూడా ఉండటం కలకలం రేపుతోంది. గతంలో సాగు పట్టాలు పొందిన వారిలో మంగలపూడి నిర్మల కుమారి స్థానంలో లక్క రమణ పేరు చేరింది. పట్రా ప్రసన్న స్థానంలో కాట్రు వెంకటేశ్వరరావు, పట్టాదారు సోలె రాములమ్మ స్థానంలో లక్క ఎల్లయ్య, వీర్ల బంగారమ్మ స్థానంలో వీర్ల మల్లేశ్వరి, మట్టా మరియకుమారి స్థానంలో కసిం దుర్గారావు, వీర్ల వివలమ్మ స్థానంలో సీరం సుబ్బారావు, నల్లూరి శిరోమణి స్థానంలో దేవరపల్లి శైలజ, ముళ్లపూడి లక్ష్మీప్రసన్న స్థానంలో వేమూరి వెంకట రమణ, నందిపాముల విజయకుమారి స్థానంలో వేమూరి విశ్వనాథం, పేటేటి మేరీచంద్‌ స్థానంలో వీర్ల రాంబాబు, కొక్కిలిగడ్డ అంకమ్మ స్థానంలో వీర్ల శంకరరావు, వజ్రపు నాగమణి స్థానంలో కాట్రు శివ పార్వతి, బొకినాల సౌదామణి స్థానంలో కాట్రు వెంకటేశ్వరరావు, బూర్గుల రాములమ్మ స్థానంలో లక్క రమణ, పులి శ్యామల స్థానంలో తాడి అనూష పేర్లు పొందు పరచటం గమనార్హం. 


అక్కడ  తప్పు.. ఇక్కడ ఒప్పు

చేతులు మారిన స్థలాలకు సంబంధించి ఉల్లంఘనలు ఉంటే వాటిని ఇళ్ల పట్టాలకు పరిగణనలోకి తీసుకోకూడదు. అయితే జక్కులనెక్కలంలో ఇది ఒప్పయింది.. ఇదే మండలంలోని తెంపల్లి శివారు బల్లిపర్రు గ్రామంలో తప్పుగా మారింది. ఈ గ్రామంలో పల్లపోతు సామ్రాజ్యం అనే మహిళ చేతులు మారిన 91 సెంట్ల భూమిని కొనుగోలు చేసింది. దీనిపై రెవెన్యూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత ఆమె నూజివీడు సబ్‌ కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకున్నారు. ‘చేతులు మారిన భూములను మీరెలా కొంటారు? వారెలా అమ్ముతారు?’ అంటూ ఆ భూములను స్వాధీనం చేసుకుని ఇళ్ల పట్టాల కోసం లే అవుట్‌ వేశారు. దీంతో సామ్రాజ్యం జక్కులనెక్కలం వ్యవహారాన్ని ఉదహరిస్తూ, జేసీకి ఫిర్యాదు చేశారు. కోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలోనూ ఉన్నారు. ఈ వ్యవహారంలో సామ్రాజ్యానిది తప్పయినపుడు జక్కులనెక్కలంలో భూముల వ్యవహారం ఒప్పు ఎలా అయిందనే ప్రశ్న తలెత్తుతోంది.


విచారణకు ఆదేశించిన జేసీ  

జక్కులనెక్కలం భూ బాగోతంపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం పై జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించాలని గన్నవరం తహసీల్దారు నరసింహారావును ఆదేశించారు. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. 

Updated Date - 2020-12-02T06:32:06+05:30 IST