ఇంటి బెంగ!

ABN , First Publish Date - 2022-06-20T05:45:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న గృహాల నిర్మాణం ముందుకు సాగటం లేదు.

ఇంటి బెంగ!

పేదోడి సొంతింటి కల ఎప్పుడు నెరవేరేనో?

సా...గుతూనే ఉన్న జగనన్న ఇళ్లు

పునాదులు పడని మూడొంతుల గృహాలు 

రానున్న వర్షాలకు ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం

చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లోనే

వానలు కురిస్తే ముంపునకు గురయ్యే ప్రమాదం

మెరక తోలాలని కోరుతున్న లబ్ధిదారులు 

ఇప్పట్లో తీరేలా లేని ఇంటి ఇక్కట్లు

 

పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఎవరి ఇల్లు వారే కట్టుకోవాలని మాట మార్చడంతో వారి ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఏపూటకాపూట కూలి కోసం వెతుక్కొనే పేదలు ఇళ్లు కట్టుకోవడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఎక్కడ మొదలయిందో అక్కడే ఆగిపోయింది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమై రెండేళ్లు కావస్తున్నా మూడో వంతు ఇళ్లకు పునాదులు పడలేదంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

 

గుంటూరు, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న గృహాల నిర్మాణం ముందుకు సాగటం లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత మాట మార్చింది. ఎవరి ఇళ్లు వాళ్లే నిర్మించుకోవాలని, అందుకోసం లక్షా 80 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందే. ఈ లక్షా 80 వేలతోనే నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పింది. కానీ లబ్ధిదారులకు ఎక్కడా ఇసుక ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేవు. దీనికి తోడు ఇనుము, సిమెంటు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో లబ్దిదారులు ఇల్లు కట్టలేక వదిలేశారు. ఫలితంగా జగనన్న ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింది. ఊరికి దూరంగా ప్రతి గ్రామంలోనూ జగనన్న కాలనీ పేరుతో ప్రభుత్వం లేఅవుట్‌ రూపొందించింది. అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు కొందరు ఇప్పటికీ ముందడుగు వేయటం లేదు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతం, ఇంటి సామాగ్రిధరల పెంపుతో లబ్ధిదారులు నిర్మాణానికి మొగ్గు చూపటం లేదు. పైగా వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లోనే స్థలాలు కేటాయించారు. రేపటి రోజున వానలు కురిస్తే ముంపునకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికీ చాలా లేఅవుట్‌లలో మెరకలు తోల లేదు. గత వర్షాకుఉ ఎక్కువ శాతం స్థలాల్లో నీరు నిలబడ్డాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మెరక తోలించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 


పునాదులు కూడా పడని మూడొంతుల ఇళ్లు

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం ఎక్కడ మొదలయిందో అక్కడే ఆగిపోయింది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమై రెండేళ్లు కావస్తున్నా జిల్లాలోని ఇళ్లలో మూడో వంతు ఇళ్లకు పునాదులు పడలేదంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విభజిత గుంటూరు జిల్లాలో 68,948 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 58,517 ఇళ్ల నిర్మాణం ప్రారంభమయింది. వాటిలో 44,202 ఇళ్లకు ఇప్పటి వరకూ పునాదులు కూడా పడలేదు. వాటిలో 2,614 ఇళ్లకు సంబంధించి పనులు కూడా ఇప్పటి వరకూ మొదలు కాలేదు. కాగా మిగిలిన 14,315 ఇళ్లకు పునాదులు పడినా అవి కూడా వివిద దశల్లో ఆగిపోయాయి. వాటిలో 8,639 ఇళ్లు పునాదుల దశలో ఉండగా, 1,119 ఇళ్లు మాత్రమే స్లాబు దశకు చేరాయి. మరో 2,575 ఇళ్లు స్లాబును పూర్తి చేసుకోగా, 1,982 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అయితే జగనన్న కాలనీల్లో విద్యుత్‌, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ఇవి కూడా నివాసయోగ్యంగా లేకుండాపోయాయి. 


 తెనాలి నియోజకవర్గంలోని జగనన్న కాలనీల్లో 23,856కు గాను కేవలం 618 గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. నియోజకవర్గంలో 33 లేఅవుట్లలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో మొదటి ఫేజ్‌లో 17,609 గృహాల నిర్మాణం చేపట్టారు. వీటిలో 1743 గృహాలు బేస్‌మెంట్‌ లెవల్‌ ఉండగా 251 గృహాలు రూఫ్‌ లెవల్‌లోనూ, 569 గృహాలు శ్లాబు దశలో ఉన్నాయి. లే అవుట్లలో ఇచ్చిన స్థలాలన్ని మాగాణి భూముల్లో ఉండటం, వర్షాలు కురిస్తే పొలాలతో పాటు ముంపునకు లోనయ్యే విధంగా ఉండటంతో లబ్ధిదారులు గృహ నిర్మాణానికి ముందుకు రావడం లేదు. 

  తాడికొండ నియోజకవర్గంలో లబ్ధిదారులు శంకుస్థాపనలతో సరిపెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో 5,867 ఇళ్లు మంజూరు కాగా కేవలం 224 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 315 ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేయాల్సి ఉంది. 256 ఇళ్ల నిర్మాణాలు అసలు ప్రారంభం కాలేదు. 2,788 మంది లబ్ధిదారులు కేవలం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. 1,561 ఇళ్లకు బేస్‌మెంట్‌ లెవల్‌ ఉన్నాయి. 280 ఇళ్లు స్లాబ్‌ మట్టానికి గోడలు పూర్తయ్యాయి. 50 ప్లాట్ల లేఅవుట్‌ ఉన్న కాలనీల్లో కరెంటు స్థంభాలు వేశారు. కాలనీల్లో తాత్కాలికంగా మట్టిరోడ్లు, నీటి వసతి కల్పించారు.తాడికొండ శివారు బడేపురం గ్రామంలోని లేఅవుట్‌కు సంబంధించి ఇంతవరకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయలేదు. పొన్నెకల్లులోని ఒక లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు స్థలం లెవలింగ్‌ సరిగా లేని కారణంగా నిర్మాణాలు జరగటం లేదని అధికారులు చెప్తున్నారు. 

మంగళగిరి నగరపాలకసంస్థ పరిధిలోని ఆత్మకూరు ఏరియాలో సుమారు 12.14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో 70శాతం గృహాలు గ్రౌండింగ్‌ కాగా, ఇంకా 30శాతం మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలను మొదలుపెట్టలేదు. ఈ లేఅవుట్‌లో మొత్తం 283 మందికి ప్లాట్లను కేటాయించారు.  201 మంది లబ్ధిదారులు మాత్రమే గృహ నిర్మాణాలను చేపట్టారు. 88 మంది పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలను చేశారు. ఇంకో 40మంది శ్లాబుల దశకు రాగా, మరో 13 మంది తాజాగా శ్లాబులను వేశారు. ఇంకో 62 మంది ఫౌండేషన్‌ దశలోనే వున్నారు. ఇకపోతే 82 మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్లలో ఇంకా గృహ నిర్మాణాలను చేపట్టలేదు.   

 తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఇంటి నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది.  ఇక్కడ  22 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. సీఎం ఉంటున్న నియోజకవర్గం కావడంతో అధికారులు అత్యంత జాగరూకతతో ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు. 22 ఇళ్లలో బేస్‌మెంట్‌ లెవల్‌లో 6, రూఫ్‌ లెవల్‌లో 4 ఇళ్లలో పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 12 ఇళ్లు పూర్తయ్యాయి. 


Updated Date - 2022-06-20T05:45:37+05:30 IST