ఈ దారిలో స్కూల్‌కి పోయేదెట్లా?

ABN , First Publish Date - 2022-06-24T06:05:05+05:30 IST

మండలంలోని గిరిజన బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాల రహదారి కొద్దిపాటి వర్షంతో బురదమయంగా మారింది.

ఈ దారిలో స్కూల్‌కి పోయేదెట్లా?
మట్టిరోడ్డుపై ఉన్న గుంతలు, నీటిలోనుంచి వెళ్తున్న ఉపాధ్యాయుల కారు

 గిరిజన బాలికల గురుకులానికి దారిలేక  ఇక్కట్లు

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

వైరా, జూన్‌ 23: మండలంలోని గిరిజన బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాల రహదారి కొద్దిపాటి వర్షంతో బురదమయంగా మారింది. గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్డు మొత్తం కొద్దిపాటి వర్షానికి చిత్తడిగా మారింది. మట్టి రోడ్డుపై ఉన్న గుంతల్లో వర్షపునీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా తయారైంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై వారంరోజులు దాటుతున్నా ఇక్కడకు వచ్చిన విద్యార్థుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఉపాధ్యాయ, అధ్యాపక, బోధనేతర సిబ్బంది అష్టకష్టాలు పడుతూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. మండలంలోని కొత్తముసలిమడుగు సమీపంలో పొలాల మధ్య ఖాళీగా ఉన్న భూముల్లో రూ.4.20కోట్లతో గిరిజన గురుకులాన్ని నిర్మించారు. రైతులు తమ వ్యవసాయ భూముల కోసం ఏర్పాటుచేసుకున్న మట్టిరోడ్డే ఈ గురుకులానికి దిక్కుగా ఉంది. కీలకమైన ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఈ రోడ్డు ఉన్నప్పటికీ తట్టెడు మట్టి కూడా వేసే నాథుడే కరువయ్యాడు. ఐటీడీఏ తాత్కాలిక మరమ్మతుల కోసం మంజూరు చేసిన రూ.19లక్షలను కూడా ఆతర్వాత నిలిపివేసింది. ఈ పాఠశాల ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బంది తమ గోడును అనేకసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల ద్వారా విన్నవించినప్పటికీ ఆలకించేవారే కరువయ్యారు. విధి లేని పరిస్థితుల్లో కొంతమంది సిబ్బంది ముసలిమడుగు మీదుగా ఆటోలు, కార్లలో అలాగే మరికొంతమంది సిబ్బంది తాటిపూడి నుంచి ఈ పాఠశాలకు వచ్చి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉండటంతో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ఇక్కడకు పంపించేందుకు వెనుకాడుతున్నారు. వర్షాలు ఇంకా ఎక్కువ కాకముందే తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలకు సరైన ఏర్పాట్లు చేయాలని సిబ్బంది, విద్యార్థినీల తల్లిదండ్రులు, పలువురు  కోరుతున్నారు.


Updated Date - 2022-06-24T06:05:05+05:30 IST