ఐదేళ్ల క్రితం పట్టణ శివార్లలో 800 మీటర్ల మేర జరిగిన విస్తరణ పనులు
పూడికతో సాగని నీటి ప్రవాహం
ఆక్రమణలను పట్టించుకోని అధికారులు
సమీప కాలనీలకు పొంచి ఉన్న ముప్పు
ఇకనైనా విస్తరణ పనులు జరిగేనా?
ఆత్మకూరు, జూన్ 20: గుండ్లకమ్మ వాగు విస్తరణ పనులు అటకెక్కాయి. దీంతో భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహం ముందుకు సాగకుండా సమీప కాలనీలను ముంచెత్తుతోంది. వరదల సమయంలో వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు 2017లో అప్పటి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చొరవతో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా గుండ్లకమ్మవాగు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.49లక్షలు కేటాయించి వాగు ప్రవాహ మార్గం గుండా 5.2కిమీల పొడవు, 10మీటర్ల వెడల్పు, 1.1మీటర్ల లోతుతో పనులను చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇరువైపుల వందలాది గృహాలు తొలగిపోనున్న నేపథ్యంలో వెడల్పును 10మీటర్లకు తగ్గించారు. అప్పట్లో ఓ కాంట్రాక్టర్ రూ.27 లక్షలతో ఈ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చారు. అయితే పట్టణ శివార్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్‌డీటీ గృహ నిర్మాణ సముదాయం ప్రదేశాల్లో 800మీటర్ల మేరకు విస్తరణ పనులను చేపట్టగా పట్టణంలో ఎలాంటి పనులను ప్రారంభించలేదు. దీనికితోడు పట్టణంలోని పలు కాలనీల గుండా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు విస్తరణ కోసం సుమారు 12 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రతిపాదన పంపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి రాలేదు. దీంతో గుండ్లకమ్మ వాగు విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా పట్టణ శివార్లలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగును రియల్‌ఎస్టేట్ వ్యాపారులు పూడ్చిచేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే.. ముంపు కాలనీలకు ముప్పే
నంద్యాల టర్నింగ్ సమీపంలో పంట పొలాల నడుమ ప్రవహించే గుండ్లకమ్మ వాగు నంద్యాల - ఆత్మకూరు రహదారిని దాటి ఆత్మకూరు పట్టణంలోకి ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి హుసేన్‌సానగర్, రహమత్‌నగర్, లక్ష్మీనగర్, ఏకలవ్యనగర్, సాయిబాబానగర్, ఇందిరానగర్, గరీబ్‌నగర్ నుంచి పట్టణ శివార్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్డీటీ కాలనీ మీదుగా భవనాశి నదిలో కలుస్తోంది. కాగా 2017 జూన్‌లోనే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఐదేళ్లుగా భూసేకరణ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడి గుండ్లకమ్మవాగు విస్తరణకు బ్రేక్ పడింది. గుండ్లకమ్మ వాగు విస్తరణ పట్ల రాజకీయ నేతలు, అధికారులు కఠినంగా వ్యవహరించినప్పుడే ముంపు కాలనీలకు వరద ముప్పు తప్పే అవకాశం ఉంటుంది.
సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం
ఆత్మకూరు పట్టణ శివార్లలో గుండ్లకమ్మ వాగు ఆక్రమణలపై సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రవాహ మార్గంలో అక్కడక్కడ పూడికతీత పనులు చేపట్టాం. రాబోయే వర్షాకాలంలో ముంపు కాలనీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పటికే సాయిబాబానగర్, గరీబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి స్థితిగతులపై ప్రత్యేక దృష్టి సారించాను.
- శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, ఆత్మకూరు