పాలకులే చరిత్రకు చెదలు పట్టిస్తే ఎలా?

ABN , First Publish Date - 2021-10-21T06:12:02+05:30 IST

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ చరిత్ర– సంస్కృతి నిరాదరణకు గురయ్యాయని...

పాలకులే చరిత్రకు చెదలు పట్టిస్తే ఎలా?

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ చరిత్ర– సంస్కృతి నిరాదరణకు గురయ్యాయని వాటి పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ వేసి తగు చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టే చారిత్రక కట్టడాల పరిరక్షణ ద్వారా పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుంది, ఆదాయం వస్తుంది. కానీ ఈ ప్రాంతపు విద్యార్థులకు, యువతకు తెలంగాణ చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల, చారిత్రక కట్టడాల పట్ల, చారిత్రక వ్యక్తుల పట్ల సరైన అవగాహన కల్పించకపొతే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా చారిత్రక సంపదను కాపాడుకోలేం.


టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత రెండెళ్లల్లో బీసీ, సోషల్‌, మైనారిటీ, కేజీవీబీ, ట్రైబల్‌ మొదలైన సంస్థల కింద నడిచే దాదాపు 580 పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. కానీ ఏ ఒక్క జూనియర్‌ కళాశాలలోనూ చరిత్ర సబ్జెక్టుకు సంబందించిన హెచ్ఇసి కోర్సు ప్రవేశపెట్టలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు చరిత్ర సబ్జెక్టు పట్ల వివక్ష చూపినట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్‌ విద్యలో దీనికి సముచిత స్థానం ఇవ్వడం లేదని చరిత్ర అధ్యాపకులు, పరిశోధకులు వాపోతున్నారు. 


ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన సబ్జెక్టులలో చరిత్రదే ముఖ్యమైన పాత్ర. 1969 ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు, 2001 నుంచి జరిగిన మలిదశ ఉద్యమకారులు చరిత్ర సబ్జెక్టును ప్రధాన ఆయుధంగా వాడుకుని తెలంగాణ చారిత్రక సంపద పట్ల, సంస్కృతి పట్ల జరిగిన అన్యాయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాడు. ఆంధ్ర పాలకుల దోపిడీని చరిత్ర సబ్జెక్టు ఆధారంగానే ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు స్వరాష్ట్ర సాధన తర్వాత చరిత్రకు ఎందుకు చెదలు పట్టిస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని అప్‌గ్రేడ్‌ చేసిన జూనియర్‌ కళాశాలల్లో చరిత్రను తప్పసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టాలి..

డా. తిరుపతి పోతరవేణి

Updated Date - 2021-10-21T06:12:02+05:30 IST