రైతుకు ఎంత కష్టం..?

ABN , First Publish Date - 2021-05-10T04:46:26+05:30 IST

పదేళ్ల తరువాత గత ఏడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో చుట్టుపక్కల 5వేల ఎకరాల్లో రైతులు వరిని సాగుచేశారు.

రైతుకు ఎంత కష్టం..?
ఊటుకూరు దగ్గర పడిపోయిన వరి

 మూడు నెలల కష్టం... ఎకరాకు 5వేలు నష్టం

రాజంపేట టౌన్‌, మే 9 : పదేళ్ల తరువాత గత ఏడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో చుట్టుపక్కల 5వేల ఎకరాల్లో రైతులు వరిని  సాగుచేశారు. డిసెంబరులో వర్షం కురిస్తే జనవరిలో నారుపోసి ఫిబ్రవరిలో నాటారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వరిపంట కోతకొచ్చింది. సబ్సిడీతో మంజూరు చేసిన జై శ్రీరామ్‌ తదితర రకాల వరిపంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. అయితే వరికి  ఎకరాకు 25వేల రూపాయల ఖర్చు వచ్చింది. ఇంటిల్లపాది కాయాకష్టం చేసి  నీటితడులు కట్టి 25వేల రూపాయలు ఖర్చు చేస్తే గిట్టేది 20వేలు మాత్రమే.  దీంతో ఎకరాకు 5వేల రూపాయలు నష్టం వస్తోంది.  ప్రస్తుతం 80కిలోల ధాన్యం బస్తా 1000 రూపాయల ధర పలుకుతోంది. ఈ విధంగా ఎకరాకు 20బస్తాల  ధాన్యం దిగుబడి అవుతోంది.  దీంతో కేవలం 20వేల రూపాయలు ఆదాయం వస్తోంది. దీని వల్ల పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. స్థానికంగా వండే వరిపంటను కొనేవారు కూడా లేరు. మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, చెన్నూరు ప్రాంతాల్లో పండించిన వరిపంటకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. రాజంపేటలో పండించిన వరిపంటకు పెద్దగా డిమాండ్‌ లేదు. అందువల్ల ఎకరాకు 20వేల రూపాయలు గిట్టుబాటు అవుతుండగా 25వేలు ఖర్చుగా 5వేల రూపాయలు నష్టం వస్తోంది. ఈ విధంగా రాజంపేట ప్రాంతంలో సుమారు 5వేల ఎకరాల్లో పోలి, అప్పారాజుపేట, మందరం, ఊటుకూరు, వెంకటరాజంపేట, కొండ్లోపల్లె, గుండ్లూరు, పులపత్తూరు, బగ్గిడిపల్లె, శేషమాంబపురం తదితర ప్రాంతాల్లో వరి సాగు చేసిన రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. అదే విధంగా 20రోజులుగా ఈదురుగాలులు వీస్తుండటంతో కోతకొచ్చిన వరిపంట నేలకొరుగుతోంది. దీని వల్ల కూడా నష్టం వాటిల్లుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడం, పండించిన పంటకు డిమాండ్‌ లేకపోవడం, ఈదురుగాలులు వల్ల నేలకొరగడం, తదితర కారణాలతో  రైతులకు నష్టాలే మిగిలాయి. 



Updated Date - 2021-05-10T04:46:26+05:30 IST