ఈ వైఫల్య ఉద్గారాలు తగ్గేదెన్నడు?

Nov 26 2021 @ 00:33AM

మనిషి మనుగడకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులను నియంత్రించుకోగలమా? గ్లాస్గోలో ఇటీవల ముగిసిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ఈ విషయమై ఎవరిలోనూ ఎటువంటి ఆశాభావానికి ఆస్కారమివ్వలేదు. అయితే గ్లాస్గో వాతావరణ ఒప్పందంపై ప్రపంచ దేశాలన్నీ సంతకాలు చేశాయి. భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకూడదనే లక్ష్య సాధనకు ఈ ఒడంబడిక ఏ మేరకు దోహదం చేయగలదు? ‘ప్చ్’! అన్నదే నా సమాధానం. అవును, విషమిస్తున్న వాతావరణ మార్పులను ఆ ఒప్పందం అరికట్టలేదు. నేనీ వాస్తవాన్ని పదే పదే గట్టిగా చెప్పదలిచాను.


నైరాశ్యమా? కావచ్చు. హరితగృహ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఏ దేశమూ చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. అంతేకాదు, సంపన్న- వర్ధమాన దేశాల మధ్య పరస్పర అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని గ్లాస్గో వాతావరణ సదస్సు మరోసారి స్పష్టంగా ఎత్తి చూపింది. వాతావరణ మార్పులపై పోరాడేందుకు గాను ప్రపంచదేశాల మధ్య మున్నెన్నడూ లేని స్థాయిలో సహాయసహకారాలు అత్యంత అవసరమన్న సత్యాన్ని ప్రతి దేశమూ గుర్తించేలా చేసేందుకు గ్లాస్గో సదస్సు చేసిన దోహదమేమీ లేదు. 


ఎంత నిరాశా నిస్పృహల్లోనూ ఎవరికైనా కించిత్ ఆశ మిణుకు మిణుకు మంటూనే ఉంటుంది కదా. గ్లాస్గో సదస్సుతో సమకూరిన లబ్ధిని కూడా వివరిస్తాను. కొవిడ్ విలయం కారణంగా రెండు సంవత్సరాల విరామం అనంతరం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు గ్లాస్గోలో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులతోనే ప్రాకృతిక ప్రమాదాలు వాటిల్లుతున్నాయనేది నూటికి నూరు శాతం వాస్తవమని, వాటిని అదుపు చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టవలసిన అవసరముందనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయి; ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ధరిత్రిని ఈ సంక్షోభాల నుంచి సంరక్షించుకోవాలంటే హరితగృహ వాయువుల ఉద్గారాలను ఈ దశాబ్దం ముగిసేలోగానే తగ్గించుకుని తీరాలి. ఈ విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా మానవాళి భవిష్యత్తు ఛిద్రమై పోతుంది. 


గ్లాస్గో వాతావరణ ఒడంబడికలోని ప్రాథమిక, ప్రమాదకర లోపం దాని ఆరంభంలోనే బయటపడింది. ‘కొంతమందికి వాతావరణ న్యాయభావన ఎంత ముఖ్యమో ఈ ఒప్పందం గుర్తించిందని’ చాలా చులకనగా అందులో వ్యాఖ్యానించారు. దీంతో, వాతావరణ మార్పుల నియంత్రణకు ఆ ఒడంబడిక ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక కూలిపోయింది. నేను ఈ విషయాన్ని ఇంత నిష్కర్షగా ఎందుకు చెబుతున్నాను? వాతావరణ మార్పులు అనేవి గతకాలానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాలు. నిర్దిష్ట దేశాలు (అమెరికా, 27 యూరోపియన్ యూనియన్ దేశాలు, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, మరీ ముఖ్యంగా ఇప్పుడు చైనా) భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న హరితగృహ వాయువుల ఉద్గారాలలో 70 శాతానికి కారణంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనం కొట్టివేయలేము. అయితే ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ప్రజల అభివృద్ధి హక్కును గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ జనాభా ఉన్న పేద, వర్ధమాన దేశాలు అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్న కొద్దీ వాతావరణంలోకి భూతాప కారక ఉద్గారాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఈ మౌలిక వాస్తవం దృష్ట్యానే వాతావరణ న్యాయం అనే భావన కొంతమందికి అత్యవసరం. ఆ భావన వారికి ‘ముఖ్యం’ అని చులకనభావంతో చూడడం తగదుగాక తగదు. 


గ్లాస్గో ఒడంబడికలో ఈ అవగాహన కొరవడింది. ఇదే అసలు సమస్య. కనుకనే సదస్సు ముగింపులో జాప్యం జరిగింది. బొగ్గు వినియోగం తగ్గింపు విషయమై వాద ప్రతివాదాలు జరిగాయి. యూరోపియన్ యూనియన్ ప్రతినిధి ఒకరు వర్థమానదేశాల వారి వాదనలను ఆక్షేపించారు. వాతావరణ మార్పులను అదుపుచేయాల్సిన ఆవశ్యకతను గుర్తించడం లేదని తీవ్రస్వరంతో అన్నారు. మరి పేదదేశాలు తమ అభివృద్ధి హక్కును ఎలా వదులుకుంటాయి? బొగ్గుపై ఆధారపడకుండా ఉండడం వాటికెలా సాధ్యమవుతుంది? అలా సాధ్యమయ్యేలా, ధనికదేశాలు వాటికి తమ సహాయసహకారాలను అందిస్తాయా? ఇవన్నీ ప్రశ్నలే – సమాధానాలు లేని ప్రశ్నలు (అన్నట్టు యూరోపియన్ యూనియన్‌కు చెందిన అనేక దేశాలలో బొగ్గు వినియోగాన్ని ఇంకా పూర్తిగా నిలిపివేయలేదు. మరి ఈ ప్రతినిధి పేదదేశాలను ఎలా ఆక్షేపించాడు?).


యూరోపియన్ యూనియన్‌తో సహా సంపన్నదేశాలు ఇప్పటికే శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణంలో విడుదల చేసిన హరితగృహ వాయువుల మూలంగా సంభవిస్తున్న వాతావరణ వైపరీత్యాలకు, వాటి కంటే ఎక్కువగా పేద, వర్థమానదేశాలు అల్లల్లాడిపోతున్న కాలమిది. అయినా తమ పారిశ్రామిక కార్యకలాపాలతో పర్యావరణానికి చేసిన నష్టాన్ని నివారించేందుకు అన్ని విధాల పూనుకుంటామని హామీ ఇచ్చిన సంపన్నదేశాలు తమ మాట మీద నిలబడ్డాయా? లేదు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఉత్కృష్ట మాటలతో ఉన్న సమస్య తీరిపోదు. నష్ట పరిహారాన్ని సంపూర్ణంగా చెల్లించినప్పుడు మాత్రమే పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సత్యాన్ని సంపన్నదేశాలు ఎప్పుడు పట్టించుకుంటాయి?వాతావరణ వైపరీత్యాలతో సంభవిస్తున్న వినాశనాన్ని సమర్థంగా ఎదుర్కోవడమెలా? ఆ మార్పులతో ఒక విధంగా సర్దుబాటు చేసుకోవడం వల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనముంటుంది. అయితే ఇందుకు పేదదేశాలకు ఆర్థిక సహాయమందించవలసిన అవసరముంది. ఈ విషయాన్ని గ్లాస్గో ఒడంబడిక అంగీకరించింది. ఇదొక్కటే అది సాధించిన ప్రగతి అని చెప్పవచ్చు. ఇది నిజమే కానీ, ఈ విషయంలో ఆ ఒడంబడిక మరేమీ పటిష్ఠ చర్యలు ప్రతిపాదించలేదు. పేదదేశాలకు సహాయపడే విషయమై సంపన్నదేశాలు నిర్దిష్ట హామీలు ఏమీ ఇవ్వలేదు. వాతావరణ మార్పులను అరికట్టేందుకై పేదదేశాలకు 2020 సంవత్సరం నాటికి పదివేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయమందిస్తామన్న సంపన్న దేశాల హామీ హామీగానే ఉండిపోవడం పట్ల గ్లాస్గో ఒప్పందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వాతావరణ ఆర్థిక వనరులు (క్లైమేట్ ఫైనాన్స్) సమకూర్చడం సంపన్నదేశాల నైతిక బాధ్యత. దీనిని తమ ‘దాతృత్వం’లో భాగంగా గతంలో అవి పరిగణించాయి. ఇప్పుడు ఆ ఉదార వితరణకు సంపన్నదేశాలు స్వస్తి చెప్పాయి. అలాంటి చెల్లింపులు ఇక ఉండబోవని అమెరికా తదితర దేశాలు స్పష్టం చేశాయి. ఇటువంటి ఆర్థిక తోడ్పాటు నందించడం సంపన్న దేశాలకు ఇష్టం లేదు కనుకనే గ్లాస్గో ఒడంబడికలో వాతావరణ న్యాయ భావన కొంతమందికి అత్యంత ముఖ్యమయిందని చులకనగా పేర్కొనడం జరిగింది. అయితే వాతావరణంలో సంచితమైన కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలకు బాధ్యత తమదే గనుక వాటి తగ్గింపునకు సంపన్న దేశాలు పూర్తి బాధ్యత వహించితీరాలి. సమస్యను సృష్టించిన వారే సమస్యను పరిష్కరించి తీరాలి. 


ఉద్గారాలకు కారణం కాని దేశాల అభివృద్ధి హక్కును అంగీకరించి తీరాలి. ఆర్థిక వనరుల రూపేణా, సాంకేతికతల రూపేణా ఆ దేశాలకు సహాయమందించాలి. కర్బన ఉద్గారాలు స్వల్పస్థాయిలో ఉండేలా తమ అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించుకోవడంపై పేదదేశాలు శ్రద్ధ చూపాలి. పరస్పర ఆధారితమైన ఈ ప్రపంచంలో అన్ని దేశాల మధ్య, మరీ ముఖ్యంగా వాతావరణ మార్పులపై పోరులో సహాయసహకారాలు ఎంతైనా అవసరం.


బొగ్గు వినియోగానికి స్వస్తి చెప్పవలసిందే. అయితే అది దశల వారీగా జరగవలసిన అవసరముంది. పేదదేశాలకు సంపన్నదేశాలు చిత్తశుద్ధితో ఆర్థిక సహాయమందించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతున్న విపత్సమయంలో విశాల హృదయంతో సహాయమందించకపోతే ఎలా?

సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.